Love Guru trailer - విజయ్ ఆంటోని ‘లవ్ గురు’ ట్రైలర్: పెళ్లాన్ని వన్‌సైడ్ లవ్ చేసే భర్త - పాపం, ఎన్ని పాట్లో!
Vijay Antony: విజయ్ ఆంటోని, మృణాళిని రవి జంటగా నటించిన ‘లవ్ గురు’ మూవీ ట్రైలర్ విడుదలైంది. మీరూ ఓ లుక్ వేయండి.
Love Guru trailer : విభిన్నమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ హీరో.. విజయ్ ఆంటోని. అయితే, ఇటీవల ఆయన నటించిన సినిమాలేవీ మంచి టాక్ తెచ్చుకోలేదు. దీంతో ఓ కామెడీ మూవీతో తన లక్ పరీక్షించుకోడానికి వస్తున్నాడు. అదే ‘లవ్ గురు’. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ ఎలా ఉందంటే? (Love Guru Movie trailer review): మృణాళిని, విజయ్ ఆంటోనీల పెళ్లి చూపులతో ఈ మూవీ ట్రైలర్ మొదలైంది. కుటుంబికులకు, ఊరి ప్రజలకు వారి పెళ్లికి ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతారు. అయితే, మృణాళిని మాత్రం తనకు అభ్యంతరం ఉందని, తనతో మాట్లాడాలని చెబుతుంది. అయితే, తనకు ఇష్టం లేకుండానే ఈ పెళ్లికి ఒప్పకున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. తనని పెళ్లి చేసుకోవాలంటే తన కండిషన్స్‌కు అంగీకరించాలని మృణాళిని షరతులు పెడుతుంది. ఇందుకు విజయ్ అంగీకరిస్తాడు. ఆ తర్వాత వారి పెళ్లి జరుగుతుంది. భార్యకు తాను ఇష్టం లేకపోయినా.. వన్ సైడ్ లవ్ చేస్తానని అంటాడు విజయ్. ఆమెను ఇంప్రెస్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ, ఆమె మాత్రం.. విజయ్‌ను ఇష్టపడదు. దీంతో తన భార్యను మచ్చిక చేసుకోవడం ఎలా అని తన స్నేహితులు, సన్నిహితుల నుంచి సలహాలు తీసుకుంటాడు. మరి, తన ప్రయత్నాలు ఫలిస్తాయా? భర్త ప్రేమను ఆమె అర్థం చేసుకుంటుందా? అనేది వెండి తెరపైనే చూడాలి.
విజయ్ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో లవ్, రొమాంటిక్, కామెడీ మూవీస్ చేయలేదు. అందుకే, ఈ మూవీలో కాస్త కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ మూవీ ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. విజయ్ పూర్తిగా తన బాడీ లాంగ్వేజ్‌కు భిన్నమైన కథను ఎంచుకున్నాడు. భార్య ప్రేమ కోసం పరితపించే భర్త పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఇక హీరోయిన్ మృణాళిని కూడా ఆ పాత్రకు సరిపోయింది. ‘‘ఎవడ్రా వీడు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నాడు’’ డైలాగ్‌తో సోషల్ మీడియాలో వైరల్ అయిన వీటీవీ గణేష్ కూడా ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
విజయ్ ఆంటోనీ నటుడు మాత్రమే కాదు. ఇప్పటికే అతడు డైరెక్టర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా తన టాలెంట్ చూపించాడు. ‘బిచ్చగాడు’ మూవీ నుంచి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. దీంతో ‘బిచ్చగాడు 2’ కూడా మంచి విజయం సాధించింది. అయితే, ఇప్పటివరకు యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్స్‌లో మాత్రమే నటించాడు. ‘లవ్ గురు’ (తమిళంలో ‘రోమియో’) మూవీతో రొమాంటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మూవీకి వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. మృణాళిని రవి ఇటీవలే ‘మామ మశ్చింద్ర’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే, ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆమె కెరీర్ ముందుకు సాగాలంటే ‘లవ్ గురు’ మూవీ హిట్ కొట్టడం చాలా ముఖ్యం.
Also Read: ‘కల్కి 2898 AD’లో నా క్యారెక్టర్ అదే, ఇండియన్ 2 మాత్రమే 3 కూడా పూర్తయ్యింది - కమల్ హాసన్