సమంత ఫ్లైట్‌కు ఎక్కువ ధర చెల్లించాల్సి వచ్చింది, రిక్వెస్ట్ చేసినా ఉండలేదు: సామ్ ఫస్ట్ ఆడిషన్‌పై దర్శకుడు శివ నాగేశ్వరరావు కామెంట్స్
సమంతకు 2010లో వచ్చిన ‘ఏ మాయ చేశావే’ సినిమాతో తన సినీ కెరీర్ ను ప్రారంభించిందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమా కంటే ముందే ఆమె ఓ తెలుగు సినిమాకు ఆడిషన్ కు వచ్చిందట.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా నటించిన చిత్రం ‘శాకుంతలం’. ఈ మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో సమంత నటనకు మంచి ప్రశంసలు అందుతున్నా.. మరోవైపు ఇది సమంతకు సరిపోయే పాత్రకాదనే విమర్శలు కూడా వస్తున్నాయి. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని భావించారు. కానీ, ఆశించిన ఫలితం రాలేదు. అయితే, ఈ మూవీ విజయానికి సమంత కారణమని కొందరు అంటుంటే.. గుణశేఖర్ టేకింగ్ బాగోలేదని మరికొందరు అంటున్నారు. ఈ రోజుల్లో అలాంటి సబ్జెక్ట్ ఎంచుకోవడమే తప్పని మరికొందరు అంటున్నారు. అయితే, ఈ మూవీ రిలీజ్‌కు ముందు సమంత చేసిన కొన్ని వివాదాస్పద కామెంట్లు, పబ్లిసిటీపై ఇప్పుడు ట్రోల్స్ నడుస్తున్నాయి. ఆమె గురించి పలు వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా దర్శకుడు శివ నాగేశ్వరరావు.. సమంతపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి.
‘ఏమాయ చేశావే’ సినిమా కంటే ముందే తెలుగు సినిమాలో అవకాశం
సమంత 2010లో వచ్చిన ‘ఏ మాయ చేశావే’ సినిమాతో తన సినీ కెరీర్ ను ప్రారంభించిందన్న విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా కంటే ముందే ఆమె ఓ తెలుగు సినిమాకు ఆడిషన్ కు వచ్చిందట. ఈ విషయాన్ని దర్శకుడు శివ నాగేశ్వరరావు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఏ మాయ చేశావే’ సినిమా కంటే ముందు సమంతను ‘నిన్ను కలిశాక’ అనే సినిమాకు ఆడిషన్ కు పిలిపించినట్టు శివ నాగేశ్వరరావు చెప్పారు. ఆ సమయంలో సామ్ చెన్నైలోని సెయింట్ మేరీస్ కాలేజీలో చదువుతోందని అన్నారు. ‘నిన్ను కలిశాక’ సినిమా కోసం ఆమెను హైదరాబాద్ రావాలని ఇన్విటేషన్ పంపితే ఆమె వచ్చిందని చెప్పారు. ‘‘ఆడిషన్స్ తర్వాత ఆమెను చెన్నై పంపేందుకు ఏర్పాట్లు చేశాం. ఆ రోజు విమాన టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో ఆమెను ఆ ఒక్కరోజు హైదరాబాద్‌లో ఉండమని రిక్వెస్ట్ చేశాం. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. అందుకే చాలా డబ్బు ఖర్చు పెట్టి ప్రత్యేక టికెట్ కొని చెన్నై పంపించాం’’ అని గుర్తు చేసుకున్నారు.
ఆడిషన్ బాగా ఇచ్చినా, ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది
సమంతను ‘నిన్ను కలిశాక’ సినిమాలో ఎందుకు తీసుకోలేదో కూడా చెప్పుకొచ్చారు దర్శకుడు శివ నాగేశ్వరరావు. ఆమె ఆడిషన్ బాగానే ఇచ్చినా రెమ్యునరేషన్ ఎక్కువ అడగడంతో తాము నిర్ణయం మార్చుకున్నామని చెప్పారు. ఆ రోజు సినిమా బడ్జెట్ ఆమె అడిగినంత స్థాయిలో లేదని చెప్పుకొచ్చారు. కానీ సమంత ఎంతో కష్టపడి తన నటనతో ఈరోజు మంచి స్థాయిలో ఉందని చెప్పారు.
Read Also: ఓటీటీలోకి రవితేజ ‘రావణాసుర’, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
దర్శకుడు శివ నాగేశ్వరరావు ‘మనీ’, ‘మనీ మనీ’, ‘సిసింద్రీ’, ‘హేండ్సప్’, ‘ధనలక్ష్మి ఐ లవ్ యూ’, ‘మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి’ వంటి సినిమాలను తెరకెక్కించారు. ఆయన 2016లో ‘ఓవరాక్షన్’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా తర్వాత చాలా సంవత్సరాలు ఆయన సినిమా చేయలేదు. తాజాగా ఇప్పుడు ‘దోచేవారెవరురా’ అనే సినిమాను తీస్తున్నారు. ఈ సినిమాను కూడా కొత్త నటీనటులతోనే తెరకెక్కించనున్నారు శివ నాగేశ్వరరావు.