(Source: Matrize)
Chiranjeevi: త్వరలో నేనూ విశాఖవాసి కాబోతున్నా, శృతిని బెదిరించారేమో - బాలకృష్ణపై చిరంజీవి స్వీట్ సెటైర్
‘వాల్తేరు వీరయ్య’ ప్రి-రిలీజ్ మూవీలో చిరంజీవి మాట్లాడారు. ఈ సందర్భంగా తనకు విశాఖపై ఉన్న ప్రేమను వెల్లడించారు. రవితేజ, శృతి హాసన్ గురించి కూడా మాట్లాడారు.
మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, శృతిహాసన్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవితోపాటు మాస్ మహారాజ్ రవితేజ, నటి ఊర్వశీ రౌతేలా, కేథరిన్, దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘విశాఖ ప్రజలు శాంతికాముకులు. చాలా సరదాగా ఉంటారు. ఈ మధ్యే విశాఖలో స్థలం కొన్నాను. భిమిలికి వెళ్లే దారిలోనే ఉంది అది. త్వరలో నేను విశాఖవాసిని అవుతాను. మళ్లీ నేను ఇల్లు కట్టడానికి విశాఖపట్నం వస్తున్నా. ఇక్కడ స్థిరపడాలి అనేది చిరకాల కోరిక. దర్శకుడు బాబీ ఈ మూవీ పేరు ‘వాల్తేరు వీరయ్య’ అని చెప్పగానే.. ఎందుకో పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. ‘వాల్తేరు’ అంటే నాకిష్టం. బాబీ స్క్రిప్ట్ వినగానే నచ్చేసింది. నేను కథ వినగానే బాగుందని ఓకే చేసిన ఏ సినిమా ఫ్లాప్ కాలేదు. అన్నీ బ్లాక్‌బస్టర్‌లే. ఈ మూవీ కూడా తప్పకుండా హిట్ కొడుతుంది. కష్టాన్ని నమ్ముకుని పనిచేసేవాడే నాకు నిజమైన అభిమాని. ఆ కష్టపడే వ్యక్తికి నేను అభిమానిని. బాబీ డెడికేషన్‌కు నేను అతడి అభిమానిని అయ్యాను. ప్రతి ఒక్కరూ బాబిని స్ఫూర్తిగా తీసుకోవాలి. మైత్రీ మూవీస్ సంస్థ ఎంతో కష్టపడి రెండు సినిమాలను నిర్మించారు. చరిత్రలో ఏ నిర్మాతా ఒకేసారి, ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేయలేదు. వీరు కథను నమ్మారు. ఆ ధైర్యంతోనే ఈ సినిమాలను ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు విజయం సాధించి వారికి లాభాలు ఇవ్వాలని, సినీ కార్మికుల కడుపు నింపాలి ఆశిస్తున్నా. బాలయ్య నటించిన ‘వీరసింహా రెడ్డి’ హిట్ కొట్టాలని కోరుకుంటున్నా’’ అని చిరంజీవి అన్నారు.
రవితేజా నాకు చాలా కోపం తెప్పిస్తాడు
రవితేజ గురించి చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘రవితేజ ‘ఆజ్ కా గూండారాజ్’లో నాకు స్నేహితుడి వేషం వేశాడు. రవితేజ విజయవాడే. కానీ, పెరిగింది అంతా బాంబేనే. హిందీలో తెగ మాట్లాడుతుంటాడు. అమితాబ్‌ను ఎక్కువగా ప్రేమించేవాడు. సౌత్‌లో నేనంటే ఇష్టమని చెప్పేవాడు. అలాంటి రవితో నాకు సినిమాలు చేసే అవకాశం లభించింది’’ అని చిరంజీవి అనగానే.. రవితేజ ‘‘అబ్బా.. అవునా..’’ అని చిరంజీవిని ఆటపట్టించారు. దీంతో చిరు ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడుతూ.. ‘‘నువ్వు తక్కువోడు కాదు. ఏతంతావేంటి?’’ అని అన్నారు. దీంతో అంతా నవ్వేశారు. అనంతరం ప్రశంగం కొనసాగిస్తూ.. ‘‘నాకు రవి మీద కోపం వచ్చేస్తుంది. షూటింగ్‌లో నన్ను యాక్టింగ్ మీద ఫోకస్ పెట్టనివ్వడు. ఎప్పడూ ఏవో కబుర్లు చెబుతాడు, అల్లరి చేస్తాడు’’ అని అన్నారు.
