Ideas Of India 3.0: అమితాబ్ బచ్చన్ రిహార్సల్స్ నుంచి ఆమిర్ ఖాన్ ఏం నేర్చుకున్నారు?
ఏబీపీ నెట్‌వర్క్ ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా’ సమ్మిట్‌లో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తన మొదటి సినిమా ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని విషయాలను గుర్తు చేసుకున్నారు.
Ideas Of India 3.0: ఏబీపీ నెట్‌వర్క్ నిర్వహిస్తున్న ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా’ సమ్మిట్‌లో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తన మొదటి సినిమా ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని విషయాలను గుర్తు చేసుకున్నారు. ఏబీపీ నెట్‌వర్క్ ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా’ మూడో ఎడిషన్ మొదటి రోజున ‘టెల్లింగ్ లాపటా టేల్స్: సీన్స్ ఫ్రం ఆన్ ఇన్విజిబుల్ నేషన్’ అనే సెషన్‌ను నిర్వహించారు. ఈ సెషన్‌లో ఆయన కెరీర్ ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్నారు. రిహార్సల్స్ అనేవి ఎంత ముఖ్యమో తనకు తెలిసేలా చేసిన సంఘటన గురించి మాట్లాడారు.
త్వరలో విడుదల కానున్న ‘లాపటా లేడీస్’ గురించి ఆ సినిమా దర్శకురాలు కిరణ్ రావు మాట్లాడారు. ఈ సినిమా నిర్మాణం కోసం ఎన్నో కచ్చితమైన ప్రణాళికలు వేశామన్నారు. నటులందరిలో ఒకే తరహా కామెడీ టోన్ రావాలంటే రిహార్సల్స్, వర్క్ షాపులు ఎంతో అవసరం అని పేర్కొన్నారు. ‘కామెడీ విషయంలో అందరూ ఒక లెవల్లోకి రావడానికి ఎన్నో రిహార్సల్స్, వర్క్ షాపులు చేశాం. వాటి ద్వారానే మేం సిద్ధం అయ్యాం.’ అన్నారు.
దీని తర్వాత ఆమిర్ ఖాన్ తన మొదటి సినిమా ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ సినిమా షూటింగ్‌లో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పటికే సూపర్ స్టార్‌గా ఉన్న అమితాబ్ బచ్చన్ కూడా సీన్ కోసం చాలా రిహార్సల్స్ చేయడం తాను చూశానన్నారు.
‘నేను ఫిల్మ్ సిటీలో ఖయామత్ సే ఖయామత్ తక్ కోసం షూటింగ్ చేస్తున్నారు. నా కజిన్ నుసట్, రాజ్ జుత్సి, రీనా (ఆమిర్ మాజీ భార్య), నేను మేకప్ రూమ్‌లో ఉన్నాం. ఆరోజు అక్కడ మరో సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. ఒక నటుడు తన డైలాగ్స్‌ను 100, 200 సార్లు రిహార్సల్ చేస్తున్నారు. అతని డెడికేషన్ నచ్చి ఎవరో చూద్దామని బయటకు వెళ్లాను. అది మరింకెవరో కాదు అమితాబ్ బచ్చన్. అప్పుడే కెరీర్ ప్రారంభిస్తున్న నాకు ఒక సూపర్ స్టార్ అలా ఎంతో హార్డ్ వర్క్ చేయడం ఎంతో గుర్తుండిపోయేలా చేసింది. అది ఒక పెద్ద సీన్. దాదాపు ఎనిమిది నుంచి 10 టేకులు అయ్యాయి. సీన్ షూట్ అయిపోయాక అమితాబ్... ఆ సినిమా దర్శకుడు ప్రకాష్ మెహ్రా వద్దకు వెళ్లారు. ‘ప్రకాష్, నేను వేగంగా మాట్లాడలేదు కదా.’ అని అడిగారు. రిహార్సల్స్‌కు అస్సలు ఒక ముగింపే ఉండదని చెప్పడానికి నాకు అది ఒక పాఠం లాంటిది. చార్లీ చాప్లిన్ లాంటి గొప్ప నటులు కూడా 200, 300 సార్లు రిహార్సల్ చేసేవారు. కాబట్టి నేను రిహార్సల్స్‌లోనూ, ప్రిపరేషన్‌లోనూ నమ్మకం ఉంచుతాను.’ అని ఆమిర్ అన్నారు.
అనంతరం కిరణ్ రావు మళ్లీ మాట్లాడారు. ఆమిర్ ఒక పాత్ర కోసం ఎలా ప్రిపేర్ అవుతాడో తెలిపారు. పాల్గొనే పాత్రను బట్టి ఆమిర్ ఖాన్ ప్రిపేర్ అయ్యే విధానం మారుతుందన్నారు. ‘దోభి ఘాట్’ సినిమాలో పాత్ర కోసం ఆయన ప్రిపరేషన్ గురించి తెలిపారు. సినిమాలో ఆమిర్ పాత్ర ఏ ఇంట్లో నివసించేదో ప్రిపరేషన్ కోసం అదే ఇంట్లో ఆమిర్ నివసించేవాడని కిరణ్ రావు పేర్కొన్నారు.
ఆమిర్ ఖాన్‌ను అందరూ ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’ అని పిలిచే వారు. ఆయన తన పాత్రల కోసం, సినిమాల కోసం చేసే ప్రిపరేషన్ వల్ల ఆయనకు ఆ పేరు వచ్చింది.