(Source: ECI/ABP News/ABP Majha)
Mahesh Interview : పాటలు లేకున్నా 'ఖైదీ', 'విక్రమ్' చూశారుగా - 'హంట్' దర్శకుడు మహేష్ ఇంటర్వ్యూ
సుధీర్ బాబు 'హంట్' సినిమా జనవరి 26న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మహేష్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
బాక్సాఫీస్ బరిలో వసూళ్ళ వేటకు 'హంట్'తో ఈ గురువారం (జనవరి 26న) నైట్రో స్టార్ సుధీర్ బాబు థియేటర్లలోకి వస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన టీజర్, ట్రైలర్, అప్సరా రాణితో సుధీర్ బాబు, భరత్, శ్రీకాంత్ స్టెప్పులు వేసిన 'పాపతో జరా పైలం...' పాట ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రచార చిత్రాలు చూస్తే పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతోంది. అయితే... యాక్షన్ మాత్రమే కాదని, సినిమాలో మంచి డ్రామా ఉందని దర్శకుడు మహేష్ చెబుతున్నారు.
'హంట్' గురువారం విడుదల కానున్న సందర్భంగా మీడియాతో దర్శకుడు మహేష్ ముచ్చటించారు. సినిమా చూసిన తర్వాత బరువెక్కిన గుండెతో థియేటర్ నుంచి బయటకు ప్రేక్షకులు వస్తారని ఆయన చెప్పారు. భవ్య క్రియేషన్స్ అధినేత వి. ఆనంద ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి లేకపోతే ఈ సినిమా లేదని... వాళ్ళిద్దరి వల్లే తాను ఈ రోజు ఇలా నిలబడ్డానని చెప్పారు. హిట్ దర్శకుడిని చూసుకున్నట్టు తనను చూసుకున్నారని చెప్పారు. ఇంకా మహేష్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...
ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయినా సరే...
''నేను దర్శకుడు తేజ గారి దగ్గర పని చేశా. సహాయ దర్శకుడిగా నా తొలి సినిమా భవ్య క్రియేషన్స్ సంస్థలో చేశా. నా తొలి సినిమా కమర్షియల్ పరంగా విజయం సాధించలేదు. అయినా సరే నాతో సినిమా చేయడానికి ఆనంద ప్రసాద్, అన్నే రవి గారు ముందుకు వచ్చారు. నాతో సినిమా చేయడం ఫిక్స్. తర్వాత హీరో ఎవరని ఆలోచించారు''.
ముందు ప్రేమకథ అనుకున్నాం! కానీ...
''మొదట ఓ ప్రేమ కథ చేయాలని అనుకున్నాం. అయితే, స్క్రిప్ట్ స్టేజిలోనే ఆ కథను పక్కన పెట్టేశాం. తర్వాత ఓ స్పై థ్రిల్లర్ అనుకున్నాం. అది కూడా కంప్లీట్ యాక్షన్ ఫిల్మ్. ఆ కథ హీరోలకు చెబుతున్న సమయంలో... 'హంట్' ఐడియా చెప్పా. ఇది నేను ఎప్పుడో రాసుకున్నా. స్క్రిప్ట్ రెడీగా ఉండటంతో వెంటనే చేద్దామని చెప్పారు. సుధీర్ బాబు అయితే బావుంటుందన్నారు. ఆయన కూడా కథ విని వెంటనే ఓకే చేశారు. రెండు రోజుల్లో సినిమా ఫైనలైజ్ అయ్యింది''.
సుధీర్ బాబు మనసులో ఉన్నది చెప్పేస్తారు
''సుధీర్ బాబు చాలా మంచి మనిషి. నిజాయతీగా ఉంటారు. ఒకవేళ ఆయన ఏదైనా ఫీల్ అయితే... ''నాకు ఈ విధంగా అనిపిస్తుంది. కానీ, తుది నిర్ణయం మాత్రం నీదే'' అని మనసులో ఉన్నది చెప్పేస్తారు. క్రమశిక్షణతో ఉంటారు. టైమ్ అంటే టైమ్. ఇప్పుడీ 'హంట్' కథలో హీరోయిన్ లేదు. సాధారణంగా కమర్షియల్ సినిమా లెక్కల్లో అదొక రిస్క్. హీరోలు ఇటువంటివి ఆలోచిస్తారు. కానీ, అవేవీ పట్టించుకోకుండా సుధీర్ బాబు నాకు ఎంతో సపోర్ట్ చేశారు''.
