(Source: Matrize)
Dilip kumar : సైరా భానుతో సినిమా చేస్తే బాగోదన్న దిలీప్... ఆమెను ఎలా పెళ్లి చేసుకున్నారు?
బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన సైరా భానుతో కలిసి నటించడానికే ఇబ్బంది పడ్డ దిలీప్ కుమార్ చివరికి ఆమెనే పెళ్లి చేసుకొని తన జీవితాన్ని పంచుకున్నారు.
ఇండియన్ సినిమా గర్వించదగ్గ నటుల్లో దిలీప్ కుమార్ ఒకరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం నాడు (జూలై 7) కన్నుమూశారు. ఆయన మరణవార్త సినీ ప్రపంచం దిగ్బ్రాంతికి గురైంది. ఆయన భార్య సైరా భాను చివరివరకు భర్త పక్కనే ఉండి ఆయనకు సేవలు చేశారు. బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన సైరా భానుతో కలిసి నటించడానికే ఇబ్బంది పడ్డ దిలీప్ కుమార్ చివరికి ఆమెనే పెళ్లి చేసుకొని తన జీవితాన్ని పంచుకున్నారు.
వీరిద్దరికి మధ్య 22 ఏళ్ల వ్యత్యాసం ఉంది. భానుకి 22 ఏళ్ల వయసులో దిలీప్ కుమార్ ప్రపోజ్ చేశారు. అప్పటికి ఆయన వయసు 44. అప్పటికే దిలీప్ కుమార్ పై ఇష్టం పెంచుకున్న సైరా భాను 1966లో అతడిని పెళ్లాడింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో సైరా భాను తన భర్త దిలీప్ ని మొదటిసారి చూసిన సంగతుల గురించి పంచుకున్నారు.
మెహబూబ్ స్టూడియోస్ లో దర్శకుడు మెహబూబ్ ఖాన్ హోస్ట్ చేసిన పార్టీలో తొలిసారి దిలీప్ కుమార్ ని చూశారట సైరా భాను. అప్పటికి ఆమె వయసుపన్నెండేళ్లు. ఆ పార్టీకి దిలీప్ కుమార్ వైట్ కలర్ షర్ట్, ప్యాంట్ వేసుకొని వచ్చారట. చెప్పులు కూడా తెల్ల రంగువే ధరించి పాలిష్డ్ లుక్ లో దర్శనమిచ్చారట. అప్పటికే దిలీప్ కుమార్ పై అభిమానం ఉండేదని చెప్పుకొచ్చారు.
16 ఏళ్ల వయసుకే సైరా భాను నటించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో దిలీప్ కుమార్ తో కలిసి 'రామ్ ఔర్ శ్యామ్' అనే సినిమాలో నటించే అవకాశం వస్తే.. ఆయన మాత్రం సైరా భానుని తీసుకోవద్దని చెప్పారట. 22 ఏళ్ల అమ్మాయి పక్కన 44 ఏళ్ల వయసు గల తను నటిస్తే చూసేవాళ్లకు ఎబ్బెట్టుగా ఉంటుందేమోనని దిలీప్ కుమార్ భయపడ్డారు. అలానే సైరా భాను హీరోయిన్ మెటీరియల్ కాదని దిలీప్ కుమార్ ఫీల్ అయ్యేవారట. దానికి కారణం సైరా భాను సైలెంట్ గా ఉండడం, కాస్త సిగ్గరి కావడంతో దిలీప్ కుమార్ కి ఆమెపై అలాంటి ఒపీనియన్ ఏర్పడింది. దీంతో సైరా భానుకి బదులుగా ముంతాజ్ ను తీసుకోవాలని ఆయన చెప్పడంతో దర్శకనిర్మాతలు ఆయన మాట కాదనలేకపోయారు. ఈ సినిమాతోనే ముంతాజ్ కి మంచి ఫేమ్ వచ్చింది.
ఆ తరువాత సైరా భానుని ప్రేమించి.. పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన ఐదేళ్లకు సైరా భాను గర్భం దాల్చింది. అయితే ప్రెగ్నన్సీ సమయంలో ఆమెకి బీపీ పెరిగిపోవడంతో సీరియస్ అయింది. ఎనిమిది నెలల గర్భిణి అయిన భానుని హాస్పిటల్ లో జాయిన్ చేయగా.. వైద్యులు బిడ్డను కాపాడలేకపోయారు. అప్పుడే ఈ జంట ఇక పిల్లలను కనకూడదని నిర్ణయించుకున్నారు.
ఆ తరువాత 1981లో ఆస్మా రెహ్మాన్ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నారు దిలీప్ కుమార్. అయితే పెళ్లైన రెండేళ్లకే ఆమె నుండి విడిపోయారు. తన జీవితంలో చేసిన పెద్ద తప్పు ఇదేనంటూ గతంలో దిలీప్ కుమార్ ఓ సందర్భంలో చెప్పారు.