Main Atal Hoon Trailer: దేశం కోసం జీవితం అంకితం, మాజీ ప్రధాని వాజ్‌పేయి బయోపిక్ ట్రైలర్ చూశారా?
Main Atal Hoon Trailer: మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి బయోపిక్ గా రూపొందుతున్న చిత్రం `మెయిన్ అటల్ హూన్`. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.
Main Atal Hoon Trailer: బయోపిక్ చిత్రాల విషయంలో మేకర్స్ మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. గత కొంతకాలంగా పలువురు క్రీడాకారులు, చరిత్రకారులు, రాజకీయ నాయకుల బయోపిక్స్ తెరకెక్కిస్తున్నారు. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రూపొందుతోంది. `మెయిన్ అటల్ హూన్` టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. రవి జాదవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించి 3 నిమిషాల 37 సెకన్ల నిడివిగల ట్రైలర్ లో వాజ్‌పేయి జీవితానికి సంబంధించిన అనేక కీలక విషయాలను పొందుపరిచారు.
వాజ్ పేయి జీవితంలో కీలక అంశాలతో ట్రైలర్
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు పంకజ్ తివారీ దివంగత ప్రధానమంత్రి వాజ్ పేయిగా నటించారు. యువజన నాయకుడిగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన వాజ్ పేయి ప్రధానమంత్రి వరకు ఎలా ఎదిగారు అనేది చూపించారు. ఈ ట్రైలర్ లో వాజ్ పేయి హాస్యచతురతను చూపించే ప్రయత్నం చేశారు. వాజ్ పేయి బిజెపి ఏర్పాటు చేయడంతో పాటు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆయన పడిన కష్టాన్ని ఇందులో ఆవిష్కరించారు. ఎడ్యుకేషన్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, సైన్స్ రంగాలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను చూపించారు. ఆయన ప్రభుత్వం కూలిపోవడం, మళ్లీ అధికారంలోకి రావడం, ప్రపంచ దేశాలతో సంబంధాలు నెలకొల్పడం, ప్రొఖ్రాన్ పరీక్షలను నిర్వహించడం లాంటి ముఖ్య ఘటనలను చూపించారు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకున్న వాజ్ పేయి, మూడుసార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించి, దేశానికి అంకితభావంతో పని చేసిన అంశాన్ని ఈ ట్రైలర్ లో చూపించారు.
జనవరి 19న ‘మెయిన్ అటల్ హూన్’ విడుదల
‘మెయిన్ అటల్ హూన్’ సినిమాకు రవి జాదవ్ దర్శకత్వం వహించారు. అటల్ బిహారీ వాజ్‌పేయిగా పంకజ్ త్రిపాఠి నటించారు. అచ్చం వాజ్ పేయి మాదిరిగానే కనిపించి ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రానికి సలీం సులైమాన్ సంగీతం అందించారు. రిషి వీరమణి, రవి జాదవ్ ఈ సినిమాకు కథను అందించారు. ఈ సినిమా 19 జనవరి 2024న విడుదలకు రెడీ అవుతోంది. వాస్తవానికి ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం కారణంగా వచ్చే నెలకు వాయిదా పడింది.
సంతోషం వ్యక్తం చేసిన పంకజ్ త్రిపాఠి
ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యాక నటుడు పంకజ్ త్రిపాఠి సంతోషం వ్యక్తం చేశారు. ఈ ట్రైలర్ చూసి ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నట్లు వెల్లడించారు. “అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్రతో నటించడం చాలా సంతోషంగా ఉంది. వాజ్ పేయి నిజంగా గొప్ప చరిత్రకారుడు. రాజకీయ నాయకుడు. ఆయన స్ఫూర్తిదాయకమైన కథను ప్రపంచానికి అందించడం నిజంగా గౌరవం. ఆ ప్రయాణంలో నేను భాగస్వామిని కావడం సంతోషం. అటల్ జీ కథను ఉన్నది ఉన్నట్లుగా తెరపైకి తీసుకు వస్తున్నాం. మా ప్రయత్నాలను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం” అని తెలిపారు.
Read Also: నటి గౌతమి ఆస్తుల కేసులో నిందితులకు ఎదురుదెబ్బ - బెయిల్ నిరాకరించిన కోర్టు