Writer Sarath Chandra: రూ. 170 కోట్లకు మించి ఇచ్చినా రాజీపడను, ‘శ్రీమంతుడు’ కేసుపై శరత్ చంద్ర హాట్ కామెంట్స్
‘శ్రీమంతుడు’ కాపీరైట్స్ కేసు వ్యవహారంపై రచయిత శరత్ చంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బు కోసం తాను ఈ పోరాటం చేయడం లేదని, న్యాయం కోసం కొట్లాడుతున్నానని వెల్లడించారు.
Writer Sarath Chandra About Srimanthudu Case: ‘శ్రీమంతుడు’ కాపీ రైట్ కేసు వ్యవహారంపై రచయిత శరత్ చంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2012 నుంచి తాను చేస్తున్న పోరాటం డబ్బు కోసం కాదని, కేవలం న్యాయం కోసమేనని తేల్చి చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, తన నవల, ‘శ్రీమంతుడు’ సినిమా గురించి మాట్లాడారు. “నేను రాసిన ‘చచ్చేంత ప్రేమ‘ అనే నవల 2012లో స్వాతిలో ప్రచురితం అయ్యింది. ఈ కథతో సినిమా చేయాలి అనుకున్నాను. దర్శకుడు వి.సముద్ర దగ్గరికి వెళ్లాను. బాగుంది అన్నారు. అదే సమయంలో మహేష్ సినిమా రిలీజ్ అయ్యింది. ఫ్రెండ్ చూసి, నీ నవల కాపీలా ఉంది చూడు అన్నాడు. ఆ సినిమా చూసిన తర్వాత మక్కీకి మక్కీ కాపీ అని అర్థం అయ్యింది. కొరటాల శివ నెంబర్ తీసుకుని కాల్ చేశాను. ఆ ఫోన్ వేరే ఎవరో ఎత్తి, ‘శ్రీమంతుడు‘ సక్సెస్ అయ్యాక, తను అమెరికాకు వెళ్లాడని చెప్పారు. ఈ సినిమా కథ కాపీ చేశారని చెప్పాను. మీరు తెలిసి చేశారో, పొరపాటున చేశారో తెలియదు కానీ, కాపీ వాస్తవం అన్నాను. ఏంటి? ఆధారం అన్నారు. ఈ సినిమా, నా నవలలోని 20 పోలికలను పంపించాను. శివగారు వచ్చిన తర్వాత మిమ్మల్ని కలిపిస్తాం అన్నారు. ఆయన వచ్చాక నేను మాట్లాడాను. మాది స్క్రిప్ట్ వేరు, మీ కథ వేరు అన్నారు. మీది కాపీ చేయాల్సిన అవసరం మాకేం ఉంది? అన్నారు. మీరు తప్పు చేశారు అనడం లేదు. ఎందుకైనా మంచిది నా నవల పంపిస్తాను చదవండి అన్నాను. నవలను పంపిచాను. ఆ తర్వాత ఆయన దగ్గరి నుంచి సమాధానం రాలేదు.
