Sarojadevi: ఇండస్ట్రీలో మరో విషాదం - సీనియర్ నటి సరోజాదేవి కన్నుమూత... ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజాలతో మూవీస్
B Sarjojadevi: ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటి సరోజా దేవి సోమవారం ఉదయం కన్నుమూశారు. బెంగుళూరులోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు.

Senior Actress B Sarojadevi Passed Away: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటి బి.సరోజాదేవి (87) బెంగుళూరులోని తన నివాసంలో సోమవారం ఉదయం కన్నుమూశారు. ఈమె ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో మూవీస్ చేశారు.
తెలుగులో ఇంటికి దీపం ఇల్లాలు, దాగుడు మూతలు, మంచి చెడు, దానవీర శూరకర్ణ, పండంటి కాపురం వంటి మూవీస్ హిట్ అందుకున్నాయి. 200కు పైగా సినిమాల్లో నటించి అందాల నటిగా మంచి పేరు సంపాదించుకున్నారు సరోజా దేవి. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు.
Also Read: షూటింగ్ సెట్స్‌లో ఊహించని యాక్సిడెంట్ - స్టంట్ మ్యాన్ మృతి... షాకింగ్ వీడియో
17 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి...
1938 జనవరి 7న కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి కళపై ఇష్టంతో తన 17 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 1955లో 'మహాకవి కాళిదాస' అనే కన్నడ సినిమాతో తెరంగేట్రం చేశారు. 1957లో 'పాండురంగ మహత్య్యం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'భూకైలాస్' మంచి గుర్తింపు ఇచ్చింది. 1959లో 'పెళ్లిసందడి', 1961లో సీతారామ కల్యాణం, జగదేకవీరుని కథ, 1963లో శ్రీకృష్ణార్జున యుద్ధం, 1964లో దాగుడు మూతలు, ఆత్మబలం, 1966లో శకుంతల, 1978లో 'దానవీర శూర కర్ణ', 1991లో అల్లుడు దిద్దిన కాపురం, ఉమా చండీ గౌరీ శంకరుల కథ, పండంటి కాపురం, సీతారామ వనవాసం వంటి తెలుగు సినిమాల్లో నటించి పాపులారిటీ సంపాదించుకున్నారు.
200కు పైగా సినిమాలు...
తన సినీ కెరీర్‌లో దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు సరోజాదేవి. 'అభినయ సరస్వతి'గా పేరొందారు. 1955 నుంచి 1984 మధ్య 29 ఏళ్లు వరుసగా 161 సినిమాల్లో లీడ్ రోల్స్‌లో నటించిన ఏకైక నటిగా రికార్డు సృష్టించారు.
అవార్డులు
సినీ రంగానికి సరోజాదేవి చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. అలాగే, కలైమామణి పురస్కారం సైతం దక్కింది. బెంగుళూరు వర్శిటీ నుంచి కూడా గౌరవ డాక్టరేట్ పొందారు. ఆమె నటించిన 'కిట్టూరు రాణి చెన్నమ్మ' దేశభక్తి భావనను ప్రతిబింబించే చిత్రంగా గుర్తింపు పొందింది.
సరోజాదేవి తండ్రి బైరప్ప, తల్లి రుద్రమ్మ. తండ్రి పోలీస్ శాఖలో ఉద్యోగి కాగా... తల్లి గృహిణి. 1967లో శ్రీహర్ష అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయన 1986లో మరణించారు. ఆమె ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వారికి రామచంద్రన్, ఇందిరా అనే పేర్లు పెట్టి బాధ్యతగా చూసుకున్నారు. సరోజాదేవి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.






















