Vimanam Teaser : అన్నీ ఇచ్చేవాడిని దేవుడు కాదు, నాన్న అంటారు - ఈ బుడ్డోడిని మర్చిపోలేం!
Samuthirakani's Vimanam Movie Teaser Review : సముద్రఖని ఓ ప్రధాన పాత్రలో నటించిన 'విమానం' సినిమా టీజర్ వరుణ్ తేజ్ విడుదల చేశారు.
సముద్రఖని, మాస్టర్ ధ్రువన్, అనసూయ, రాహుల్ రామకృష్ణ, ధన్‌రాజ్, మీరా జాస్మిన్, తమిళ నటుడు మొట్ట రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'విమానం' (Vimanam Movie). తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించారు. జూన్ 9న థియేటర్లలో విడుదల కానుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. అది ఎలా ఉందంటే?
చిన్నారి అమాయకత్వం...
అంతకు మించి నిజాయతీ!
'విమానం'లో సముద్రఖని, మాస్టర్ ధ్రువన్ తండ్రీ కుమారులుగా నటించారు. ఆ ఇద్దరి ప్రయాణమే చిత్ర కథాంశమని టీజర్ చూస్తే తెలుస్తోంది. అన్నిటి కంటే ముఖ్యంగా తండ్రీ కుమారుల మధ్య సంభాషణలు, కుమారుడి మాటల్లో ఏమీ తెలియని అమాయకత్వం, స్వచ్ఛత ఎక్కువగా ఆకట్టుకుంటాయి (Vimanam Teaser Review).
'నాన్నా... అమ్మ దేవుడి దగ్గరకు వెళ్లిందని చెప్పావ్ కదా! విమానం ఎక్కి దేవుడి దగ్గరకు వెళ్ళిందా?' అని కుమారుడు అడిగితే... 'అవును రా' అని తండ్రి చెబుతాడు. వెంటనే మరో ఆలోచన కూడా లేకుండా 'అమ్మ ఎంత గ్రేట్ నాన్నా' అని కుమారుడు అంటాడు. తండ్రి మాటలను అంతలా నమ్మేసే అమాయకత్వం ఆ చిన్నారిది. అప్పటి నుంచి విమానం ఎక్కించమని తండ్రిని అడుగుతూ ఉంటాడు. 'బాగా చదువుకుని, పెద్దోడు అయ్యాక నువ్వే ఎక్కొచ్చు' అని తండ్రి చెబుతూ ఉంటాడు.
విమానం గురించి పిల్లల మధ్య సంభాషణలు సైతం భలే ఉన్నాయి. 'బస్సు నడిపే వాడిని డ్రైవర్ అంటాడు. లారీ నడిపే వాడినీ డ్రైవర్ అంటారు. మరి, విమానం నడిపే వాడిని ఎందుకురా పైలట్ అంటారు?' అని ధ్రువన్ అడిగితే... 'పైకి వెళ్ళాక లైట్ వేసుకుంటాడు కాబట్టి పైలట్ అంటార్రా' అని ఫ్రెండ్ ఆన్సర్ ఇస్తారు.
'నాన్నా! దేవుడు ఎప్పుడు కనిపించినా దణ్ణం పెట్టుకోమంటావ్ ఏంటి నాన్నా' అని కుమారుడు అడిగితే... 'అడిగినవన్నీ ఇస్తాడు కాబట్టి' అని చెబుతాడు తండ్రి! ఆ తర్వాత కుమారుడు 'అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు, నాన్నా అంటారు' అని చెప్పే మాట హృదయాలు కదిలిస్తుంది చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
నటుడిగా సముద్రఖని ప్రతిభ గురించి తెలిసిందే. అనసూయ, రాహుల్ రామకృష్ణ, ధన్ రాజ్ సైతం ప్రూవ్ చేసుకున్నారు. వీళ్ళందరి మధ్య 'విమానం'లో బుడ్డోడి పాత్రలో నటించిన మాస్టర్ ధ్రువన్ కొన్నాళ్లు గుర్తుండిపోతాడని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఈ సినిమాలో తొలి పాట 'రేలా రేలా...'ను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. మంగ్లీ పాడిన ఆ పాటకు మంచి స్పందన లభిస్తోంది.
Also Read : పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ బైక్స్ & కారుకు సేమ్ నంబర్, సమంత కారుకూ... హరీష్ శంకర్ 2425 సెంటిమెంట్!
జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో 'విమానం'
జూన్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ సంస్థలు నిర్మించిన చిత్రమిది. దీనికి శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కళ : జె.జె. మూర్తి, కూర్పు : మార్తాండ్ కె. వెంకటేష్, మాటలు : హను రావూరి (తెలుగు), ప్రభాకర్ (తమిళం), పాటలు : స్నేహన్ (తమిళ్), చరణ్ అర్జున్ (తెలుగు), ఛాయాగ్రహణం : వివేక్ కాలేపు, సంగీతం : చరణ్ అర్జున్.
Also Read : వెంకీతో దుల్కర్ సల్మాన్ - అక్టోబర్‌లో సెట్స్‌కు, సమ్మర్‌లో థియేటర్లకు!