Jeevitha Rajasekhar : జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా జీవితా రాజశేఖర్?
రాజకీయాలకు జీవితా రాజశేఖర్ కొత్త కాదు. కానీ, ఇప్పుడు కొత్తగా ఆవిడ పేరు వినబడుతోంది. ఆమెను లోక్‌సభకు పంపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా జీవితా రాజశేఖర్ పేరు వినబడుతోంది.
జీవితా రాజశేఖర్ (Jeevitha Rajasekhar) కు రాజకీయాలు అంటే ఆసక్తి. అయితే, ఇప్పటి వరకు ఆమె ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయలేదు. కొంత మంది నేతలపై అభిమానంతో వాళ్ళ తరపున ప్రచారం చేశారు. రాజకీయ తెరపై వాడివేడి చర్చకు కారణం అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాజకీయ వర్గాల్లో వినబడుతున్న వ్యాఖ్యల ప్రకారం... రాబోయే ఎన్నికల్లో జహీరాబాద్ లోక్‌సభ స్థానానికి జీవితా రాజశేఖర్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయట!
మళ్ళీ బీజేపీలోకి జీవిత?
ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు వేడి మీద ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మధ్య ఉప్పు నిప్పు అన్నట్లు పరిస్థితి ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ మీద తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీ నుంచి ఘాటుగా బదులు ఇచ్చే నాయకులూ ఉన్నారు. తెలంగాణలో కేసీఆర్ అండ్ టీమ్‌కు గట్టి పోటీ ఇవ్వడమే లక్ష్యంగా బీజేపీ నాయకులు పావులు కదుపుతున్నారు. రాజకీయ నాయకులకు తోడు సినిమా ఇమేజ్ యాడ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR Jr)ను బీజేపీ ముఖ్య నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కలిశారు. ఆ తర్వాత నితిన్‌తో జేపీ నడ్డా సమావేశం అయ్యారు. వాళ్ళిద్దరూ రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో తమ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన వాళ్ళను మళ్ళీ ఆహ్వానిస్తున్నారు.
ఒకప్పుడు జీవిత (Jeevitha Rajasekhar) బీజేపీ నాయకురాలు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆహ్వానం మేరకు ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్‌కు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారు. అయితే... ఆ పార్టీ సభ్యత్వం తీసుకోలేదట. ఇటీవల రాజశేఖర్, జీవిత దంపతులను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీలోకి ఆహ్వానించగా... గతంలో తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని తెలియజేసినట్లు తెలిసింది. ప్రచారానికి కాకుండా పోటీ చేయడానికి తాము సిద్ధమని, టికెట్ ఇస్తామని స్పష్టమైన హామీ ఇస్తేనే మళ్ళీ పార్టీలోకి వస్తామని సూటిగా చెప్పారట.
జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా జీవిత?
ఏపీ, తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా సరే పోటీ చేయడానికి తాను సిద్ధమే అని బీజేపీ నాయకులకు జీవిత తెలియజేయడంతో ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్లు రాజకీయ వర్గాల సమాచారం. జీవిత మంచి వాగ్ధాటి గల నాయకురాలు. సూటిగా, స్పష్టంగా తాను చెప్పదలుచుకున్న అంశాలను బలంగా ప్రజలకు చెప్పగలరు. అటువంటి మహిళా నేత తమ పార్టీకి అవసరమని బీజేపీ భావిస్తోందట. దీని వెనుక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఉన్నట్లు గుసగుస.
'ప్రవాస్ యోజన'లో భాగంగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను జహీరాబాద్ ఇంఛార్జ్‌గా నియమించారు. ఆ మధ్య ఆమె లోక్‌సభ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో పర్యటించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు మధ్య మధ్యలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ జెండా ఎగర వేయడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. లోక్‌సభ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి అంచనా వేస్తున్నారు. జహీరాబాద్ ఎంపీగా మహిళను నిలబెడితే ప్రయోజనం ఉంటుందని నిర్మలా సీతారామన్ ఆలోచనగా ఉందట.
Also Read : బీజేపీ హిందుత్వ ఎజెండాకు ఎన్టీఆర్ ఓకే చెబుతారా?
టికెట్ ఇస్తేనే పార్టీలో యాక్టివ్ అవుతానని జీవితా రాజశేఖర్ చెప్పడం, జహీరాబాద్ ఎంపీగా మహిళా అభ్యర్థి అయితే బావుంటుందని నిర్మలా సీతారామన్ ఆలోచనల్లో ఉండటంతో జీవితకు టికెట్ ఖరారు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయట. ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. పార్లమెంట్ ఎన్నికల కంటే అసెంబ్లీ ఎన్నికలు ముందు జరుగుతాయి. ఆయా ఫలితాలు ఎంపీ టికెట్ అభ్యర్థుల అవకాశాలపై ప్రభావం పడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
Also Read : ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసిన కేసీఆర్? - దెబ్బకు రెండున్నర కోట్ల నష్టం