రాత్రి తాగి, పొద్దున్నే దేవుడిని అంటే ప్రజలు నమ్మరు - ప్రభాస్‌పై ‘కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు కామెంట్స్
ప్రభాస్ శ్రీరాముడిగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణం ఆధారంగా తెరకెక్కించిన 'ఆదిపురుష్' మూవీ ఫెయిల్యూర్ పై 'కశ్మీర్ ఫైల్స్' డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
'కశ్మీర్ ఫైల్స్' అనే సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తాజాగా ప్రభాస్ 'ఆదిపురుష్' ఫెయిల్యూర్ పై స్పందిస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ బాలీవుడ్ మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొన్న ఆయన 'ఆదిపురుష్' సినిమా విషయంలో ఎక్కడ తప్పు జరిగింది? అనే ప్రశ్నకు స్పందిస్తూ 'ఆదిపురుష్' మేకర్స్ తో పాటు యాక్టర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు కూడా నడుస్తున్నాయి కదా అని ఏమాత్రం నమ్మకం లేని సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే.. ఇలాంటి ఇబ్బందులు పడక తప్పదని ఆయన అన్నారు. పురాణ గాధలకు సంబంధించిన సినిమాలను చేయాలి అనుకున్నప్పుడు వాటిపై 100% పట్టు ఉండాలని, లేకపోతే గతంలో అలాంటి సినిమాలు తీసిన ప్రావీణ్యం ఉండాలని అన్నారు. కానీ మన భారత దేశంలో అలాంటి నియమాలను ఎవరు ఫాలో అవ్వడం లేదని వివేక్ అగ్నిహోత్రి చెప్పుకొచ్చారు.
అంతే కాకుండా "రామాయణం, మహాభారతం, భగవద్గీతలు ఎవరూ మనకు చెప్పకపోయినా మన మెదళ్ళలో ఎంతో కొంత ముద్రించిపోయి ఉండడానికి ఏదో ఒక బలమైన కారణం ఉందని అన్నారు. అలాగే ఈరోజు ఎవరు పడితే వారు తెరమీద కనబడి నేను దేవున్ని అని అనేస్తే సరిపోదు. రాత్రంతా తాగి పొద్దున్నే ఆన్ స్క్రీన్ మీదకు వచ్చి నేను దేవున్ని అంటే నమ్మే రోజులు పోయాయని, జనాలంతా మూర్ఖులు కాదని వివేక్ అగ్నిహోత్రి ప్రభాస్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కాగా వివేక్ అగ్నిహోత్రి ప్రత్యేకించి ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారో తెలియకపోయినా ఆయన చేసిన కామెంట్స్ 'ఆదిపురుష్' మేకర్స్ తో పాటు యాక్టర్స్ పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పొచ్చు. దీంతో 'ఆదిపురుష్' ఫెయిల్యూర్ పై వివేక్ అగ్నిహోత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
ఇక 'ఆదిపురుష్' విషయానికి వస్తే.. బాలీవుడ్ ఫిలిం మేకర్ ఓం రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా.. ప్రభాస్ శ్రీరాముడిగా కృతి సనన్ సీతగా కనిపించారు. అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్తనగే హనుమంతుడి పాత్రల్లో నటించారు. టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్లో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కలెక్షన్స్ బాగానే వచ్చినా, సినిమాపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ముఖ్యంగా రామాయణాన్ని వక్రీకరించి ఈ సినిమాని ఓం రౌత్ తీశారని, అలాగే సినిమాలో రావణుడి పాత్రను చూపించిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా పరాజయాన్ని అందుకుంది. మరోవైపు ఇదే రామాయణం ఆధారంగా మరో బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి ఓ సినిమా తీస్తున్నారు. ఈ ప్రాజెక్టులో రాముడిగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సీతగా ఆలియా భట్, రావణుడిగా 'కేజిఎఫ్' హీరో యశ్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2024 ఆరంభంలో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు సమాచారం.
Also Read: షారుక్ ఖాన్ కోసం ‘కెప్టెన్ అమెరికా’ స్టంట్ మాస్టర్ - హాలీవుడ్ రేంజ్‌లో ‘జవాన్’ స్టంట్స్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial