Vishal: రాజకీయాల్లోకి విశాల్... విజయ్ పార్టీకి పోటీగా నడిగర్ నాయకన్?
Vishal into politics: తమిళ స్టార్ హీరో విజయ్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఈ మధ్య ప్రకటించారు. మరో హీరో విశాల్ సైతం రాజకీయాల్లోకి రానున్నట్లు కోలీవుడ్ ఖబర్.
తమిళ రాజకీయాల్లోకి అగ్ర కథానాయకుడు, దళపతి విజయ్ రాక ఖరారైంది. తాను రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. 'తమిళగ వెట్రి కళగం' తన పార్టీ పేరు అని వెల్లడించారు. ప్రస్తుతం తమిళనాడులో అవినీతి పాలన ఉందని, దానికి వ్యతిరేకంగా పోరాడేందుకు రాజకీయాల్లోకి వచ్చానని, తమ పార్టీ సొంతంగా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని, ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వదని విజయ్ స్పష్టం చేశారు. ఇప్పుడు మరొక హీరో విశాల్ కూడా రాజకీయాల్లోకి రావడానికి రెడీ అవుతున్నట్లు కోలీవుడ్ ఖబర్.
రాజకీయాల్లోకి నడిగర్ నాయకన్?
రాజకీయాలు విశాల్ (Vishal Politics)కు కొత్త కాదు. నటీనటుల కోసం ఏర్పాటైన నడిగర్ సంఘం ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. ఆయన ప్యానల్ ఘన విజయం సాధించింది. ప్రత్యక్ష రాజకీయాలు సైతం ఆయనకు కొత్త కాదు. తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీ అయ్యారు. ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ కూడా వేశారు. అయితే... అప్పట్లో ఎలక్షన్ కమిషన్ ఆయన నామినేషన్ తిరస్కరించింది. అది చర్చనీయాంశం కూడా అయ్యింది.
విజయ్ రాజకీయాల్లోకి రావడంతో విశాల్ సైతం వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తన రాజకీయ అరంగేట్రం ప్లాన్ చేస్తున్నారట. కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఆయన ఉన్నారట. దాంతో దళపతి విజయ్ పార్టీకి పోటీగా రాజకీయాల్లోకి విశాల్ వస్తున్నారా? అని తమిళ సినిమా ఇండస్ట్రీలో చర్చ మొదలైందని తెలుస్తోంది.
Also Read: సాయి రాజేష్... సందీప్ రెడ్డి వంగా... 'బేబీ' హిందీ రీమేక్... కాన్ఫిడెంట్‌గా ఎస్కేఎన్!
తమిళ హీరోలు రాజకీయాల్లోకి రావడం కొత్త కాదు. సినిమాల్లో అగ్ర కథానాయకుడిగా కొన్నేళ్ల పాటు స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేసిన ఎంజీఆర్... తర్వాత 'ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం' పార్టీ స్థాపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. ఒక్కప్పటి కథానాయిక జయలలిత సైతం ముఖ్యమంత్రి అయ్యారు. కరుణానిధికి సైతం సినిమా నేపథ్యం ఉంది.
ఎంజీఆర్ తర్వాత తరంలో సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన తమిళ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు బలంగా కోరుకున్నారు. కానీ, ఆయన వెనకడుగు వేశారు. లోక నాయకుడు కమల్ హాసన్ మాత్రం ధైర్యంగా ముందడుగు వేశారు. రాజకీయ పార్టీ స్థాపించారు. కానీ, అధికారంలోకి మాత్రం రాలేకపోయారు. ఇటీవల కన్ను మూసిన విజయకాంత్ సైతం రాజకీయాల్లోకి ప్రభావం చూపించారు. అధికారంలోకి రాలేదు కానీ తన పార్టీని ఇతర పార్టీల్లో విలీనం చేయకుండా చివరి వరకు ధైర్యంగా నిలబడ్డారు.
Also Read: ప్రేక్షకులకు అందుబాటులో 'ఈగల్'... మాసోడి సినిమాకు తెలంగాణ, ఏపీలో టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
రజనీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్ వంటి హీరోలతో పోలిస్తే తమిళ యువతీ యువకుల్లో విజయ్ కంటూ బలమైన అభిమానగణం ఉంది. అయితే... వాళ్లలో ఎంత మంది ఓటు వేస్తారు? అనేది చూడాలి. ఎంజీఆర్ కాలం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. జయలలిత, కరుణానిధి వంటి బలమైన రాజకీయ ప్రత్యర్థులు కూడా లేరు. ముఖ్యమంత్రి స్టాలిన్, ఇతర రాజకీయ నాయకులకు విజయ్ ఎటువంటి పోటీ ఇస్తారో చూడాలి.
Also Read: కొత్తగా రవితేజతో 'ఈగల్'లో రొమాన్స్, సీన్స్... కావ్య థాపర్ ఇంటర్వ్యూ