మా సినిమాను 'బాహుబలి', 'పొన్నియన్ సెల్వన్'తో కంపేర్ చేయడం లేదు!
'బాహుబలి'తో రెండు భాగాలుగా కథను చెప్పడం అనే ట్రెండ్‌ను రాజమౌళి స్టార్ట్ చేశారు. తర్వాత 'కెజియఫ్' కూడా అలా విడుదలైంది. ఇప్పుడు 'పొన్నియన్ సెల్వన్', 'ది లైఫ్ ముత్తు' రెండు భాగాలుగా వస్తున్నాయి.
'ది లైఫ్ ఆఫ్ ముత్తు' (The Life Of Muthu Movie) ఈ నెల 17న తెలుగులో విడుదల అవుతోంది. శింబు (Simbu) హీరోగా దర్శకుడు గౌతమ్ మీనన్ తమిళంలో తీసిన హ్యాట్రిక్ సినిమా 'వెందు తనిందదు కాడు' (Vendhu Thanindhathu Kaadu) కు తెలుగు అనువాదమిది. సామాన్యుడు గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడు? తమిళనాడులో చిన్న పల్లె నుంచి ముంబై మాఫియాలోకి ఎలా వెళ్ళాడు? అనే పాయింట్‌తో తీశారు.
'ది లైఫ్ ఆఫ్ ముత్తు' విడుదల సందర్భంగా తెలుగు మీడియాతో మాట్లాడిన గౌతమ్ మీనన్ ''రైటర్ జయమోహన్ కథ చెప్పినప్పుడు దీనిని ఓ సినిమాగా చేయలేమని అనుకున్నా. డిస్కషన్స్ జరిగినప్పుడు రెండు భాగాలుగా చేయాలనుకున్నా. రెండు భాగాలు చేస్తున్నామని 'బాహుబలి', 'పొన్నియన్ సెల్వన్'తో మా సినిమాను కంపేర్ చేయడం లేదు. ఆ రెండూ విజువల్ గ్రాండియర్ ఫిల్మ్స్'' అని చెప్పారు. స్టోరీ డిమాండ్ చేయడంతో రెండు భాగాలుగా కథను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామని ఆయన తెలిపారు.
ప్రేమకథ అలా పక్కకు వెళ్ళింది...
గ్యాంగ్ స్టర్ జీవితం ముందుకు వచ్చింది!
'ది లైఫ్ ఆఫ్ ముత్తు' సినిమాలో లవ్, యాక్షన్, రొమాన్స్ ఉన్నాయని గౌతమ్ మీనన్ తెలిపారు. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే... ఈ సినిమా కంటే ముందు శింబు హీరోగా ఆయన ఒక ప్రేమకథను తెరకెక్కించాలనుకున్నారు. రెహమాన్ సంగీతంలో పాటలు కూడా రెడీ అయ్యాయి. మరో నెలలో షూటింగ్ స్టార్ట్ అవుతుందనగా... ఆ ప్రేమకథను పక్కన పెట్టేసి, ఈ ఫిక్షనల్ గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని తెరపైకి తీసుకు వచ్చారు. ఈ మార్పు గురించి గౌతమ్ మీనన్ మాట్లాడుతూ ''రైటర్ జయమోహన్‌ను వేరే సినిమా కోసం కలిశా. అప్పుడు ఆయన 15 నిమిషాల చిన్న కథ చెప్పారు. తర్వాత ఏం జరుగుతుంది? అని అడిగా. పది రోజుల్లో 100 పేజీల స్క్రిప్ట్ ఇచ్చారు. ఆ స్క్రిప్ట్ బుక్ చదివాకా... లవ్ స్టోరీ పక్కన పెట్టేశా'' అని చెప్పారు.
శింబు, రాధిక తప్ప అందరూ కొత్తవాళ్ళే!
'ది లైఫ్ ఆఫ్ ముత్తు'లో శింబు, రాధికా శరత్ కుమార్, మలయాళ నటుడు సిద్ధిఖీ తప్ప మెజారిటీ పాత్రల్లో కొత్తవాళ్ళు కనిపిస్తారని గౌతమ్ మీనన్ తెలిపారు. తెరపై ప్రపంచం కొత్తగా ఉండటం కోసం ఆ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పక్కా ప్లానింగ్‌తో 55 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేశామన్నారు. అయితే... సింగిల్ షెడ్యూల్‌లో కాదు. శింబు బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం మధ్యలో బ్రేక్స్ ఇచ్చారు.
శింబు... సింగిల్ టేక్ ఆర్టిస్ట్!
క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు కొత్తవాళ్ళను సెలెక్ట్ చేసిన గౌతమ్ మీనన్... వాళ్ళతో రిహార్సిల్స్ చేయించామన్నారు. శింబుకు అయితే రిహార్సిల్స్ అవసరం లేదని ఆయన తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''కెమెరా ఆన్ అవ్వడానికి పది సెకన్ల ముందు శింబు క్యారెక్టర్‌లోకి వెళ్ళిపోతాడు. ఫస్ట్ టేక్‌లో సీన్ పర్ఫెక్ట్‌గా చేస్తాడు. చాలా అరుదుగా రెండో టేక్‌కు వెళతాం. అదీ టెక్నికల్ ప్రాబ్లమ్ ఏదైనా వస్తే! శింబు లాంటి నటుడు ఉంటే సినిమా తీయడం ఈజీ. 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'లో ఐదు నిమిషాల యాక్షన్ సీన్‌ను సింగిల్ టేక్‌లో చేశాడు. శింబు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఈ సినిమా'' అని చెప్పారు.
Also Read : రామ్‌తో గౌతమ్ మీనన్ సినిమా - నాగచైతన్య అడిగితే ఆ సినిమాకు సీక్వెల్
తమిళ నిర్మాత ఇషారి. కె. గణేష్, హీరో శింబు సినిమా చూసిన తర్వాత 'త్వరగా పార్ట్ 2 ప్లాన్ చెయ్' అని అడిగారని గౌతమ్ మీనన్ తెలిపారు. సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అయన ధీమా వ్యక్తం చేశారు. ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలు చూస్తున్నారని, అందువల్ల వేర్వేరు హీరోలతో తెలుగు, తమిళ భాషలకు వేర్వేరు సినిమాలు తీయాల్సిన అవసరం లేదన్నారు.