BiggBoss NonStop OTT: ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’కు ఫుల్ స్టాప్? ఆగిన లైవ్ స్ట్రీమింగ్
బిగ్‌బాస్ లైవ్ స్ట్రీమింగ్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో తెలుసుకోవాలంటే చదవండి మరి...
స్టార్ మా బిగ్‌బాస్ వారి వ్యవహారం చూస్తుంటే... ‘ఇంతన్నాడు అంతన్నాడే గంగరాజు’ పాట గుర్తుకు రావడం ఖాయం. ట్రైలర్లో నో కామా, నో ఫుల్ స్టాప్ అన్నారు, అలా చెప్పి నాలుగు రోజులు అయ్యిందో లేదో, అప్పుడే పెద్ద గ్యాప్ ఇచ్చారు. నాన్‌స్టాప్ లైవ్ స్ట్రీమింగ్ ఆగిపోయింది. 24/7 లైవ్ స్ట్రీమింగ్ అని చెప్పి దాన్నే ముందు నిలిపివేశారు. తొలిసారి ఓటీటీ వెర్షన్లో అడుగుపెట్టిన తెలుగు బిగ్ బాస్‌కు టైమ్ కలిసొచ్చినట్టు లేదు. గొడవలు, అరుపులతో ఇప్పుడిప్పుడే ఆట రసవత్తరంగా మారుతున్న సమయంలో లైవ్ స్ట్రీమింగ్ కు దెబ్బపడింది.
డిస్నీ హాట్ స్టార్ ఓటీటీలో బిగ్‌బాస్ 24 గంటల లైవ్ స్ట్రీమింగ్‌ను ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏమైందో తెలియదు కానీ బుధవారం అర్థరాత్రి 12 గంటల నుంచి లైవ్ స్ట్రీమింగ్ ఆగిపోయింది. లైవ్ కు బదులు మళ్లీ నాగార్జున హోస్ట్ చేసిన మొదటి ఎసిపోడ్‌నే ప్రసారం చేయడం ప్రారంభించారు. మధ్యలో ఓ స్క్రోలింగ్ ను ప్రసారం చేశారు. అందులో ‘మరింత వినోదాన్ని అందించేందుకు హౌస్ ని రెడీ చేస్తున్నాం. మళ్లీ లైవ్ గురువారం అర్థరాత్రి 12 నుంచి ప్రసారం చేస్తాం. ఏ రోజుకి ఆరోజు పూర్తి ఎపిసోడ్ రాత్రి 9 గంటలకు విడుదల అవుతుంది. తప్పక చూడండి’ అని రాశారు. దీన్ని బట్టి లైవ్ స్ట్రీమింగ్ లో ఏదో సమస్య వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు ప్రేక్షకులు. ఎందుకంటే షో మొదలైనప్పటి నుంచి లైవ్ స్ట్రీమింగ్ స్లో అవ్వడం, కాసేపు ఆగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వాటన్నింటినీ క్లియర్ చేసేందుకే ఇలా 24 గంటల గ్యాప్ తీసుకున్నట్టు సమాచారం.
లైవ్ స్ట్రీమింగ్ కష్టమే...
బుధవారం వరకు మనం చూసిన ఎపిసోడ్ లు నిజానికి లైవ్ కాదు. అక్కడ జరిగినదానికి, మనం చూసేదానికి కొన్ని గంటల వ్యవధి ఉంటుంది. మధ్యలో కొన్ని ఎడిటింగ్ లు చేసి మనకి ప్రసారం చేస్తారు. గురువారం అర్థరాత్రి నుంచి మాత్రం ఏకంగా 24 గంటల గ్యాప్ తో మనకు లైవ్ ప్రసారం కానుంది. అంటే ముందు రోజు జరిగింది మొత్తం మరుసటి రోజు ప్రసారం అవుతుంది. అంటే ఇది లైవ్ స్ట్రీమింగ్ కాదన్న మాట. రోజంతా చూడలేని గంట ప్రోగ్రాములు కూడా చూసుకునే వీలుంది.
View this post on Instagram