Viswak Sen : 'గామి' సినిమా కోసం జీరో రెమ్యునరేషన్, మైనస్ 30 డిగ్రీల్లో షూటింగ్ - ఆసక్తికర విషయాలు వెల్లడించిన విశ్వక్ సేన్
Viswak Sen : 'గామి' సినిమా కోసం తాను ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని తాజా ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ వెల్లడించారు.
Viswak Sen Latest Interview : టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకడైన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తన టాలెంట్ తో ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్నాడు. ముఖ్యంగా మాస్ అండ్ బోల్డ్ క్యారెక్టర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారుతూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మొన్నటివరకు కమర్షియల్, మాస్ రోల్స్ తో ఆకట్టుకున్న ఈ హీరో ఇప్పుడు రూటు మార్చి ప్రయోగాల బాట పట్టాడు. త్వరలోనే 'గామి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ఎవరు ఊహించని విధంగా అఘోరాగా కనిపించబోతున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్ ని బాగా ఇంప్రెస్ చేసి సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. దానికి తోడు ట్రైలర్లో అఘోరాగా విశ్వక్ సేన్ చాలా బాగా సూట్ అయ్యాడనే టాక్ కూడా వినిపించింది. అయితే ఈ సినిమాకి విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
'గామి' కోసం జీరో రెమ్యునరేషన్
'గామి' సినిమా మార్చ్ 8 న థియేటర్స్ లో సందడి చేయబోతోంది. రిలీజ్ టైం దగ్గర పడడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ జోరు పెంచింది. ఈ క్రమంలోనే విశ్వక్ సేన్ వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్నాడు. 'గామి' ప్రమోషన్స్ లో భాగంగా నిన్న రాత్రి CCL మ్యాచ్ చూసేందుకు వచ్చిన విశ్వక్ అక్కడ అక్కినేని అఖిల్ తో సందడి చేశారు. ఆ తర్వాత మూవీ టీం తో కలిసి పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఇదే ఇంటర్వ్యూలో భాగంగా 'గామి' సినిమాకోసం మీరు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతని యాంకర్ అడిగితే.. విశ్వక్ సేన్ 'జీరో రెమ్యునరేషన్' అని చెప్పాడు. గామి సినిమా కోసం తాను ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
చాలా పెద్ద కాన్వాస్ లో రాసుకున్న కథ
" నా ఫస్ట్ మూవీ వెళ్ళిపోమాకే చూసి డైరెక్టర్ విద్యాధర్ నా దగ్గరికి వచ్చాడు. ‘ఈ నగరానికి ఏమైయింది’ సినిమా రిలీజ్ కాకముందు ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. డైరెక్టర్ ఈ కథను చాలా పెద్ద కాన్వాస్ లో రాసుకున్నాడు. ఒకవేళ ఏడాదిలో తీయాలనుకుంటే దానికి వందకోట్లకి పైగా బడ్జెట్ అవుతుంది. ఈ సినిమాకి సమయమే పెద్ద పెట్టుబడి. ఈ తరహాలో ఇప్పటివరకూ ఏ సినిమా రాలేదు. ఎప్పుడు వచ్చినా ఇంతే అద్భుతమైన క్యాలిటీతో రావాలని ముందే అనుకున్నాం. ఇప్పుడు సరైన సమయంలోనే వస్తున్నాం" అని తెలిపాడు.
మైనస్ 30 డిగ్రీల్లో షూటింగ్
" ఈ సినిమాకి సంబంధించి లుక్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. పదిహేను రోజులకు ముందే షూటింగ్ గురించి తెలిసాక మెల్లగా ఆ లుక్ లోకి రావడానికి ప్రిపేర్ అయ్యేవాడిని. అఘోర పాత్ర కోసం దర్శకుడు కావాల్సిన రీసెర్చ్ ఇచ్చారు. కుంభమేళాలో లక్షల మంది అఘోరాలు ఉంటారు. వాళ్లలో కలసిపోయి కొన్ని రోజులు ఉన్నాను. నా స్టైల్ లో ఎక్స్ ఫ్లోర్ చేసుకుంటూ వెళ్లాను. నిజంగా నేను అఘోరా అనుకోని చాలా మంది దానాలు కూడా చేశారు. ఈ సినిమా ప్రతి రోజు ఒక సవాలే. మైనస్ 30 డిగ్రీల్లో షూట్ చేశాం" అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read : 180 రోజులు, 26 శనివారాలు- నాని మూవీ అప్ డేట్ అదిరింది బాసూ!