Kannada Actor Arrested: అభ్యంతరకర ట్వీట్ - ప్రముఖ నటుడు అరెస్ట్
కన్నడ నటుడు చేతన్ కుమార్ ను బెంగళూరులోని శేషాద్రిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇటీవల హిందుత్వ పై సోషల్ మీడియా వేదికగా కొన్ని ట్వీట్ లు చేశారు.
కన్నడ నటుడు చేతన్ కుమార్ ను బెంగళూరులోని శేషాద్రిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇటీవల హిందుత్వ పై సోషల్ మీడియా వేదికగా కొన్ని ట్వీట్ లు చేశారు. ఈ ట్వీట్ లు చేసిన వెంటనే ఎంతో మంది దీనిపై కామెంట్లు మొదలుపెట్టారు. కొద్ది సేపటికి హిందూ సంఘాలు స్పందించి చేతన్ పై పోలస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు చేతన్ ను అదుపులోకి తీసుకున్నారు.
హిందుత్వాన్ని అబద్ధపు పునాదుల మీద నిర్మించారంటూ చేసిన ట్వీట్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా చేతన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. చేతన్ కుమార్ ను అక్కడ చేతన్ అహింసగా కూడా పిలుస్తారు. ఆయనకు దళిత, గిరిజన యాక్టివిస్టు గా కూడా గుర్తింపు ఉంది. అరెస్ట్ అనంతరం చేతన్ ను జిల్లా కోర్టు లో హాజరు పరిచారు.
మత విశ్వాసాలను అవమానించడమే కాకుండా కొన్ని వర్గాల మధ్య వైషమ్యాలను పెంచేలా ఆయన ట్వీట్ లు ఉన్నాయనే అభియోగాలను చేతన్ ఎదుర్కొంటున్నారు. ఇటీవల మార్చి 20 న చేతన్ ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశారు అదేంటంటే.. హిందుత్వాన్ని పూర్తిగా అవాస్తవాల పునాదిగా నిర్మించారని అన్నారు. అందులో.. రావణుడిని రాముడు ఓడించి అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాతే భారత జాతి మొదలైందని సావర్కర్ చెప్పారన్నది ఓ అబద్దం అని ట్వీట్ చేశారు చేతన్. అందులోనే 1992 ను కోడ్ చేస్తూ.. బాబ్రీ మసీద్ రాముని జన్మస్థలం అన్నది కూడా ఒక అబద్దం అన్నారు. అలాగే 2023ను కోడ్ చేస్తూ.. ఉరిగౌడా, నంజెగౌడాలు టిప్పును అంతమొందించారనేది ఒక అబద్దం అని రాసుకొచ్చారు. హిందుత్వంను కేవలం నిజం మాత్రమే ఓడించగలదని, ఆ నిజమే సమానత్వం అని చెప్పుకొచ్చారు చేతన్.
ఆయన ఇలా ట్వీట్ చేయగానే గంటల వ్యవధిలోనే అనేక కామెంట్లు వచ్చాయి. తర్వాత కొన్ని హిందూ సంఘాలు ఆయనకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వెంటనే చేతన్ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. చేతన్ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కున్నారు చేతన్. 2022 ఫిబ్రవరిలో చేతన్.. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి క్రిష్ణ దీక్షిత్ పై కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయనపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. తర్వాత ఆ కేసు నుంచి బయటకు వచ్చారు చేతన్. గతంలోనూ కొన్ని సందర్భాల్లో హిందుత్వానికి వ్యతిరేకంగా చేతన్ వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ భావజాలం కలిగిన ఆయన సామాజిక కార్యక్రమాల్లో తరుచూ పాల్గొంటూ ఉంటారు. ఇక త్వరలో కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అక్కడ భారీగా ప్రచార సభలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ టిప్పు సుల్తాన్ మరణం విషయం పదే పదే ప్రస్తావిస్తున్న నేపథ్యంలో చేతన్ ఈ వ్యాఖ్యలు చేయడం ఇటు రాజకీయంగానూ అటు ఇండస్ట్రీలోనూ చర్చనీయాంశమవుతున్నాయి.
Also Read : 'దాస్ కా ధమ్కీ' రివ్యూ : 'ధమాకా'లా ఉందా? లేదంటే విశ్వక్ సేన్ కొత్తగా తీశాడా?