Dhanush On Akahnda Movie : బాలకృష్ణ పాటలు మెచ్చిన ధనుష్ - తమన్‌కు రిక్వెస్ట్
Sir Movie Review In Telugu : బాలకృష్ణ సినిమాలో పాటలు నచ్చాయని తమిళ హీరో ధనుష్ చెప్పారు. అంతే కాదు... సంగీత దర్శకుడు తమన్‌కు ఒక రిక్వెస్ట్ కూడా చేశారు. అది ఏంటంటే?
కరోనా తర్వాత థియేటర్లకు పూర్వ వైభవం తీసుకు వచ్చిన సినిమాల్లో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వహించిన హ్యాట్రిక్ మూవీ 'అఖండ' తప్పకుండా ఉంటుంది. ఆ సినిమా చూడటానికి జనాలు ట్రాక్టర్ల మీద థియేటర్లకు వచ్చిన దృశ్యాలను మనం చూశాం.
'అఖండ' విజయంలో సంగీత దర్శకుడు ఎస్. తమన్ (Thaman Music Director) ముఖ్య భూమిక పోషించారు. ఆయన సంగీతం ప్రేక్షకులను ఒక ట్రాన్స్‌లోకి తీసుకు వెళ్ళింది. మరీ ముఖ్యంగా 'అఖండ' పాత్రకు ఇచ్చిన నేపథ్య సంగీతం కానీ, ఆ పాటలు గానీ అద్భుతమని ప్రశంసలు వచ్చాయి. శివుడి నేపథ్యంలో పాటలకు మంచి పేరు వచ్చింది. 'సార్' ప్రీ రిలీజ్ వేడుకలో తమిళ స్టార్ ధనుష్ (Dhanush) కూడా ఆ సాంగ్స్ గురించి ప్రస్తావించారు.
'అఖండ' మ్యూజిక్ ఫెంటాస్టిక్!
'సార్'కు ఏఆర్ రెహమాన్ మేనల్లుడు, యువ హీరో & కంపోజర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. హైదరాబాదులో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన రాలేదు. ఆయన బదులు తమన్ వచ్చారు. అందుకు ధనుష్ థాంక్స్ చెప్పారు. ఆ తర్వాత 'అఖండ' మ్యూజిక్ గురించి మాట్లాడారు. ''బ్రదర్... 'అఖండ'లో మీ వర్క్ ఫెంటాస్టిక్! నేను శివ భక్తుడిని. సినిమాలో శివుడి పాటలు ఉన్నాయి కదా! నాకు నచ్చాయి. నేను తమన్ కు ఫోన్ చేసి ఆ ట్రాక్స్ పంపించమని అడిగాను. కానీ, ఇంకా నాకు సెండ్ చేయలేదు'' అని ధనుష్ చెప్పారు. అదీ సంగతి!
తమిళంలో ధనుష్ స్పీచ్...
త్రివిక్రమ్ ట్రాన్స్‌లేషన్!
ధనుష్ నటించిన సినిమాలు ఇంతకు ముందు తెలుగులో విడుదల అయ్యాయి. అయితే, అవి అన్నీ డబ్బింగ్ సినిమాలు. 'సార్' ఆయనకు తొలి స్ట్రెయిట్ తెలుగు సినిమా. ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన వీలైనంత వరకు వచ్చిన తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేశారు. తప్పులు ఉంటే క్షమించమని అడిగారు. అయితే, ఆయన మాట్లాడిన కొన్ని తమిళ వ్యాఖ్యలకు త్రివిక్రమ్ ట్రాన్స్‌లేషన్ చేయడం విశేషం. అంతే కాదు.. ధనుష్ నటన గురించి కూడా త్రివిక్రమ్ గొప్పగా చెప్పారు. ఒక ఎంజీఆర్, ఒక శివాజీ గణేశన్ తరహాలో ఆ తర్వాత తరంలో గొప్ప నటుడు అని పేర్కొన్నారు.
సింపుల్ సినిమా...
గ్రాండ్ ఎమోషన్స్!
'సార్' సినిమాలో తన నటన చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటుందని ధనుష్ తెలిపారు. ఎమోషన్స్ మాత్రం గ్రాండ్ గా ఉంటాయని అన్నారు. సందేశం ఇచ్చినా సరే క్లాస్ పీకినట్టు ఉండదని, చాలా వినోదాత్మకంగా సినిమా తీశామని ఆయన వివరించారు. తమిళంలో తొలి సినిమా చేసినప్పుడు ఎటువంటి నెర్వస్ ఫీలింగ్ అయితే ఉందో... ఇప్పుడు కూడా అటువంటి ఫీలింగ్ ఉందని ఆయన తెలిపారు.
Also Read : వంటింట్లోకి రావొద్దు - త్రివిక్రమ్‌కు వైఫ్ ఆర్డర్! ఎందుకంటే?
ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మాణంలో 'సార్' సినిమా రూపొందింది. ఇది తమిళంలో 'వాతి'గా విడుదల కానుంది. ఫిబ్రవరి 17న (శుక్రవారం, రేపే) ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు 'తొలిప్రేమ', 'మిస్టర్ మజ్ను', 'రంగ్ దే' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇందులో సంయుక్తా మీనన్ హీరోయిన్.
Also Read : ప్రేమికుల రోజున స్టార్ హీరోయిన్లు ఎక్కడ ఉన్నారు? ఎవరితో ఉన్నారంటే?