Mahi V Raghav On AP Voters : ఆంధ్రలో ఓటర్లను తక్కువ అంచనా వేయొద్దు - 'యాత్ర 2' దర్శకుడి సంచలన వ్యాఖ్యలు
వైఎస్ జగన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా 'యాత్ర 2' తీస్తున్న దర్శకుడు మహి వి రాఘవ్, ఏపీలో ఓటర్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది పైగా సమయం ఉంది. అయితే, ఆల్రెడీ రాజకీయ పార్టీల అధినేతలు సమర శంఖం పూరించారు. ప్రత్యర్థుల మీద విమర్శల బాణాలు ఎక్కు పెడుతున్నారు. తెలుగు సినిమాలనూ ఆ ఎన్నికల వేడి తాకుతోంది. ఏపీ ఎన్నికలకు ముందు రాజకీయ నేపథ్యంలో కొన్ని సినిమాలు రానున్నాయి. వాటిలో ముఖ్యమైనది 'యాత్ర 2'.
జగన్ నుంచి ఏపీ ముఖ్యమంత్రి వరకు!
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర మీద తీసిన 'యాత్ర' ప్రజల ముందుకు వచ్చింది. వైయస్సార్ తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ప్రజల్లో సానుభూతి తీసుకు రావడం వెనుక ఆ సినిమా కొంత ప్రభావితం చూపించిందని విశ్లేషకుల భావన. ఇప్పుడు వచ్చే ఎన్నికలకు ముందు 'యాత్ర 2'ను విడుదల చేయనున్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో 2009 నుంచి 2019 వరకు ప్రయాణాన్ని 'యాత్ర 2'లో చూపించనున్నారు. అంటే... తండ్రి మరణం నుంచి తనయుడు ముఖ్యమంత్రి అయ్యే వరకు జరిగిన రాజకీయ పరిణామాలు అన్నమాట. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా సినిమా వస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే... ఏపీలో ఓటర్లను తక్కువ అంచనా వేయవద్దని దర్శకుడు మహి వి రాఘవ్ చెబుతున్నారు.
సినిమాతో ఓటర్లు ప్రభావితం అవుతారని అనుకోను!
''ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్లను తక్కువగా అంచనా వేయొద్దు. 'యాత్ర 2'తో ఓటర్లు ప్రభావితం అవుతారని అనుకోవద్దు. సినిమా చూసి ప్రజలు ఎమోషనల్ అవుతారు. అయితే... పోలింగ్ బూత్‌లోకి ఎంటరైన తర్వాత వాళ్లకు నచ్చిన వాళ్లకు ఓటు వేస్తారు. 'యాత్ర 2'లో జగన్ గారు ఎక్కడి నుంచి ప్రయాణాన్ని మొదలు పెట్టారు? ఎక్కడి వరకు ఎదిగారు? అనేది చూపిస్తున్నాం. పొలిటికల్ సినిమాలు చేయడమే రిస్క్. ఇటువంటి సినిమాలు ఎప్పుడు, ఏ సమయంలో విడుదల చేస్తాం? అనేది ముఖ్యం. అందుకని, ఎన్నికల టైంలో విడుదల చేయాలని అనుకుంటున్నాం. సినిమాలో మనం ఏది చెప్పినా... నమ్మేవాళ్లు నమ్ముతారు, నమ్మని వాళ్లు నమ్మరు. 'యాత్ర 2'ను వైసీపీ వాళ్ల కోసమే తీస్తున్నామని కొందరు అనుకుంటే... అనుకోనివ్వండి'' అని మహి వి రాఘవ్ స్పష్టం చేశారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న 'వ్యూహం' తమ సినిమాపై ఎటువంటి ప్రభావం చూపించదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Also Read : విజయ్ దేవరకొండను అమెరికా తీసుకు వెళుతున్న 'దిల్' రాజు, పరశురామ్!
ఫిబ్రవరి 2024లో 'యాత్ర 2'
Yatra 2 Release Date : 'యాత్ర 2' చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు. అయితే... ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో జగన్ మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు జీవా కనిపించనున్నారు. ఇంకా ఆయన పేరు కూడా అధికారికంగా వెల్లడించలేదు. అయితే... ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు రాజకీయ నేపథ్యంలో మరికొన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉందని తెలుగు సినిమా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read : మనల్ని ఆపే మగాడు ఎవడు 'బ్రో' - పవన్ సినిమాలో ఫస్ట్ పాట
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial