భయం వద్దు, దేశం సురక్షితమైన చేతుల్లో ఉంది - సల్మాన్‌కు ధైర్యం చెప్పిన కంగనా
ఇండియాలో భద్రతపై ఇటీవల బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై నటి కంగనా రనౌత్ స్పందించారు. దేశం ప్రస్తుతం సురక్షితమైన చేతుల్లో ఉందన్నారు. భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు.
Kangana Ranaut : గత కొంత కాలంగా బాలీవుడ్ స్టార్ హీరో, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పై వస్తున్న బెదిరింపులపై తాజాగా నటి కంగనా రనౌత్ స్పందించారు. బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. కేంద్రం నుంచి భద్రత లభిస్తుందని ఆమె చెప్పారు. ఎప్పుడూ వివాదాస్పద కామెంట్స్, ఎత్తి చూపే వ్యాఖ్యలు చేసే కంగనా.. తాజాగా సల్మాన్ కు మద్దతుగా నిలుస్తూ చేసిన వ్యాఖ్యలను చూసి అందరూ షాక్ అవుతున్నారు.
బీటౌన్ లో పరిచయం అక్కర్లేని హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్.. టాలీవుడ్ ప్రేక్షకులకూ సుపరిచితమే. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ చిత్రంలో నటించారు. కాగా ఏప్రిల్ 30న హరిద్వార్‌కు వెళ్లిన కంగనా.. గంగా హారతి చేశారు. త్వరలోనే కేదార్‌నాథ్ ధామ్‌ను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బాలీవుడ్ బాయ్ జాన్ సల్మాన్ ఖాన్ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఆయన ఆప్ కి అదాలత్ షోలో మాట్లాడిన సల్మాన్.. ఎక్కడికి వెళ్లినా తనకు పూర్తి భద్రత ఉంటుందన్నారు. దుబాయ్ పూర్తిగా సురక్షితం.. కానీ భారతదేశంలోనే ఒక చిన్న సమస్య ఉందంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో నటి కంగనా.. సల్మాన్ కు కేంద్రం భద్రత కల్పించిందన్నారు. దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని, అందువల్ల భద్రత గురించి భయపడాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా నుంచి అతనికి రక్షణ లభిస్తోందన్న కంగనా.. తనకు బెదిరింపులు వచ్చినపుడు తనక్కూడా సెక్యూరిటీ కల్పించారని తెలిపారు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.
ఇటీవలే ముంబై పోలీసులు సల్మాన్ ఖాన్‌కు వై-కేటగిరీ భద్రతను కల్పించారు. యూఏఈలో క్షేమంగా ఉన్న సమయంలో 'ఇండియా కే అందర్ తోడా సా హై ప్రాబ్లమ్ (ఇండియాలో చిన్న సమస్య ఉంది)' అని సల్మాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. "మీరు ఏమి చేసినా ఏమి జరగబోతోందో అది జరుగుతుందని నాకు తెలుసు. (పైకి చూపుతూ, దేవుడిని సూచిస్తూ).. ఆయన ఉన్నాడని నమ్ముతున్నా" అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి బెదిరింపు లేఖ రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ కు సెక్యూరిటీ ఎస్కార్ట్‌లను కేటాయించింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో కూడా సల్మాన్‌కు ఇద్దరు వేర్వేరు వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్‌తోపాటు లేఖ కూడా వచ్చింది.
ప్రస్తుతం హరిద్వార్ లో ఉన్న కంగనా రనౌత్.. ఎమర్జెన్సీతో బిజీ షెడ్యూల్ లో గడుపుతోంది. ఈ సినిమాలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ క్యారెక్టర్ ను కంగనా పోషిస్తున్నారు. రజనీకాంత్ 2005 లో వచ్చిన తమిళ చిత్రానికి సీక్వెల్ అయిన తేజస్ , మణికర్ణిక రిటర్న్స్: ది లెజెండ్ ఆఫ్ దిద్దా , ది అవతారం: సీత, చంద్రముఖి 2 లో కంగనా కనిపించనుంది. వీటితో పాటు దర్శకుడు ప్రదీప్ సర్కార్‌తో బెంగాలీ థియేటర్ లెజెండ్ నోటీ బినోదిని జీవితం ఆధారంగా ఒక బయోపిక్‌లో నటించనుంది.