Das Ka Dhamki Movie Review - 'దాస్ కా ధమ్కీ' రివ్యూ : 'ధమాకా'లా ఉందా? లేదంటే విశ్వక్ సేన్ కొత్తగా తీశాడా?
Das Ka Dhamki Movie Review In Telugu : విశ్వక్ సేన్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమా 'దాస్ కా ధమ్కీ'. ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే?
విశ్వక్ సేన్
విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్ తదితరులు
సినిమా రివ్యూ : దాస్ కా ధమ్కీ
రేటింగ్ : 2.5/5
నటీనటులు : విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, తరుణ్ భాస్కర్, అక్షరా గౌడ, 'హైపర్' ఆది, 'రంగస్థలం' మహేష్, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు
కథ : ప్రసన్నకుమార్ బెజవాడ
ఛాయాగ్రహణం : దినేష్ కె బాబు
సంగీతం : లియోన్ జేమ్స్
నిర్మాత : కరాటే రాజు
స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : విశ్వక్ సేన్
విడుదల తేదీ: మార్చి 22, 2022
యువ కథానాయకుడు విశ్వక్ సేన్ (Vishwak Sen)లో దర్శకుడు కూడా ఉన్నాడు. గతంలో 'ఫలక్ నుమా దాస్' తీశాడు. ఇప్పుడు 'దాస్ కా ధమ్కీ' (Das Ka Dhamki Movie)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశ్వక్ సేన్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆయన తండ్రి నిర్మించారు. 'పాగల్' తర్వాత విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) మరోసారి జంటగా నటించారు. ఈ సినిమా ఎలా ఉంది (Das Ka Dhamki Review)?
కథ (Das Ka Dhamki Movie Story) : కృష్ణదాస్ (విశ్వక్ సేన్) అనాథ. అతను ఓ స్టార్ హోటల్‌లో వెయిటర్. ఒక రోజు హోటల్‌కు వచ్చిన కీర్తీ (నివేదా పేతురాజ్)తో ప్రేమలో పడతాడు. వెయిటర్ అనే విషయం దాచి అబద్ధాలు ఆడతాడు. ఆమెతో తానొక పెద్ద ఫార్మా కంపెనీకి సీఈవో అని చెబుతాడు. ఓ రోజు కృష్ణదాస్ వెయిటర్ అనే నిజం కీర్తీకి తెలుస్తుంది. అప్పటి వరకు ఆమె కోసం చేసిన పనుల కారణంగా ఉద్యోగం పోతుంది. రెంట్ కట్టలేదని హౌస్ ఓనర్ సామాన్లు విసిరేస్తాడు. ఆల్మోస్ట్ రోడ్డు మీదకు వస్తున్న సమయంలో సిద్ధార్థ్ మల్హోత్రా (రావు రమేష్) వస్తాడు. తన అన్నయ్య కుమారుడు సంజయ్ రుద్ర (విశ్వక్ సేన్) క్యాన్సర్ చికిత్సకు ఓ డ్రగ్ కనిపెట్టాడని, రీసెర్చ్ మధ్యలో చనిపోయాడని చెబుతాడు. అతడిలా నటించమని చెబుతాడు. సంజయ్ రుద్ర ఇంటికి వెళ్లిన కృష్ణదాస్ షాక్ అవుతాడు. ఎందుకంటే... ఆ సంజయ్ రుద్ర ఎవరో కాదు, ఫార్మా కంపెనీ సీఈవో! అతడి స్థానంలోకి కృష్ణదాస్ వెళ్లిన తర్వాత ఏమైంది? కథ ఎన్ని మలుపులు తిరిగింది? అనేది వెండితెరపై చూడాలి.
విశ్లేషణ (Das Ka Dhamki Movie Telugu Review) : 'దాస్ కా ధమ్కీ'లో ఓ సీన్ ఉంది. రెంట్ కట్టమని ఓనర్ వస్తే, అతడికి 'హైపర్' ఆది మెసేజ్ పెడతాడు... 'హాయ్! మీరు ఎలా ఉన్నారు? మీ రెంట్ ఎనిమిది వేలు వచ్చాయి' అని! నిజంగా బ్యాంక్ అకౌంటులో డబ్బులు పడ్డాయని ఓనర్ వెళ్ళిపోతాడు. బ్యాంకు మెసేజ్‌కు, పర్సనల్ నంబర్ నుంచి వచ్చిన మెసేజ్‌కు తేడా తెలియని వ్యక్తులు ఈ రోజుల్లో ఉన్నారా? అనే సందేహం మీకు వస్తే... సినిమాకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ సన్నివేశంలో కామెడీ చూడాలి గానీ లాజిక్కులు పేరుతో బాలేదని చెప్పడం ఏమిటని ఫీలైతే... థియేటర్లకు వెళ్ళవచ్చు.