ఖాళీ దొరికితే రవితేజ సినిమాలే చూస్తా
‘‘చిన్న పాత్రలతో వచ్చి.. ఇప్పుడు మాస్ మహరాజ్ అనే ఇమేజ్‌ను ఏర్పచుకున్నాడు రవితేజ. నాకు రవి తేజ సినిమాలంటే చాలా ఇష్టం. నాకు ఖాళీ దొరికితే రవితేజ సినిమాలు చూస్తాను. అతని సినిమాల్లో మాస్, డ్యాన్స్, చిలిపి, వెటకారం అన్నీ ఉంటాయి’’ అని అన్నారు. దీంతో రవితేజ స్పందిస్తూ.. ‘‘మేమంతా మిమ్మల్ని చూసి నేర్చుకున్నవే. మేం మిమ్మల్నే ఫాలో అయ్యాం’’ అని అన్నారు. దీంతో చిరంజీవి.. ‘‘నేను చేస్తే అది కామెడి. నువ్వు చేసివాటిలో వెటకారం ఉంటాది’’ అని అన్నారు. ‘వాల్తేరు వీరయ్య’లో మావి చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగే క్యారక్టర్లు అంటూ చిరంజీవి మూవీలోని కీలక సన్నివేశాల గురించి హింట్ ఇవ్వబోయారు. దీంతో దర్శకుడు బాబి చిరంజీవిని చెప్పొద్దని సైగ చేశారు. దీంతో చిరంజీవి తనని తాను కంట్రోల్ చేసుకున్నారు. ‘‘రవితేజ కాకపోతే ఆ పాత్రకు న్యాయం జరిగేది కాదు. రవితేజ వల్ల ఆ క్యారెక్టర్ ఇంకో లెవల్‌కు వెళ్లింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నది మేమిద్దరమే. ఇంత బిజీ టైమ్‌లో కూడా రవి డేట్ ఇచ్చాడు.
శృతిహాసన్‌ను ఎవరు బెదిరించారో ఏమో - బాలయ్యపై సెటైర్
‘వీరసింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న శృతిహాసన్.. ‘వాల్తేరు వీరయ్య’కు డుమ్మా కొట్టింది. అయితే, తనకు ఆరోగ్యం బాగోకపోవడం వల్లే విశాఖ రాలేకపోయానని వెల్లడించింది. ఈ సందర్భంగా చిరంజీవి శృతిహాసన్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఆమెను ఎవరు బెదిరించారో తెలీదు. రాలేకపోయింది’’ అంటూ బాలయ్యపై పరోక్షంగా సరదా సెటైర్ వేశారు. అయితే, శృతిహాసన్‌కు ఆరోగ్యం బాగోలేకపోవడం వల్లే రాలేకపోయానని తనకు ఫోన్ చేసి చెప్పిందని, కోవిడ్ టెస్ట్ కూడా చేయించున్నానని పేర్కొందన్నారు. వైజాగ్ వాసులను మిస్ అవుతున్నానని చెప్పమందన్నారు. ఆమె త్వరగానే కోలుకోవాలని కోరుకుంటున్నానని, ఇందులో ఆమె కీలక పాత్ర పోషించిందని, కేవలం పాటలకే హీరోయిన్ అన్నట్లు కాకుండా ఆమె యాక్షన్ సీన్స్ కూడా చేసిందంటూ మరో లీక్ ఇచ్చారు చిరంజీవి. అయితే, ఆయన స్పీచ్‌లో చాలావరకు సినిమాలోని కీలక సన్నివేశాలను లీక్ చేశారు. కేథరిన్ పాత్ర గురించి కూడా లీక్ చేయబోయి తనని తాను కంట్రోల్ చేసుకున్నారు. అయితే, నటి ఊర్వశీ రౌతేలా పేరును ఊర్వశి రాథోడ్ అని చెప్పడంతో ఆమె కాస్త ఫీలైనట్లే కనిపించింది.