Botsa Satyanarayana: రైతుల సమస్యలపై వైసీపీ పోరుబాట, యూరియా కొరతపై ఈ 9న రాష్ట్రవ్యాప్త నిరసన
Andhra Pradesh News | బీజేపీ పాలిత ప్రాంతాల్లో లేని యూరియా కొరత ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు వచ్చిందని ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Urea shortage in Andhra Pradesh | విశాఖపట్నం: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రైతులకు ఎదురవుతున్న ప్రధాన సమస్య యూరియా కొరత. తెలంగాణలో ఈ సమస్య చాలానే ఉంది. ఏపీ ప్రభుత్వం చర్యలతో రాష్ట్రంలో యూరియా కొరత తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే పంటలు వేసుకునే రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. రైతులకు యూరియా కొరత సమస్యలపై వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని మాజీ మంత్రి బొత్ససత్యనారాయణ తెలిపారు.
యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖపట్నంలో బొత్స మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ రైతుల పక్షాన నిలిచి నిరసనకు దిగుతుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని యూరియా కొరత మిత్రపక్షం ఉన్నప్పటికీ ఏపీలోనే ఎందుకు ఉంది అని ప్రశ్నించారు. వర్షాలు కురిసినా రాష్ట్రవ్యాప్తంగా రైతులకు యూరియా అందడం లేదు. వ్యవసాయశాఖ మంత్రి తక్షణమే రాష్ట్రంలో యూరియా కొరతపై రైతుల సమస్యల పరిస్థితిని సమీక్షించాలన్నారు.
LIVE: Legislative Council Leader of the Opposition Sri Botsa Satyanarayana Press Meet https://t.co/G5E1vCt6Nq
— YSR Congress Party (@YSRCParty) September 7, 2025
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ అసెంబ్లీ సాక్షిగా గళం విప్పుతుందన్నారు. వైసీపీ నిర్మించిన రుషికొండ ప్రభుత్వ భవనాలపై కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రుషికొండ ప్యాలెస్‌ను ప్రభుత్వ భవనంగా వినియోగించాలని డిమాండ్ చేశారు. ఆదాయం సమకూరడానికి బదులు నష్టం జరుగుతుంటే కనుక వేలం వేయడం సరైన చర్య అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
అన్నదాత పోస్టర్ రిలీజ్ చేసిన వైసీపీ
ఏపీలో రైతులకు యూరియా కొరతతో పాటు విత్తన కొరత లాంటి సమస్యలపై వైసీపీ పోరుబాట పట్టాలని నిర్ణయం తీసుకుంది. యూరియా కొరతతో పాటు రైతుల సమస్యలపై సెప్టెంబర్ 9వ తేదీన ఏపీలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేయడానికి పార్టీ శ్రేణులకు వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నదాత పోరు పోస్టర్‌ను శనివారం (సెప్టెంబర్ 6న) విడుదల చేశారు.
సాగు చేయడానికి రైతులు ఏర్పాటు పూర్తి చేసుకున్నా, యూరియా దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నారని సజ్జల పేర్కొన్నారు. యూరియా అడుగుతుంటే రైతులను బొక్కలో తోస్తానంటూ సీఎం చంద్రబాబు అన్నదాతలను రైతులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ఉన్నది కూటమి పాలన కాదని, నియంతృత్వ పాలన అని ఎద్దేవా చేశారు. టీడీపీ సహా కూటమి నాయకులు రైతులకు అందాల్సిన యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలించి వ్యాపారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఏపీలో ఎరువుల కృత్రిమ కొరతను సృష్టించి రైతులను భయాందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.






