'దాస్ కా ధమ్కీ' విడుదలకు ముందు 'ధమాకా' కథను అటు ఇటు తిప్పి తీశారని ప్రచారం జరిగింది. అందులో నిజం లేదని దర్శక, రచయితలు ఖండించారు. అది నిజమే. 'ధమాకా'తో పాటు 'ఖిలాడీ'ని కూడా గుర్తు చేస్తుందీ సినిమా. కొన్ని సీన్లు, ఫైట్లు ఇంతకు ముందు వచ్చిన తెలుగు సినిమాలను అక్కడక్కడా గుర్తు చేస్తాయి. అందువల్ల, సినిమా కొత్త ఫీల్ ఏమీ ఇవ్వదు.
'దాస్ కా ధమ్కీ'లో అన్నీ మైనస్సులేనా? ప్లస్సులు ఏమీ లేవా? అంటే... ఉన్నాయ్! లియోన్ జేమ్స్ అందించిన పాటలు బావున్నాయి. బాణీలు, పూర్ణాచారి రాసిన పాటలు పెప్పీగా ఉన్నాయి. రామ్ మిరియాల సంగీతం అందించిన 'మావా బ్రో' కూడా ఓకే. రీ రికార్డింగ్ జస్ట్ ఓకే. కెమెరా వర్క్ బాగుంది. ప్రొడక్షన్ వేల్యూస్ పరంగా విశ్వక్ సేన్, ఆయన తండ్రి 'కరాటే' రాజు కాంప్రమైజ్ కాలేదు. కొన్ని కామెడీ సీన్లు బావున్నాయి.
కొత్త కథ లేకున్నా కొన్ని సినిమాలు నెక్స్ట్ ఏం జరుగుతుంది? అనే క్యూరియాసిటీ కలిగిస్తాయి. 'దాస్ కా ధమ్కీ'లో అటువంటి క్యూరియాసిటీ కలిగించే మూమెంట్స్ ఏమీ లేవు. వెయిటర్ కాదని ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుందనే ట్విస్ట్ దగ్గర నుంచి, ఆ తర్వాత ట్విస్టులు కూడా ఊహించేలా ఉన్నాయి. దర్శకుడిగా టెక్నికల్ టీమ్ నుంచి విశ్వక్ సేన్ మంచి అవుట్ పుట్ తీసుకున్నారు. స్క్రీన్ ప్లే మీద కాన్సంట్రేట్ చేసి ఉంటే ఇంకా బావుండేది.
నటీనటులు ఎలా చేశారు? : హీరోగా విశ్వక్ సేన్ ఎప్పటిలా చేశాడు. రెండు పాత్రల మధ్య వేరియేషన్ చూపించారు. నెగిటివ్ షెడ్స్ పాత్రలో బాగా చేశారు. నివేదా పేతురాజ్ నటన కంటే గ్లామర్ హైలైట్ అవుతుంది. రావు రమేష్ సైతం పాత్రలో వేరియేషన్స్ బాగా చూపించారు. 'హైపర్' ఆది, 'రంగస్థలం' మహేష్ తమ పాత్ర పరిధి మేరకు కామెడీ చేసే ప్రయత్నం చేశారు. కొంత వరకు సక్సెస్ అయ్యారు. 'హ్యాపీడేస్'లో టైసన్ లాంగ్వేజ్ డెలివరీతో మహేష్ డైలాగులు చెప్పారు. తరుణ్ భాస్కర్, మహేష్ మధ్య సీన్ పేలింది. అజయ్, అక్షరా గౌడ, పృథ్వీరాజ్, రజత... తదితరులకు పెద్దగా నటించే అవకాశం లభించలేదు. వాళ్ళవి రెగ్యులర్ రోల్స్. డైలాగులు పెద్దగా లేకపోయినా తల్లి పాత్రలో రోహిణి ఆకట్టుకున్నారు.
Also Read : 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా
ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : లవ్ ట్రాక్ నుంచి మెయిన్ కాన్సెప్ట్ ట్విస్టుల వరకు 'దాస్ కా ధమ్కీ'లో చాలా సినిమాలు కనపడతాయి. పైన చెప్పినట్లు... 'ధమాకా', 'ఖిలాడీ' ప్రభావం ఎక్కువ ఉంది. కథతో, లాజిక్కులతో ఏమాత్రం సంబంధం లేకపోయినా... మధ్య మధ్యలో కామెడీ బావుంటే చాలని కోరుకునే ప్రేక్షకులు 'దాస్ కా ధమ్కీ'కి వెళ్ళవచ్చు.
Also Read : 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ : నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల సినిమా ఎలా ఉందంటే?