(Source: ECI/ABP News/ABP Majha)
Tollywood Theatres Issue: ఫిబ్రవరిలో ఒకే రోజు నాలుగు సినిమాలు - మళ్లీ థియేటర్ల రచ్చ?
ఫిబ్రవరి 17వ తేదీన నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి. వీటికి కూడా థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం ఉంది.
కొన్నాళ్ల క్రితం వరకు తెలుగు సినిమాలకు సాధారణంగా ఫిబ్రవరి అంటే అన్ సీజన్ కిందే లెక్క. ఎందుకంటే మార్చి నెలలో స్కూళ్ల నుంచి కాలేజీల వరకు అందరికీ పరీక్షలు ఉండేవి కాబట్టి సినిమాలన్నీ సంక్రాంతి తర్వాత సమ్మర్‌కు క్యూ కట్టేవి. ఫిబ్రవరిలో వచ్చి పెద్ద హిట్లు అయిన సినిమాలు కూడా తక్కువే. కానీ కరోనా తర్వాత లెక్క మారింది. గతేడాది ఫిబ్రవరిలో భీమ్లా నాయక్ విడుదలై భారీ హిట్ అయింది. తమిళంలో కూడా అజిత్ కుమార్ ‘వలిమై’ని ఫిబ్రవరిలోనే విడుదల చేశారు.
దీంతో సంక్రాంతికి పోటీ కారణంగా విడుదల చేయలేక, అలాగని సమ్మర్ దాకా ఆగడం కష్టమైన సినిమాలన్నీ ఫిబ్రవరికి క్యూ కట్టాయి. టాలీవుడ్ ఫిబ్రవరి క్యాలెండర్ ఇప్పటికే ఫుల్ అయింది. కానీ ఇప్పుడు ఫిబ్రవరి ఒక్క శుక్రవారం మీదనే అందరి దృష్టి పడింది. అదే ఫిబ్రవరి 17వ తేదీ. అది శివరాత్రి వీకెండ్ కావడంతో టాలీవుడ్‌లో బడా నిర్మాతల సినిమాలు ఆ తేదీన క్యూ కట్టాయి. తమ సమంత, దేవ్ మోహన్ జంటగా నటించిన‘శాకుంతలం’ సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. అసలు ఆరోజు విడుదల అయ్యే సినిమాలు ఏంటి? వాటి స్టార్ కాస్ట్ ఏంటి? అనేది చూద్దాం...
1. దాస్ కా ధమ్మీ
టాలీవుడ్ మిడ్ రేంజ్‌లో ప్రామిసింగ్ సినిమాలతో దూసుకెళ్తున్న హీరో విష్వక్సేన్. తనే దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తూ, హీరోగా నటిస్తున్న సినిమా ‘దాస్ కా ధమ్కీ’. విష్వక్సేన్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్‌ను ఈ సినిమాకు కేటాయించినట్లు సమాచారం. ఫిబ్రవరి సినిమాల్లో అన్నిటికంటే ముందు పబ్లిసిటీ ప్రారంభించింది కూడా ఈ సినిమాకే. దీనికి సంబంధించిన ‘ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా’ లిరికల్, వీడియో సాంగ్స్‌ను ఇప్పటికే విడుదల చేశారు. మూడు నిమిషాల నిడివి ఉన్న ఒక ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు.
2. సార్
తమిళ స్టార్ హీరో ధనుష్ టాలీవుడ్ ఎంట్రీ ఇది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘తొలి ప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్‌దే’ సినిమాల దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మొదట గతేడాది డిసెంబర్ 2వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆ తర్వాత 2023 ఫిబ్రవరి 17వ తేదీకి మార్చారు. డిసెంబర్ 2వ తేదీ విడుదల అనుకున్నప్పుడే దీనికి సంబంధించిన ‘మాస్టారు మాస్టారు’ అనే పాటను విడుదల చేశారు. ఆ పాట తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ సూపర్ హిట్ అయింది.
3. వినరో భాగ్యము విష్ణు కథ
హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న తెలుగు హీరో కిరణ్ అబ్బవరం. 2021లో వచ్చిన ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ తర్వాత ఆ స్థాయి సినిమా ఇంతవరకు రాలేదు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్ ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాను నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే ‘వానర సుహాస’ అనే పాట విడుదల అయింది. ఈ పాట సాహిత్యానికి మంచి పేరు వచ్చింది.
4. శాకుంతలం
ఈ ప్రాజెక్టు ఎప్పట్నుంచో వార్తల్లో ఉంది. 2022లో నవంబర్ 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాకపోవడంతో దాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు ఈ సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ‘శాకుంతలం’ను నిర్మించారు. సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ నాలుగు సినిమాల్లో మూడిటికి ప్రముఖ నిర్మాతల నుంచి బ్యాకింగ్ ఉంది. ‘సార్’ను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా, ‘శాకుంతలం’కు దిల్ రాజు నిర్మాత. ఇక ‘వినరో భాగ్యము విష్ణు కథ’కు బన్నీ వాస్ నిర్మాత అయినా గీతా ఆర్ట్స్ 2 కాబట్టి దాదాపుగా అల్లు అరవింద్ సినిమానే అనుకోవాలి. సంక్రాంతి తరహాలోనే థియేటర్ల సమస్య అప్పుడు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే నాలుగు సినిమాకు కలిపితే దాదాపు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరికి వారు తమకు ఎక్కువ థియేటర్లు కావాలని కోరుకునే అవకాశం ఉంది. మరి అప్పటికి ఎవరైనా వెనక్కి తగ్గి రిలీజ్‌ను వాయిదా వేసుకుంటారా? లేకపోతే అందరూ ఒకేరోజుకు వస్తారా? అనేది చూడాలి.