Baahubali: బాహుబలి @ 10 - తెర వెనుక సమ్‌గతుల నుంచి రికార్డ్స్, అవార్డ్స్ వరకూ... ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసా?
Ten Years Of Baahubali: తెలుగు సినిమా ఊహలకు రెక్కలు తొడిగిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా 'బాహుబలి'. థియేటర్లలోకి వచ్చి నేటికి సరిగ్గా పదేళ్లు. ఈ సినిమా సమ్‌గతులు తెలుసుకోండి.

Baahubali Completes 10 Years, Know Interesting Facts, Budget And Collection Details: తెలుగు సినిమా ఊహలకు రెక్కలు తొడిగిన సినిమా 'బాహుబలి'. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు భరోసా ఇచ్చిన సినిమా 'బాహుబలి'. దీనికి ముందు దేశవ్యాప్తంగా విజయాలు సాధించిన సినిమాలు లేవని కాదు. అయితే దర్శక నిర్మాతలకు ఈ సినిమా ఇచ్చిన ధైర్యం వేరు. ఒక్క సినిమా... దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తీసిన ఈ ఒక్క సినిమా భారతీయ సినిమా ముఖ చిత్రాన్ని మార్చింది. ఇవాళ్టి పాన్ ఇండియా ట్రెండ్‌కు కారణమైంది. వెండితెరపై కొత్త ప్రపంచాలకు ప్రాణం పోసింది. ఆ 'బాహుబలి' థియేటర్లలోకి వచ్చి నేటికి సరిగ్గా పదేళ్లు. ఈ సందర్భంగా ఆ సినిమా సమ్‌గతులు తెలుసుకోండి.
'బాహుబలి'ని రెండు భాగాలుగా విడుదల చేయాలని అనుకోలేదు. ఒక్క సినిమాగా తీయాలని స్టార్ట్ చేశారు. ప్రతి పాత్ర, సన్నివేశం అద్భుతంగా వస్తుండటంతో ఒక్క సినిమాలో కథ అంతటినీ చెప్పలేమని రెండు భాగాలు చేశారు. ఇందులో మొదటి భాగం బడ్జెట్ ఆల్మోస్ట్ 200 కోట్లు. ఈ సినిమా వచ్చే సమయానికి ఇండియాలో హయ్యస్ట్ బడ్జెట్ సినిమా ఇదే. బాక్సాఫీస్ దగ్గర 650 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. 
'బాహుబలి' కోసం ప్రభాస్ ఐదేళ్లు కేటాయించారు. ''జీవితంలో ఇటువంటి అవకాశం ఒక్కసారే వస్తుంది. అప్పుడు వేరే వ్యాపకాలు ఏమీ పెట్టుకోకూడదు. రాజమౌళి ఈ కథ చెప్పినప్పుడు నా బెస్ట్ ఇవ్వాలని అనుకున్నా. ఎక్కువ రోజులు పడుతుందని అనుకున్నా'' అని ప్రభాస్ తెలిపారు. అయితే ఆయన కూడా ఐదేళ్లు పడుతుందని అనుకోలేదు. ఏది ఏమైనా ఒక స్టార్ హీరో అన్నేళ్లు మరో సినిమా చేయకుండా ఒక్క సినిమా కోసం ఉండటం గొప్ప విషయం. 'బాహుబలి' ఓకే చేశాక స్టార్ట్ కావడానికి రాజమౌళి టైమ్ తీసుకోవడంతో మధ్యలో 'మిర్చి' చేశారు. లేదంటే బాక్సాఫీస్ దగ్గర ఆయనకు ఎక్కువ గ్యాప్ వచ్చేది.
ప్రభాస్ ఐదేళ్ళు టైమ్ ఇవ్వడమే కాదు... 'బాహుబలి' కోసం బాడీని బిల్డ్ చేసిన తీరు మీద ఒక పుస్తకం రాయవచ్చు. బాహుబలి కోసం ప్రభాస్, భల్లాలదేవ కోసం రానా దగ్గుబాటి జిమ్‌లో చేసిన వర్కవుట్స్, ఫాలో అయిన డైట్ అటువంటిది. రోజుకు 40 కోడిగుడ్లు తినేవారు. ఇద్దరూ బాడీ పెంచారు. బాహుబలి కోసం 105 కిలోలు పెరిగిన ప్రభాస్, మళ్ళీ శివుడు క్యారెక్టర్ కోసం 85 కిలోలకు తగ్గారు. రానా 33 కిలోలు పెరిగారు. 'బాహుబలి' కోసం ప్రభాస్ తన ఇంటిలో జిమ్ ఏర్పాటు చేసుకున్నారు. అందుకు కోటిన్నర ఖర్చు అయ్యింది.

