Vidyadhar Kagita: ‘గామి‘ సినిమాలో ఒక్కో సీన్ వెనుక ఇంత కథ ఉందా? డైరెక్టర్ క్రియేటివిటీ మరో లెవెల్ అంతే!
విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గామి’. ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమాలోని ఆయా సన్నివేశాల చిత్రీకరణ ఎలాంటి టెక్నిక్స్ వాడారో దర్శకుడు విద్యాధర్ వెల్లడించారు.
Vidyadhar Kagita About Gaami Movie Shooting: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గామి’. తెలుగమ్మాయి చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించింది. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 8న థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమాకు ఆడియెన్స్ తో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం నాలుగు వారాల తర్వాత ఏప్రిల్ 12 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జీ 5 వేదికగా ఆడియెన్స్ కు అందుబాటులోకి వచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.
‘గామి’ సినిమాలో ఒక్కో సీన్ వెనుక ఒక్కో కథ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ‘గామి’ దర్శకుడు విద్యాధర్ కాగిత, ఈ సినిమా షూటింగ్ కోసం ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వచ్చిందో వివరించారు. కొన్ని సీన్ల విషయంలో చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. బడ్జెట్ ను తగ్గించడానికి కొన్ని ట్రిక్స్ ప్లే చేయాల్సి వచ్చిందన్నారు. “’గామి’ సినిమాలో విశ్వక్ సేన్ గుహలో చిక్కుకున్న తర్వాత, ఆ గుహలోకి చూసి సింహం అరిచినట్లు కనిపిస్తుంది. నిజంగా ఈ సీన్ షూట్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. అయితే, లయన్ అరుస్తున్న రియల్ ఫుటేజ్ తీసుకుని, దాన్ని ల్యాప్ టాప్ లో ప్లే చేసి, బాటిల్ మూతకు హోల్ పెట్టి, దాన్ని కెమెరా ముందు ఉంచి రంధ్రంలో నుంచి సింహాన్ని చూపించాం. ఇంకా చెప్పాలంటే ఒక బాటిల్ మూతలోని రంధ్రం నుంచి ల్యాప్ టాప్ లోని లయన్ విజువల్స్ షూట్ చేశాం. సినిమాలో చూస్తే నిజంగానే సింహం గుహలోపలికి చూస్తున్నట్లు కనిపిస్తుంది” అని తెలిపారు.
View this post on Instagram
ఇంతకీ ‘గామి’ కథ ఏంటంటే?
‘గామి’ సినిమాలో మూడు కథలు కనిపిస్తాయి. ఒకేసారి ఈ మూడు కథలను ముందుకు నడిపించాడు దర్శకుడు. భారత్ - చైనా సరిహద్దుల్లో మనుషులపై ప్రయోగాలు జరుగుతుంటాయి. అక్కడ నుంచి సీటీ 333 (మహ్మద్ సమద్) అనే టెస్ట్ సబ్జెక్ట్ ఎలాగైనా తప్పించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. అతనితో పాటు దక్షిణ భారతదేశంలో ఓ గ్రామంలోని దేవదాసి దుర్గ (అభినయ), ఆమె కుమార్తె ఉమ (హారిక)లది మరో కథ. శంకర్(విశ్వక్ సేన్)ది మరో ప్రధాన పాత్ర. ఈ మూడు కథలకు సంబంధం ఏమిటి? ఇవన్నీ ఎలా కలిశాయి? అనేది సినిమాలో చూపించారు దర్శకుడు.
ఈ చిత్రంలో విశ్వక్ సేన్, చాందిని చౌదరి జంటగా నటించగా, ఎంజీ అభినయ, హారిక పెడదా, మహ్మద్ సమద్ ఇతర పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రాన్ని వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్ పతాకంపై కార్తీక్ శబరీష్ నిర్మించారు. ఈ చిత్రానికి నరేష్ కుమారన్ సంగీతం అందించారు.