Tamannaah : తమన్నా గురించి ఈ విషయాలు తెలుసా..?
ప్రేక్షకులంతా మిల్కీ బ్యూటీ అంటూ ముద్దుగా పిలుచుకునే తమన్నా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం!
టీనేజ్ లోనే హీరోయిన్ గా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన తమన్నా కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ తన నటనతో, అందంతో ఆకట్టుకుంది. ప్రేక్షకులంతా మిల్కీ బ్యూటీ అంటూ ముద్దుగా పిలుచుకునే ఈమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం!
మిల్కీ బ్యూటీ పేరే నచ్చదట..
పాల లాంటి రంగుతో మెరిసిపోతుంటుంది తమన్నా. అందుకే ఆమెకి మిల్కీ బ్యూటీ అని బిరుదిచ్చారు. కానీ తనకు ఆ పిలుపు అసలు నచ్చదట. శరీర వర్ణాన్ని బట్టి పేర్లు పెట్టడం తప్పని.. మనదేశంలో తెలుపు రంగు చర్మం పట్ల అభిమానం,వ్యామోహం చాలా మందిలో కనిపిస్తోందని.. కొన్నిసార్లు ఇలాంటి పేర్లు, ముద్రలు ఆత్మన్యూనతకు కారణమవుతాయని గతంలో తమన్నా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. టాలెంట్ ను బట్టి పేర్లు పెడితే బాగుంటుంది.. కానీ చర్మ రంగును బట్టి ముద్దుపేర్లు వద్దంటూ ప్రేక్షకులను కోరింది.
బాలీవుడ్ పట్టించుకోలేదు..
2005లో 'చాంద్ సా రోషన్ సహ్రా' అనే సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది తమన్నా. కానీ సినిమా ప్లాప్ అవ్వడంతో ఆమెని బాలీవుడ్ పట్టించుకోలేదు. దీంతో దక్షిణాదికి వచ్చి ఇక్కడే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కానీ ఇప్పటికీ ఆమెకి బాలీవుడ్ కల మాత్రం పోలేదు. అప్పుడప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
ఫిట్‌నెస్ సీక్రెట్..
ఫిట్‌నెస్ అనేది శరీరానికి సంబంధించినది కాదని.. ఫిట్‌నెస్ అంటే మానసిక ఆరోగ్యమని చెబుతుంటుంది తమన్నా. శరీరం యాక్టివ్ గా ఉండి మానసికంగా బాగాలేకపోతే అప్పుడు ఏం పని మనసు పెట్టి చేయలేమని.. కాబట్టి మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని అభిమానులకు చెబుతుంటుంది తమన్నా.
బద్ధకిస్ట్..
షూటింగ్ లో ఎన్ని గంటలైనా గ్యాప్ తీసుకోకుండా పని చేసే తమన్నాకు షూటింగ్ లేకపోతే మాత్రం బద్ధకం వచ్చేస్తుంది. ఇంట్లో నుండి బయటకు కూడా వెళ్లదట. ఎందుకు బయటకు రావంటూ స్నేహితులు కూడా గొడవ పడుతుంటారని గతంలో తమన్నా తెలిపింది. ఇంట్లో ఉంటే టీవీ కూడా చూడాలనిపించిందని.. ఉదయాన్నే వర్కవుట్లు చేసుకొని రిలాక్స్ అవుతుంటానని చెప్పుకొచ్చింది.
ఓటీటీలతో బిజీ..
లాక్ డౌన్ సమయంలో తారలందరూ ఇళ్లకే పరిమితమైతే తమన్నా మాత్రం వెబ్ సిరీస్ లతో బిజీగా ఉండేది. ఆమె నటించిన రెండు వెబ్ సిరీస్ లు 'లెవెన్త్ అవర్', 'నవంబర్ స్టోరీ' ప్రేక్షకులు ముందుకొచ్చాయి. ఇవి పెద్దగా వర్కవుట్ కానప్పటికీ ఆమెకి అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా అమెజాన్ తో ఓ వెబ్ సిరీస్ చేయడానికి అంగీకరించింది.
బుల్లితెర ఎంట్రీ..
'మాస్టర్ చెఫ్' అనే టీవీ షోని ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దాదాపు అన్ని భాషల్లో స్టార్ హీరోలనే హోస్ట్ లుగా ఫిక్స్ చేస్తున్నారు. కానీ తెలుగులో మాత్రం తమన్నా హోస్ట్ గా ఈ షోని డిజైన్ చేస్తున్నారు. దీనికోసం ఆమెకి భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
శృతిహాసన్ తో సినిమా..
తమన్నాకి ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. కానీ శ్రుతిహాసన్ ఆమె బెస్ట్ ఫ్రెండ్. తన స్నేహితురాలితో కలిసి సినిమా చేయాలనేది తమన్నా కోరిక. చాలామంది దర్శకులు చెబుతున్న కథలు వింటున్నానని.. తనతో పాటు మరో హీరోయిన్ కు కూడా స్థానం ఉండే కథలు వస్తే కచ్చితంగా శృతిహాసన్ తో సినిమా చేస్తానని గతంలో తమన్నా చెప్పింది.