Masooda Release By Dil Raju : 'మసూద' - 'దిల్' రాజు ద్వారా విడుదల
Masooda Release Date : 'మసూద' చిత్రాన్ని తమ సంస్థ ద్వారా విడుదల చేస్తున్నట్టు ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు చెప్పారు. అంతే కాదు... నిర్మాత రాహుల్ యాదవ్ తీసిన చిత్రాలకు తాను అభిమానిని అని చెప్పారు.
నిర్మాత 'దిల్' రాజు (Dil Raju) కు చాలా మంది అభిమానులు ఉన్నారు. అటువంటి ఆయన ఓ చిన్న నిర్మాత తీసిన సినిమాలకు అభిమాని అని చెప్పారంటే మామూలు విషయం కాదు. నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా కోసం ఆయన ఓ సినిమా విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. అసలు వివరాల్లోకి వెళితే...
తిరువీర్ (Thiruveer), కావ్యా కళ్యాణ్ రామ్ (Kavya Kalyanram) జంటగా నటించిన సినిమా 'మసూద' (Masooda Movie). ఇందులో సంగీత (Sangeetha) ప్రధాన పాత్ర చేశారు. 'మళ్లీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలో రూపొందిన మూడో చిత్రమిది. రాహుల్ యాదవ్ నక్కా (Rahul Yadav Nakka) నిర్మాత. ఈ నెల 18న సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా 'దిల్' రాజు విడుదల చేస్తున్నారు. ఈ రోజు విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు (Masooda On Nov 18th).
అప్పుడే రాహుల్‌కి మాటిచ్చా - 'దిల్' రాజు
'మళ్ళీ రావా'తో గౌతమ్ తిన్ననూరిని, 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'తో స్వరూప్ ఆర్ఎస్‌జేను దర్శకులుగా పరిచయం చేశారు రాహుల్ యాదవ్ నక్కా. ఈ విషయం చెప్పిన 'దిల్' రాజు... ''రాహుల్ నిర్మించిన లాస్ట్ రెండు సినిమాలకు నేను ఫ్యాన్. ఆయన అభిరుచి గల నిర్మాత. ఆ రెండు సినిమాలు నచ్చి 'తర్వాత ఏదైనా సినిమా ఉంటే.. నువ్వు నిర్మించిన తర్వాత మా ద్వారా విడుదల చేద్దాం' అని రాహుల్‌కి మాటిచ్చాను. ఇప్పుడీ 'మసూద'ను మా ఎస్‌విసి ద్వారా విడుదల చేయబోతున్నాం. టీజర్ చూశా... ఇంట్రెస్టింగ్‌గా, ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఈ సినిమాతో కూడా కొత్తవారిని పరిచయం చేస్తున్నాడు రాహుల్. అతడితో అసోసియేట్ అవడం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. త్వరలో సినిమా చూడటానికి వెయిటింగ్. నవంబర్ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది'' అని అన్నారు.
మూడేళ్ళ కష్టమిది - రాహుల్ యాదవ్ నక్కా!
కరోనా కారణంగా సినిమా విడుదల ఆలస్యమైందని, తమ యూనిట్ మూడేళ్ళ కష్టానికి రిజల్ట్ 'మసూద' అని రాహుల్ యాదవ్ నక్కా తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''దిల్' రాజు గారికి థ్యాంక్స్. ఆయనది చాలా మంచి చెయ్యి. నాది కూడా మంచి చెయ్యి. మా ఇద్దరి చేతులు కలిస్తే సౌండ్ గట్టిగా వస్తుందని భావిస్తున్నా. ఆయన నమ్మకం నిలబెట్టుకుంటాననే నమ్మకం ఉంది. ఈ సినిమాతో కొత్త దర్శకుడు సాయి కిరణ్‌ను పరిచయం చేస్తున్నా. చాలా మంది ప్రతిభావంతులు ఈ సినిమాకు పని చేశారు. మధ్యలో వేరే అవకాశాలు వచ్చినా వెళ్ళకుండా సినిమా కోసం కష్టపడ్డారు. అందరికీ థాంక్స్'' అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో తిరువీర్, హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్, బాందవి శ్రీధర్, సంగీత దర్శకుడు ప్రశాంత్, సినిమాటోగ్రాఫర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : వదిలేస్తే వరస్ట్‌గా చేస్తున్నారేంటి? - ట్రోలర్స్‌కు రష్మిక స్ట్రాంగ్ కౌంటర్
'జార్జ్ రెడ్డి'లో లలన్ సింగ్ పాత్రలో, 'ఆహా' వెబ్ సిరీస్ 'సిన్'లో హీరోగా నటించిన తిరువీర్‌కు 'మసూద' సక్సెస్ చాలా అవసరం. ఇది హిట్ అయితే హీరోగా ఆయనకు మరిన్ని అవకాశాలు వస్తాయి. 'గంగోత్రి'లో బాల నటిగా కనిపించిన కావ్యా కళ్యాణ్ రామ్, ఈ సినిమాతో కథానాయికగా పరిచయం అవుతున్నారు. హారర్ డ్రామాగా 'మసూద' రూపొందింది.
అఖిల రామ్, బాంధవి శ్రీధర్, 'సత్యం' రాజేష్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ తదితరులు నటించిన ఈ చిత్రానికి కూర్పు : జెస్విన్ ప్రభు, ఛాయాగ్రహణం : నగేష్ బానెల్, స్టంట్స్: రామ్ కిషన్, 'స్టంట్' జాషువా, సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి, నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా, రచన, దర్శకత్వం: సాయికిరణ్.