Varun Dhawan: దక్షిణాదిపై కన్నేసిన బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ - తెలుగు మూవీతో ఎంట్రీ?
తెలుగు సినిమాల్లో నటించడానికి తాను సిద్దంగా ఉన్నానని చెప్పారు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్. దానిపై అక్కడి దర్శక నిర్మాతలతో చర్చలు కూడా జరుపుతున్నట్లు చెప్పారు.
ఒకప్పుడు దక్షిణాది సినిమాలను చిన్నచూపు చూసిన బాలీవుడ్.. ఇప్పుడు మనోళ్ల కంటెంట్‌కు సలాం చేస్తోంది. వారిలో ఆలోచనల్లోనూ మార్పుతెస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటులు దక్షిణాది సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మంచి కంటెంట్ ఉండే పాన్-ఇండియా మూవీస్‌లో నటించేందుకు తామెప్పుడూ సిద్ధమేనంటూ సిగ్నల్ ఇస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు వరుణ్ ధావన్. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయ్యామైన ఈ యంగ్ హీరో.. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’, ‘బద్రీనాథ్ కి దుల్హనియా’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా ‘భేడియ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ‘భేడియా’ను తెలుగులో ‘తోడేలు’ అనే టైటిల్ తో విడుదల చేశారు. అయితే హిందీతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే, ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది.
వరుణ్ ధావన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సౌత్ సినిమాల గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ.. తెలుగు సినిమాల్లో నటించడానికి సిద్దంగా ఉన్నానని తెలిపాడు. దీనిపై టాలీవుడ్ దర్శక నిర్మాతలతో చర్చలు కూడా జరుపుతున్నట్లు చెప్పాడు. కచ్చితంగా త్వరలో తెలుగులో సినిమాలో నటిస్తానని స్పష్టం చేశాడు. ఇప్పటికే వరుణ్ ధావన్ బాలీవుడ్ లో కమర్షియల్ హీరో గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు ఆయన తెలుగు సినిమా చేస్తానని క్లారిటీ ఇవ్వడంతో వరుణ్ ఎంట్రీ పై ఉత్కంఠ నెలకొంది. తెలుగులో ఎలాంటి సినిమా చేస్తాడు. ఏ డైరెక్టర్ తో కలసి పనిచేస్తాడు, ఏ బ్యానర్ లో పని చేస్తాడనే చర్చ మొదలైంది. ప్రస్తుతం వరుణ్ బాలీవుడ్ లో ‘బావల్’ అనే సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు.
తెలుగులో ‘బాహుబలి’ లాంటి సినిమాలతో టాలీవుడ్ కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అలాగే తెలుగు లో విడుదల అయిన సినిమాలు బాలీవుడ్ లోనూ మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఈ యేడాది విడుదల అయిన ‘పుష్ప’, ‘ఆర్ ఆర్ ఆర్’, ‘సీతా రామం’, ‘కార్తికేయ 2’ ‘మేజర్’ లాంటి సినిమాలు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటాయి. దీంతో చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు తెలుగు సినిమాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే తమిళ, మలయాళం, కన్నడ నుంచి చాలా మంది నటులు తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా ఆ జాబితా లోకి బాలీవుడ్ నటులు కూడా రావడం విశేషం.
Read Also: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ కు మరో షాక్, పరువు నష్టం కేసు పెట్టిన నోరా ఫతేహి