చిక్కుల్లో ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ - ఆ సీన్లు అసత్యాలు, చర్యలు తీసుకోండి: ఇస్రో శాస్త్రవేత్తలు
తాజా సంచలన మూవీ ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ను ఇస్రో మాజీ శాస్త్రవేత్తల బృందం తప్పుబట్టింది. ఈ సినిమాతో పాటు కొన్ని టీవీ ఛానెళ్ల ద్వారా నారాయణన్ చేసిన వాదనలు అవాస్తవమని తేల్చి చెప్పింది.
నటుడు ఆర్ మాధవన్ అన్నీ తానై తెరకెక్కించిన తాజా సినిమా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ ఈ సినిమాకు దర్శకత్వం వహించమే కాకుండా కథ కూడా ఆయనే రాసుకున్నారు. నిర్మాత కూడా ఆయనే. ఏరోస్పేస్ ఇంజినీర్ నంబి నారాయణ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో మాధవన్ నంబీ పాత్రను పోషించారు. ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. చేయని తప్పుకు నంబి నారాయణ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే విషయాన్ని ఈ సినిమాలో మాధవన్ చూపించారు.
తాజాగా ఈ సినిమాను ఇస్రో మాజీ శాస్త్రవేత్తల బృందం తీవ్రంగా తప్పుబట్టింది. Dr ఏ.ఈ.ముత్తునాయగం, డైరెక్టర్, LPSE, ISRO, క్రయోజెనిక్ ఇంజిన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఈవీఎస్ నంబూతిరి, క్రయోజెనిక్ ఇంజిన్ డిప్యూటీ డైరెక్టర్ డీ శశికుమారన్, ఇస్రోకు చెందిన ఇతర మాజీ శాస్త్రవేత్తలు మీడియా ముందుకు వచ్చి కీలక విషయాలను వెల్లడించారు. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాతో పాటు పలు టీవీ ఛానెళ్ల ద్వారా నంబి నారాయణన్ ఇస్రోతో పాటు ఇతర శాస్త్రవేత్తలను పరువు తీశారని మండిపడ్డారు. అందుకే ప్రజలకు కొన్ని విషయాలను చెప్పడానికి మీడియా ముందుకు వచ్చినట్లు వెల్లడించారు. చాలా ప్రాజెక్టులకు పితామహుడినని నంబి నారాయణ్ చేస్తున్న వాదనలు అవాస్తవమన్నారు.
భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంను ఆయన ఒకసారి సరిదిద్దినట్లు కూడా సినిమాలో చూపించారని, అది కూడా పచ్చి అబద్ధం అని వెల్లడించారు. ఈ సినిమాలో చేసిన తప్పుడు వాదనలపై నిర్ణయం తీసుకోవాలని ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎస్ సోమనాథ్‌ను కోరినట్లు తెలిపారు. నారాయణన్‌ని అరెస్టు చేయడం వల్ల భారత్ క్రయోజెనిక్ టెక్నాలజీని కొనుగోలు చేయడంలో జాప్యం జరిగిందని సినిమాలో చూపించారని, అది కూడా అసత్యమేనని శాస్త్రవేత్తలు తెలిపారు. 1980లో క్రయోజెనిక్ టెక్నాలజీని ఇస్రో అభివృద్ధి చేయడం ప్రారంభించిందన్నారు. అప్పుడు నంబూతిరి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారని తెలిపారు. నారాయణన్ కి ఈ ప్రాజెక్ట్ తో ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు.
ఇస్రోకు సంబంధించి సినిమాలో చూపించిన విషయాల్లో 90 శాతం అవాస్తవమని మాజీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. సినిమాలో చెప్పినవన్నీ నిజమని నారాయణన్ కొన్ని టీవీ ఛానెళ్లలో చెప్పారని తమకు తెలిసిందన్నారు. అంతేకాదు.. కొంతమంది శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనలకు కూడా నారాయణన్ క్రెడిట్ తీసుకుంటున్నారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై సినిమా యూనిట్ నుంచి ఎలాంటి వివరణ రాలేదు.
76 ఏళ్ల నంబి నారాయణన్ ఇస్రోకు సంబంధించిన రహస్యాలను విదేశాలకు అమ్ముకున్నారని ఆయపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన రెండు నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత ఈ కేసు సీబీఐకి చేరింది. విచారణలో తనపై తప్పుడు కేసు నమోదైనట్లు సీబీఐ తేల్చి చెప్పింది. కాంగ్రెస్ లోని ఒక వర్గం అప్పటి కేరళ ముఖ్యమంత్రి దివంగత కె కరుణాకరణ్ ను టార్గెట్ చేసుకుని ఈ కేసును తెరమీదకు తెచ్చింది. నంబి అరెస్టు తర్వాత ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి వామపక్షాలు కూడా ఈ ఘటనను ఉపయోగించుకున్నాయి.