Mahesh Babu : మహేష్ బాబుకు వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు - కంటతడి పెట్టిస్తున్న సితార భావోద్వేగం
ఇందిరా దేవి అంత్యక్రియలు మహాప్రస్థానంలో ముగిశాయి. తల్లికి మహేష్ తలకొరివి పెట్టినట్లు తెలిసింది. నానమ్మ మరణం తట్టుకోలేక సితార వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యాలు ఘట్టమనేని అభిమానులను కంటతడి పెట్టించాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కు ఈ రోజు వచ్చిన కష్టం కలలో కూడా ఎవరికీ రాకూడదని ఘట్టమనేని అభిమానులు, సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడు కోరుకుంటున్నారు. ఒక వైపు తల్లి దూరమైన బాధ... మరో వైపు నానమ్మ పోయిన దుఃఖంలో ఉన్న కుమార్తెకు ఓదార్పు... తల్లి మరణించిన బాధను దిగమింగుతూ, కుమార్తెను ఆయన ఓదార్చిన తీరు ప్రతి ఒక్కరి మనసులను కలచివేసింది.
వెక్కి వెక్కి ఏడ్చిన సితార
సూపర్ స్టార్ కృష్ణ భార్య, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి (Indira Devi) బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమె మరణంతో ఘట్టమనేని కుటుంబం శోక సంద్రంలో మునిగింది. ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మహేష్ కుమార్తె సితార ఘట్టమనేని (Sitara Ghattamaneni) అయితే నానమ్మ మరణం తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చారు. అమ్మాయిని మహేష్ ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆ దృశ్యాలు ప్రత్యక్షంగా అక్కడ ఉన్న వాళ్ళతో పాటు మీడియాలో లైవ్ చూస్తున్న ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి.
ముగిసిన అంత్యక్రియలు
ప్రముఖులు, ప్రేక్షకుల సందర్శనార్థం బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ పద్మాలయ స్టూడియోస్‌లో ఇందిరా దేవి పార్థీవ దేహాన్ని ఉంచారు. ఆమెకు మోహన్ బాబు, మురళీ మోహన్, రాఘవేంద్రరావు, బి. గోపాల్, అక్కినేని నాగార్జున, వెంకటేష్, రానా దగ్గుబాటి సహా పలువురు సినిమా ప్రముఖులు తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సహా పలువురు రాజకీయ నాయకులు నివాళులు అర్పించారు.
మధ్యాహ్నం తర్వాత పద్మాలయ స్టూడియోస్ నుంచి ఇందిరా దేవి అంతిమ యాత్ర ప్రారంభం అయ్యింది. మహా ప్రస్థానంలో ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తల్లికి మహేష్ తలకొరివి పెట్టినట్లు సమాచారం అందింది. ఇందిరా దేవి అంత్యక్రియల్లో ఘట్టమనేని కృష్ణ కుటుంబ సభ్యులు, బంధువులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే పాల్గొన్నట్లు తెలిసింది.
Also Read : మహేష్ బాబును ఓదార్చిన కేటీఆర్, ధైర్యం చెప్పిన త్రివిక్రమ్ - ఇందిరా దేవికి ప్రముఖులు నివాళులు
కృష్ణ, ఇండియా దేవి దంపతులకు ఐదుగురు సంతానం. పెద్దమ్మాయి పద్మావతిని గల్లా జయదేవ్‌కు ఇచ్చి వివాహం చేశారు. రెండో అమ్మాయి మంజుల నటిగా, నిర్మాతగా ప్రేక్షకులకు తెలుసు. ఆమె భర్త సంజయ్ స్వరూప్ నటుడు. మూడో అమ్మాయి ప్రియదర్శిని యువ హీరో సుధీర్ బాబుకు ఇచ్చి పెళ్లి చేశారు. మహేష్ సోదరుడు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాలు చేశారు.
నాకు దైవంతో సమానం : మహేష్ బాబు
తల్లి అంటే మహేష్ బాబుకు ఎంతో ప్రేమ. పలు సందర్భాల్లో తల్లిపై తనకు ఉన్న గౌరవాన్ని, ప్రేమను ఆయన చాటుకున్నారు. ''అమ్మ అంటే నాకు దైవంతో సమానం. నేను టెన్షన్ పడినా... ఏ విషయంలో అయినా నెర్వస్ గా అనిపించినా... అమ్మ దగ్గరకు వెళ్లి ఆవిడ పెట్టిన కాఫీ తాగుతాను. నా టెన్షన్ మొత్తం పోతుంది'' అని మహేష్ చెబుతుంటారు.
ఏడాది ప్రారంభంలో అన్నయ్య రమేష్ బాబు మరణం మహేష్ బాబును ఎంతగానో బాధ పెట్టింది. ఆ బాధ నుంచి ఆయన కోలుకోవడానికి కొన్ని రోజులు పట్టిందని సన్నిహితులు చెబుతుంటారు. ఇప్పుడు తల్లి మరణం ఆయన్ను మరింత బాధకు గురి చేసింది.
Also Read : మహేష్ మదర్ రేర్ ఫొటోస్ - ఇందిర, కృష్ణలను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు
View this post on Instagram