Yashoda Movie: సమంత కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్
హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ నేతృత్వంలో 'యశోద' కోసం కీలక యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసింది సమంత.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత డిసెంబర్ లో విడుదలైన 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నాలుగైదు సినిమాలను లైన్ లో పెట్టింది. ముందుగా 'యశోద' అనే సినిమాను పూర్తి చేయబోతుంది. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో సమంత గర్భవతి పాత్రలో కనిపించనుందని కొందరు.. కాదు, కాదు నర్స్ పాత్ర పోషించనుందని మరికొందరు అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
ఫిమేల్ సెంట్రిక్ సినిమా అయినప్పటికీ ఇందులో యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయట. ఇటీవల హైదరాబాద్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. దీనికోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ సినిమాలు 'ట్రాన్స్ పోర్టర్ 3', 'ప్రాజెక్ట్ 7', 'ప్యారిస్ బై నైట్ ఆఫ్ లివింగ్ డెడ్', 'సిటీ హంటర్', క్రిస్టోఫర్ నోలన్ 'ఇన్సెప్షన్', 'డంకర్క్' వంటి సినిమాలకు స్టంట్ పెర్ఫార్మర్ గా పని చేసిన యానిక్ బెన్ ను ఈ సినిమా కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది.
యానిక్ బెన్ నేతృత్వంలో 'యశోద' కోసం కీలక యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ ను కంప్లీట్ చేసింది సమంత. హరి, హరీష్ అనే ఇద్దరు దర్శకులు ఈ సినిమాను రూపొందిస్తున్నారు.శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తరువాత తాప్సి నిర్మాణంలో బాలీవుడ్ లో ఓ సినిమా చేయబోతుంది సమంత. అలానే ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లో నటించనుంది. ఇది కాకుండా.. ఓ బైలింగ్యువల్ సినిమా కూడా ఆమె లిస్ట్ లో ఉంది. మొత్తానికి వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది సామ్.
View this post on Instagram