(Source: ECI/ABP News/ABP Majha)
Kangana Ranaut: ఎన్నికల తరవాత బాలీవుడ్‌ని వదిలేస్తా, అబద్ధాలతో నిండిపోయిన ఇండస్ట్రీ ఇది
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే ఆ తరవాత బాలీవుడ్‌కి పూర్తిగా స్వస్తి పలుకుతానని కంగనా రనౌత్ సంచలన ప్రకటన చేశారు.
Kangana Ranaut To Quit Bollywood: లోక్‌సభ ఎన్నికల తరవాత బాలీవుడ్‌ని వదిలేస్తానని సంచలన ప్రకటన చేశారు కంగనా రనౌత్. ఇటీవల ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. ఎన్నికలైపోయాక పూర్తి స్థాయిలో రాజకీయాల్లోనే ఉంటానని చెప్పారు. బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ఫేక్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిస్తే బాలీవుడ్‌ని వదిలేస్తారా అని అడిగిన ప్రశ్నకి "అవును" అని సమాధానమిచ్చారు. ఈ సినిమా ఇండస్ట్రీయే ఓ అబద్ధం అని, అందులో ప్రతిదీ ఫేక్ అని మండి పడ్డారు. ఆ అబద్ధమే జనాల్ని అట్రాక్ట్ చేస్తుందని చెప్పారు. సినిమాలపై తనకెంతో ప్యాషన్ ఉందన్న కంగనా ఒకటే పనికి అతుక్కుపోవడం ఇష్టం ఉండదని అన్నారు.
"ఈ సినిమా ప్రపంచం ఓ మాయ. ఇక్కడ ప్రతిదీ అబద్ధమే. ఇక్కడి వాళ్లు లేనిది ఉన్నట్టుగా సృష్టిస్తారు. ఈ అబద్ధానికి అందమైన రంగులు అద్ది చూపిస్తారు. అది చూసి ప్రజలు అట్రాక్ట్ అవుతారు. ఇదే నిజం. నాకు ఏ పనినైనా ప్యాషన్‌తో చేయడం ఇష్టం. ఏదో చేయాలి కాబట్టి చేయాలి అన్నట్టుగా ఉండడం నాకు నచ్చదు. సినిమాల విషయమే చూడండి. నటించడం బోర్ కొడితే వెంటనే రైటర్ అయిపోతాను. అది కూడా బోర్ కొడితే డైరెక్ట్ చేస్తాను. లేదంటే ప్రొడ్యూస్ చేస్తాను. ఎప్పటికప్పుడు ఇలా కొత్తగా ఉండాలనుకుంటాను"
- కంగనా రనౌత్, బీజేపీ ఎంపీ అభ్యర్థి, సినీ నటి
ఎప్పటి నుంచో బీజేపీకి కావాల్సిన మనిషిగా ఉన్న కంగనా రనౌత్ అదే పార్టీ తరపున తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. హిమాచల్ ప్రదేశ్‌లోని తన సొంత నియోజకవర్గమైన మండి నుంచే ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మోదీపై ప్రజలకున్న విశ్వాసమే తననూ గెలిపిస్తుందని చాలా ధీమాగా చెబుతున్నారు కంగనా. ఇక్కడి ప్రజలకు తన గురించి తెలుసని వాళ్లు తప్పకుండా గెలిపిస్తారని అంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో ఉన్న కంగనా బాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో వివాదాల్లోనూ ఇరుక్కున్నారు. అనురాగ్ బసు డైరెక్ట్ చేసిన Gangster మూవీతో బాలీవుడ్‌లో డెబ్యూ ఇచ్చారు. ఆ తరవాత వచ్చిన క్వీన్, తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్ సినిమాలు మంచి పేరు తెచ్చి పెట్టాయి.
ఇప్పుడు ఆమె డైరెక్షన్‌పైనా దృష్టి పెట్టారు. Emergency మూవీని ఆమే డైరెక్ట్ చేస్తున్నారు. జూన్‌లో ఈ సినిమా విడుదలవ్వాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతోంది. 1975లో ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాని తెరకెక్కించారు కంగనా. మండి నుంచి బరిలోకి దిగుతున్న కంగనా రనౌత్ ఇటీవలే నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్‌లో ఆమె ఆస్తుల విలువని రూ.91.6 కోట్లుగా చూపించారు. ఆమెపై మొత్తంగా 8 క్రిమినల్ కేసులున్నాయి. సినిమాలపై ఉన్న ప్యాషన్‌తో చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలో ఎంట్రీ ఇచ్చారు.
Also Read: PM Modi: మాకు 400 సీట్లు పక్కాగా వస్తాయ్, మా కాన్ఫిడెన్స్ అదే - ప్రధాని కీలక వ్యాఖ్యలు