K Raghavendra Rao Vashishta: దర్శకుడు రాఘవేంద్రరావు స్టైలిష్ లుక్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కామెంట్, జక్కన్న హ్యాపీ
రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి 'పెళ్లి సందD' అనే సినిమా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నాడు.
ప్రముఖ సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు తాజాగా నటుడిగా మారారు. దాదాపు వందకి పైగా సినిమాలకు దర్శకత్వం వహించి అరుదైన ఘనత సాధించిన టాలీవుడ్ దర్శకేంద్రుడు తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి 'పెళ్లి సందD' అనే సినిమా తెరకెక్కుతో సంగతి తెలిసిందే. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నాడు. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో దర్శకేంద్రుడు కీలకపాత్ర పోషిస్తున్నారు. వశిష్ట అనే పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఆయన ఫస్ట్ లుక్ ను రివీల్ చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.
''సుమారు 100కి పైగా చిత్రాలకి దర్శకత్వం వహించిన మౌనముని తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు'' అంటూ దర్శకుడు రాజమౌళి ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రాఘవేంద్రరావు ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. సూట్ వేసుకొని.. గాగుల్స్ పెట్టుకొని దర్శనమిచ్చారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఈ వీడియోలో ఆయనతో పాటు టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తనయుడు యువ నటుడు రోషన్ కూడా కనిపించాడు.
ఈ వీడియోపై సెలబ్రిటీలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ట్విట్టర్ వేదికగా రాఘవేంద్రరావుకి శుభాకాంక్షలు చెప్పారు.
''తెలుగు సినిమాకి కమర్షియల్ సొబగులు అద్దిన శతాధిక చిత్రాల దర్శకుడిగా సినీ చరిత్రలో మీకంటూ ప్రత్యేక స్థానం ఉంది. అగ్రశ్రేణి తారల నుంచి నవతరం నటుల వరకూ అన్ని తరలవారితోనూ హావభావాలు పలికించి వెండితెరపై మెరిసేలా చేసిన దర్శకేంద్రులు మీరు. కెమెరా వెనుక నుంచే 'స్టార్ట్.. కెమెరా.. యాక్షన్..' అనే మీరు ఇప్పుడు కెమెరా ముందుకు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. 'పెళ్లి సందడి' చిత్రంతో దర్శకులు రాఘవేంద్రరావు గారు నటులు రాఘవేంద్రరావు గారు కావడం ఈ సినీ ప్రయాణంలో ఓ కొత్త మైలురాయి. దర్శకుడిగా నాలుగున్నర దశాబ్దాల అనుభవం మీ నటనలో కచ్చితంగా ప్రతిఫలిస్తుంది. మీ దర్శకత్వంలో సినిమాలు చేయాలని నటులు ఎలా ఉవ్విళ్ళూరారో.. ఇకపై తమ దర్శకత్వంలో మీరు నటించాలని దర్శకులు ఉత్సాహం చూపుతారు. ఈ ప్రస్థానంలోనూ మీదైన ముద్రను వేయగలరు. కెప్టెన్ ఆఫ్ ది షిప్ గా ఘన విజయాలను సొంతం చేసుకున్న మీరు నటుడిగానూ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను'' అంటూ పవన్ రాసుకొచ్చారు.
మరి రాఘవేంద్రరావు నటుడిగా ఎలాంటి మార్క్‌ను క్రియేట్ చేస్తారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.