కథకు అడ్డు వస్తాయని పాటలు పెట్టలేదు
''సినిమాలో ఒక్క పాట మాత్రమే ఉంది. అది న్యూ ఇయర్ పార్టీ సాంగ్ టైపులో ఉంటుంది. సినిమా నుంచి ప్రేక్షకుడిని డైవర్ట్ చేస్తాయేమోనని పాటలు పెట్టలేదు. 'ఖైదీ' కథ ఓ రాత్రిలో జరుగుతుంది. సినిమాలో లేడీ క్యారెక్టర్ కనిపించదు. 'విక్రమ్' చూడండి. అందులోనూ హీరోయిన్ లేదు, నిడివి 2.50 గంటలు. డ్రగ్స్, విలన్స్, ఫైట్స్... అయినా ప్రేక్షకులు చూశారు. నాకు ఆ సినిమాలు కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. మా 'హంట్' స్క్రిప్ట్ రాసిన తర్వాత అవి రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు కాబట్టి మా సినిమాను కూడా ఆదరిస్తారని నమ్మకం కలిగింది''.
భరత్... శ్రీకాంత్ ఎందుకంటే?
''సినిమాలో భరత్ చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఆయనకు ముందు తెలుగులో నటులు కొందరిని పరిశీలించాం. అయితే... సుధీర్ బాబు, భరత్ కాంబినేషన్ కొత్తగా ఉంటుందని ఆయన్ను తీసుకున్నా. కథ నచ్చడంతో పాటు నేను నేరేషన్ ఇచ్చిన సమయంలో తెలుగు సినిమా చేయాలని భరత్ చూస్తున్నారు. అందుకని, వెంటనే ఓకే చెప్పారు. సినిమాలో సుధీర్ బాబుకు సలహాలు ఇస్తూ... నైతికంగా ఆయనకు మద్దతు ఇచ్చే మార్గదర్శి లాంటి క్యారెక్టర్ ఒకటి ఉంది. శ్రీకాంత్ గారు అయితే ఆ పాత్రకు బావుంటుందని, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ బావుందని తీసుకున్నా''.
Also Read : 'గజినీ' టైపులో 'హంట్' ఉంటుందా? - ఇదిగో మహేష్ క్లారిటీ
ఒక్క లైనులో 'హంట్' కథ ఇదే
''యాక్సిడెంట్ జరగడంతో గతం మర్చిపోయిన పోలీస్ ఆఫీసర్... తన జీవితంలో జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్ తాలూకూ మిస్టరీని ఎలా చేధించాడు? అనేది సినిమా. ఒక్క లైనులో చెప్పాలంటే కథ ఇదే. మిస్టరీ చేధించే క్రమంలో హీరో తన గురించి తెలుసుకుంటాడు. సినిమాలో యాక్షన్ రియలిస్టిక్‌గా ఉండాలని ఫారిన్ స్టంట్ కొరియోగ్రాఫర్స్‌ను తీసుకున్నాం. ఇండియాలోని ఒక పార్కింగ్ ఏరియాలో ఫైట్ జరుగుతుంది. దాన్ని పారిస్‌లోని పార్కింగ్ ఏరియాలో తీశాం. ఎందుకంటే... ఫారిన్ స్టంట్ మాస్టర్స్ బాడీ లాంగ్వేజ్, మన ఫైటర్స్ బాడీ లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది. రియల్‌గా ఉండాలని అక్కడ చేశాం''.
Also Read : అక్కినేనిని బాలకృష్ణ అంత మాట అన్నారా? - మండిపడుతున్న ఏయన్నార్ అభిమానులు!
ఫైట్స్ వల్ల సినిమాలు ఆడవు
''ప్రచార చిత్రాలు విడుదలైన తర్వాత అందరూ యాక్షన్, స్టంట్స్, ఫైట్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఫైట్స్ వల్ల సినిమాలు ఆడతాయని నేను నమ్మను. ఎమోషనల్ కంటెంట్, డ్రామా సినిమాను నిలబెడతాయి. సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్ మధ్య స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది. అది ప్రేక్షకులను వెంటాడుతుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ చూసేటప్పుడు ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతారు. సుధీర్ బాబు కెరీర్ డిఫైన్ చేసే సినిమా అవుతుందిది. అతను ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా ఉంటుంది''.
Also Read : నా జీవితానికి బాలకృష్ణే శివుడు, 'అఖండ' చేసేటప్పుడు ఆమ్లెట్ కూడా తినలేదు - తమన్ వైరల్ స్పీచ్