'బాహుబలి: ది బిగినింగ్'లో కాలకేయులతో యుద్ధం హైలైట్. ఆ వార్ సీక్వెన్స్ షూట్ చేయడానికి 250 రోజులు పట్టిందట. అందులో 5000 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. దానిని పీటర్ హెయిన్ డిజైన్ చేశారు. కిలికిలి భాష ఈ సినిమా కోసం రూపొందించారు. కాలకేయుల కోసం తమిళ లిరిసిస్ట్ మదన్ కర్కి చేత ప్రత్యేకంగా ఓ భాషను సృష్టించారు రాజమౌళి. దానికి గ్రామర్ రూల్స్ కూడా పెట్టారు. అందులో 800 పదాలు ఉన్నాయి. ఇండియన్ సినిమా హిస్టరీలో ఓ క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా భాష రూపొందించడం ఇదే తొలిసారి.

'బాహుబలి'లో మెజారిటీ పార్ట్ అంతా హైదరాబాద్ సిటీలోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేశారు. వార్ సీక్వెన్స్ కూడా అక్కడే తీశారు. మంచు కొండల్లో చరియలు విరిగిపడే సన్నివేశాన్ని బల్గెరియాలో షూట్ చేశారు. జలపాతాల సన్నివేశాన్ని కేరళలోని అతిరాపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర కొంత, సీజీలో మరికొంత షూట్ చేశారు. ఆ సీన్స్ చేసేటప్పుడు ప్రభాస్ గాయపడ్డారు. వాటర్ ఫాల్ సీక్వెన్స్ కోసం 110 రోజులు తీసుకున్నారు రాజమౌళి. 'బాహుబలి'లో భల్లాలదేవుడి విగ్రహం ఉంటుంది కదా! రామోజీ ఫిల్మ్ సిటీలో ఆ సన్నివేశం కోసం 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
వీఎఫ్ఎక్స్ పరంగా ఇండియన్ ఫిల్మ్ స్టాండర్స్ పెంచిన సినిమా 'బాహుబలి'. ఈ చిత్రానికి 15 కంపెనీలలోని 800 మంది వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు వర్క్ చేశారు. ఆ సీజీ వర్క్ బడ్జెట్ 85 కోట్లు.
రాజమౌళి సినిమా అంటే హీరో చేతిలో ఆయుధాలు ప్రత్యేకంగా ఉంటాయి. అయితే ఈ సినిమా కోసం మొత్తం 20000 ఆయుధాలు సృష్టించారు. హీరో ధరించే కవచం, ఉపయోగించే ఆయుధం నుంచి ప్రతి ఒక్కరి చేతిలో ఆయుధం ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ సృష్టే. ఆ ఆయుధాలను ప్రజలకు చూపించేందుకు ఒక మ్యూజియం ఏర్పాటు చేశారు. అది రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంది.
శివగామి పాత్ర కోసం మొదటి అతిలోక సుందరి శ్రీదేవిని సంప్రదించారు రాజమౌళి. అయితే ఆవిడ 'నో' చెప్పారు. శ్రీదేవి చేసిన డిమాండ్స్ నచ్చక రాజమౌళి వద్దని అనుకున్నారు. అయితే... రమ్యకృష్ణ నటన చూసిన తర్వాత శివగామిగా మరొకరిని ఊహించుకోవడం కష్టమే. కట్టప్ప పాత్రకు మొదట సంజయ్ దత్ అనుకోగా చివరకు సత్యరాజ్ చేశారు. భల్లాలదేవ కోసం రానా బదులు 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'లో ఖాలీ డ్రోగో క్యారెక్టర్ చేసిన అమెరికన్ యాక్టర్ జాసన్ అయితే బావుంటుందని రాజమౌళి అనుకున్నారు.
Also Read: పాన్ ఇండియా హిట్స్‌కు కేరాఫ్ అడ్రస్ శివశక్తి దత్తా... రాజమౌళి సినిమాల్లో ఆ సాంగ్స్ రాసింది ఆయనే

లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శించిన తొలి నాన్ ఇంగ్లీష్ సినిమా 'బాహుబలి'. విడుదలకు ముందు జూలై 1, 2015న కేరళలో 50,000 చదరపు అడుగుల పోస్టర్ ఏర్పాటు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. విడుదలైన తర్వాత సినిమా క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాలా?
లాస్ట్ బట్ నాట్ లీస్ట్... ఇండియన్ సినిమా హిస్టరీలో 'బాహుబలి' ఒక చరిత్ర. 63వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ సినిమాగా 'బాహుబలి' పురస్కారం అందుకుంది. ఆ ఘనత సాధించిన తొలి తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ అవార్డు అందుకుంది. నంది అవార్డుల్లో 14 సొంతం చేసుకుంది. పాన్ ఇండియా రిలీజ్ తర్వాత ఇంగ్లీష్, చైనీస్, థాయ్ వంటి విదేశీ భాషల్లోనూ సినిమాను విడుదల చేశారు. అయితే ఇంటర్నేషనల్ వెర్షన్ నిడివి ఓ 20 నిమిషాలు తగ్గించారు రాజమౌళి.





















