Chikku Bukku Rayile Song: ‘చికుబుకు చికుబుకు రైలే’ పాట వెనుక అంత కథ ఉందా? అది రెహమాన్ ప్లాన్ కాదా?
అర్జున్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘జెంటిల్‌మెన్’. 1993లో విడుదలైన ఈ మూవీ అద్భుత విజయాన్ని అందుకుంది. ఇందులోని ‘చికుబుకు చికుబుకు రైలే’ పాట అప్పట్లో ఓ ఊపు ఊపింది.
1993లో విడుదలైన ‘జెంటిల్‌మెన్’ చిత్రం సంచనల విజయాన్ని అందుకుంది. శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా వచ్చిన ఈ యాక్షన్, రొమాంటిక్ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. శంకర్ అద్భుతమైన టేకింగ్, అర్జున్ అదిరిపోయే నటన, ఏఆర్ రెహమాన్ సంగీతం ఓ రేంజిలో అలరించింది. ఈ సినిమాలోని ‘చికుబుకు చికుబుకు రైలే’ పాట చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ ఓ ఊపు ఊపింది. ఈ పాటకు ప్రభుదేవా చేసిన డ్యాన్స్ చూసి షాక్ అయ్యారు. ఒంట్లో ఎముకలు ఉన్నాయా? లేవా? అని ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పాట సినీ అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంది.
‘జెంటిల్‌మెన్’ వచ్చి 30 ఏండ్లు దాటినా, ‘చికుబుకు చికుబుకు రైలే’ అనే పాట లేకుండా ఈ సినిమాను ఊహించడం కష్టమే అని చెప్పుకోవచ్చు. ఈ పాటతో రెహమాన్, శంకర్ తమిళ చలనచిత్ర చరిత్రలో అదిరిపోయే పాప్ మూమెంట్‌ను సృష్టించారు. కామినీ మథాయ్ రాసిన ‘AR రెహమాన్, ది మ్యూజికల్ స్టార్మ్’ పుస్తకంలో ఈ పాట గురించి పలు విషయాలు వెల్లడించారు. ‘జెంటిల్‌మెన్’ సినిమా 30వ వార్షికోత్సవం సందర్భంగా, ఈ పాటకు సంబంధించిన పలు విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఈ పాట ఎలా రూపొందింది అంటే?
‘చికుబుకు చికుబుకు రైలే’ పాటను ప్లాన్ చేసింది మ్యూజిక్ డైరెక్టర్ రెహ్మాన్ కాదు, దర్శకుడు శంకర్. ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు కాలేజీ బస్సులో వెళ్లేవారు. అప్పుడు స్టూడెంట్స్ అంతా కలిసి ‘చికుబుకు చికుబుకు రైలే- ఒడుతు నాగోర్ మెయిల్ లే’ అంటూ పాట పాడేవారు. అదే పాటను శంకర్ ‘జెంటిల్‌మెన్’ సినిమాలో పెట్టాలి అనుకున్నారు. ఈ మూవీలో అర్జున్ రైలులో ప్రయాణించే సన్నివేశంలో ఈ పాటను పెడితే బాగుంటుందని నిర్ణయించారు. విషయం రెహమాన్ కు చెప్పడంతో ఆయన ఈ పాటకు అద్భుత స్వరాలను సమకూర్చారు. అయితే, స్క్రిప్ట్ ప్రకారం, ఈ పాటను బస్సులో పెట్టాల్సి ఉంది. కానీ, దాన్ని రైలుకు మార్చినట్లు చెప్పారు ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించిన మాధేష్. ఈ పాట షూటింగ్ కూడా చాలా సవాల్ తో కూడుకున్న వ్యవహారం అని చెప్పారు. రాత్రిపూట కదులుతున్న రైలులో షూటింగ్ చేయడానికి చాలా కష్టపడినట్లు చెప్పారు. అయినా, సవాళ్లను ఎదుర్కొని చిత్రీకరించినట్లు వెల్లడించారు. ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌లో చాలా వరకు ఈ పాటను షూట్ చేసినట్లు చెప్పారు. ఈ పాట కోసం మూడు రోజుల పాటు రైలును అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు. అప్పట్లో ఈ పాట షూటింగ్ కు చాలా సమయం తీసుకున్నట్లు వివరించారు.
సినిమా కోసం పాడుతున్నానని తెలియదు- సింగర్ సురేశ్ పీటర్
ఈ పాట తనను ఆశ్చర్యానికి గురిచేసిందని సింగర్ సురేశ్ పీటర్ తెలిపారు. తాను సినిమా కోసం ఈ పాట పాడుతున్నట్లు అస్సలు తెలియదన్నారు. “రెహమాన్ నన్ను ట్రాక్ పాడమని అడిగారు. నేను ఆయనను ఏం అడగలేదు. ట్రాక్ పాడి వెళ్లిపోయాను. ఒక సంవత్సరం తర్వాత ఈ ట్రాక్ పాడింది సినిమా కోసం అని తెలుసుకున్నాను. పాటలో కొన్ని మార్పులు చేయడంతో మరోసారి పాటను రికార్డు చేశారు. ఆఖరి ట్రాక్ వినగానే నాకు ఆశ్చర్యం కలిగింది” అని చెప్పారు.
ప్రభుదేవా డ్యాన్స్ చూసి షాకయ్యా- నటి మధుబాల
“నేను ప్రభుదేవా డ్యాన్స్ ని మొదటిసారి చూసి షాక్ అయ్యాను. అతడి ఒంట్లో ఎముకలు ఉన్నాయా? లేవా? అని ఆశ్చర్యపోయాను. ఈ పాట ఇప్పటికీ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇలాంటి ఐకానిక్ సాంగ్స్ లో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పాట తమిళ పాటలు ఎలా ఉండాలో, డ్యాన్స్ ఎలా ఉండాలో చూపించింది” అని నటి మధుబాల తెలిపారు.
‘జెంటిల్‌మెన్’ సినిమాలో అర్జున్ సర్జా, మధు బాల, శుభశ్రీ ప్రధాన పాత్రల్లో నటించారు. చరణ్ రాజ్, వినీత్, ఎమ్ ఎన్ నమ్బియార్, మనోరమ, గౌందమణి, సెంతిల్, ప్రభు దేవా, గౌతమి కీలక పాత్రలు పోషించారు. కుంజుమున్ కె ఆర్ నిర్మాతగా వ్యవహరించారు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
Read Also: ఆల్రెడీ నాకు పెళ్లయిపోయింది, షాకింగ్ న్యూస్ చెప్పిన రష్మిక మందన్న
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial