Sreeleela: శ్రీ లీల ఫ్లాపులకు 'జూనియర్' చెక్ పెడుతుందా? ఈ సక్సెస్ ఎందుకంత ఇంపార్టెంట్??
Junior Movie Release Date: జూలై 18న తెలుగు, కన్నడ భాషల్లో 'జూనియర్' విడుదల అవుతోంది. ఈ సినిమాతో శ్రీ లీల ఎలాగైనా సరే సక్సెస్ కొట్టాలని ఆమె ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇండస్ట్రీ కూడా కోరుకుంటోంది. ఎందుకంటే?

తెలుగు తెరపై తెలుగమ్మాయిలు తక్కువ అంటే... అందులోనూ స్టార్ హీరోయిన్ మెటీరియల్ అనిపించుకున్న అమ్మాయిలు మరీ తక్కువ. చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ... శ్రీ లీల (Sreeleela)కు స్టార్ హోదా వచ్చింది. అయితే... ఆ స్టేటస్ ఎంత స్పీడుగా వచ్చిందో... అంతే స్పీడుగా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ సినిమాలు ఆమె ఖాతాలో పడ్డాయి. దాంతో శ్రీ లీల స్టోరీ సెలక్షన్ మీద జోక్స్, ఆవిడ యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ మీద సెటైర్స్ పడ్డాయి. అందువల్ల, ఇప్పుడు 'జూనియర్' (Junior Movie)తో వరుస ఫ్లాపులకు చెక్ పెడుతుందా? లేదా? అనే క్వశ్చన్ రైజ్ అవుతోంది.
'జూనియర్' సక్సెస్ ఎందుకంత ఇంపార్టెంట్?
హీరోయిన్‌గా శ్రీ లీల లాస్ట్ సినిమా 'రాబిన్ హుడ్'. అది డిజాస్టర్. ఫ్లాప్ సంగతి పక్కన పెడితే... అందులో శ్రీ లీల యాక్టింగ్ మీద విమర్శలు వచ్చాయి. దానికి ముందు సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'గుంటూరు కారం' చేశారు. అందులో 'కుర్చీ మడతపెట్టి...' సాంగ్ చార్ట్ బస్టర్. మహేష్ బాబుతో పాటు శ్రీ లీల స్టెప్పులకు కూడా పేరు వచ్చింది. కానీ, కథానాయికగా ఆవిడకు మాత్రం మెరిట్ మార్క్స్ పడలేదు. ఇక ఆ సినిమాకు ముందు నితిన్ 'ఎక్సట్రా ఆర్డినరీ మ్యాన్', మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ' సినిమాలతో భారీ డిజాస్టర్లు చవి చూశారు.
కథానాయికగా శ్రీ లీలకు సరైన సక్సెస్ వచ్చి చాలా రోజులు అవుతోంది. మాస్ మహారాజా రవితేజ 'ధమాకా' తర్వాత ఆవిడకు సక్సెస్ కాలేదు. మధ్యలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ 'భగవంత్ కేసరి'తో హిట్ వచ్చింది. కానీ, ఆ సినిమాలో శ్రీ లీల రెగ్యులర్ హీరోయిన్ టైప్ రోల్ చేయలేదు. బాలయ్య హీరో అయితే శ్రీ లీల ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. అందువల్ల, ఆ విజయాన్ని ఆవిడ హీరోయిన్ కేటగిరీలో వేయలేం. 'జూనియర్'తో సక్సెస్ కొడితే తప్ప శ్రీ లీల కెరీర్ గాడిలో పడటం కష్టం. లేదంటే 'కుర్చీ మడతపెట్టి', 'వైరల్ వయ్యారి' వంటి పాటల్లో స్టెప్స్ గురించి తప్ప ఆవిడ నటన గురించి మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు.
చేతిలో ఉన్న స్టార్ హీరోల సినిమాలపై ఆశలు!
Sreeleela Upcoming Movies: ఒకవేళ 'జూనియర్' ఫ్లాప్ అయినా సరే శ్రీ లీలకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆవిడ చేతిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', మాస్ మహారాజా రవితేజ 'మాస్ జాతర', హిందీలో 'ఆషికి 3', తమిళంలో శివకార్తికేయన్ 'పరాశక్తి' సినిమాలు ఉన్నాయి. ఆయా సినిమాలు హిట్ అయితే మరో నాలుగైదు అవకాశాలు వస్తాయి. కానీ, ఆ విజయాల క్రెడిట్ ఎక్కువ భాగం హీరోలకు దక్కుతుంది. శ్రీ లీల కంట్రిబ్యూషన్ ఉన్నప్పటికీ... స్టార్ ఇమేజ్ మీద ఆడే సినిమాలు అవి. అందుకని, కొత్త హీరో కిరీటి 'జూనియర్'తో సక్సెస్ కొడితే శ్రీ లీల అభిమానులకు వచ్చే కిక్కే వేరప్పా.





