రైటర్స్ అసోసియేషన్ ఏమీ తేల్చలేదు- శరత్ చంద్ర
కొరటాల శివ నుంచి సమాధానం రాకపోవడంతో రైటర్స్ అసోసియేషన్ దగ్గరికి వెళ్లినట్లు చెప్పారు శరత్ చంద్ర. “విషయాన్ని రైటర్స్ అసోసియేషనన్ జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్ ఆజాద్ గారి దృష్టికి తీసుకెళ్లాను. పరుచూరి గోపాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లమని చెప్పారు. నేను వెళ్లి ఆయనకు నవల ఇచ్చాను. చదివి కమిటీలో పెడతాను అన్నారు. ఒకరోజు నాకు చంద్రశేఖర్ ఆజాద్ నుంచి ఫోన్ వచ్చింది. శరత్ చంద్రగారు.. మీ నవలతో సినిమాకు పోలికలు ఉన్నాయని అసోసియేషన్ భావించింది. ఏమైనా కాంప్రమైజ్ అవుతావా? అని అడుగుతున్నారు అన్నారు. నేను వేరే వాళ్లకు కథ ఇచ్చాను కదా? వాళ్లు తీయాలి అనుకుంటే ఎలా? అని చెప్పి ఫోన్ పెట్టేశాను. మళ్లీ అరగంట తర్వాత కాల్ వచ్చింది. ఆకెళ్ల ఫోన్ చేశారు. రేపు 10 గంటలకు రమ్మన్నారు. నేను వెళ్లాను. ఈ సినిమాకు కొన్ని పోలికలు ఉన్నాయి. మీరు ఓకే అంటే రూ. 15 లక్షల వరకు సెటిల్ చేస్తాను అన్నారు. నేను వారి సినిమా కథ ఏదో చూపించమని అడిగాను. అక్కడ కథ లేదు. ఈ విషయాన్ని దాసరి నారాయణ రావు దగ్గరికి తీసుకెళ్లాను. వాళ్లు బేరం ఆడుతున్నారు సర్..అని చెప్పాను. ఈ కథ నీది అని తెలిశాక. క్షమాపణలు చెప్పాలి. నువ్వు ఎంత అడిగితే అంత ఇవ్వాలి అన్నారు. కొంత మంది మిత్రులతో కలిసి తమ్మారెడ్డి దగ్గరికి వెళ్లాను. ఆయన రెండు రోజుల తర్వాత కాల్ చేసి ఐదో, పదో ఇస్తాం అంటున్నారు. కాంప్రమైజ్ అయినట్టుగా ప్రెస్ మీట్ పెట్టమంటున్నారు అన్నారు. తప్పు చేశామని ఒప్పుకోమనండి. డబ్బులు కూడా అవసరం లేదు అన్నాను. కానీ, వాళ్లు పట్టించుకోలేదు” అని వెల్లడించారు.
రూ. 170 కోట్లు ఇచ్చినా కాంప్రమైజ్ కాను- శరత్ చంద్ర
రైటర్స్ అసోసియేషన్ లో ఏం తేలకపోవడంతో కోర్టుకు వెళ్లినట్లు శరత్ చంద్ర తెలిపారు. “విషయం తేలకపోవడంతో కోర్టులో కేసు వేశాను. ఎంబీ క్రియేషన్స్ మహేష్ బాబు, యెర్నేని నవీన్, కొరటాల శివ మీద కేసు వేశాను. రెండు మూడు వాయిదాలకు రాలేదు. అరెస్ట్ వారెంట్ వస్తుందని తెలియడంతో హైకోర్టుకు వెళ్లారు. మేమూ హైకోర్టుకు వెళ్లాం. ఆధారాలను పరిశీలించి మహేష్ బాబు, నవీన్, కొరటాల శివ క్రిమినల్ ప్రొసీజర్స్ ఎదుర్కోవాల్సిందేనని కోర్టు వెల్లడించింది. వాళ్లు సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా వారికి పనికాలేదు. ఇప్పుడు మళ్లీ కథ నాంపల్లి క్రిమినల్ కోర్టుకు వెళ్లింది. డబ్బులు ఇస్తే కాంప్రమైజ్ అవుతారా? అన్నారు. నేను రూ. 100 కోట్లు ఇచ్చినా కాంప్రమైజ్ కాను. సినిమాకు వచ్చిన రూ.170 కోట్లకు అదనంగా రూ. 100 కోట్లు ఇచ్చినా కాంప్రమైజ్ కాను. ఈ కేసుకు సంబంధించి సీబీఐ విచారణ జరపాలని కోరుతున్నాను. హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఫిర్యాదు చేస్తా. అట్రాసిటీ కేసు కూడా పెడతాను. నా కేసు తేలేవరకు ఈ కేసులోని వాళ్ల పాస్ పోర్టులను సీజ్ చేయాలని కోరుతున్నాను. వాళ్లను షూటింగ్ లలో పాల్గొనకుండా ఆపాలని కోరుతున్నాను. రైటర్స్ అసోసియేషన్ ఏనాడు నా విషయంలో జోక్యం చేసుకోలేదు. కనీసం వివాదాన్ని తేల్చే ప్రయత్నం చేయలేదు” అని శరత్ చంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: ఇది నాకు ఇష్టమైన వివాదం - అనసూయ