Baby Movie Re-Release: మళ్లీ వస్తున్న ‘బేబీ’ - ప్రేమికుల రోజే టార్గెట్!
Valentine’s Day Special: 2023లో కుర్రకారును ఉర్రూతలూగించిన సినిమా 'బేబి'. ఇక ఇప్పుడు మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. వాలంటైన్స్ డే స్పెషల్ గా ఈ సినిమాని రీ రిలీజ్ చేయనున్నారు.
Valentine’s Day Special Blockbuster Baby Re Release: రి రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. వాలంటైన్స్ డేకి సూపర్ హిట్ ప్రేమకథలను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇక ఇప్పుడు 2023 జులైలో రిలీజైన సినిమా 'బేబి' కూడా ఆ జాబితాలో చేరిపోయింది. యూత్ ని తెగ ఆకట్టుకుంది ఈ సినిమా. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విజయ్ అశ్విన్ నటించిన ఈ సినిమాని సాయి రాజేశ్ డైరెక్ట్ చేశారు. ఈ జనరేషన్ కి కనెక్ట అయ్యే లవ్ స్టోరీ కావడంతో.. థియేటర్లు దద్దరిల్లాయి. అందుకే మరోసారి ఆ క్రేజ్‌ను వాడుకొనేందుకు ప్రేమికుల రోజును టార్గెట్ చేసుకున్నారు నిర్మాతలు.
వాలంటైన్స్ డే స్పెషల్..
ఫిబ్రవరి 14.. ప్రేమికులకు స్పెషల్ డే. ఇక ఆ స్పెషల్ డే రోజునే బేబి సినిమాని రీ రిలీజ్ చేయనున్నారు. లవ్ స్టోరీ కావడంతో, యూత్ ని ఎక్కువగా ఆకట్టుకున్న సినిమా కావడంతో లవర్స్ డే రోజున ఈ సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. స్కూల్ డేస్ నుంచి వైష్ణవి (వైష్ణవి చైతన్య), ఆనంద్ (ఆనంద్ దేవరకొండ) ఇద్దరు ప్రేమలో ఉంటారు. బాగా చదువుకుని వైష్ణవి బీటెక్‌లో చేరుతుంది. ఆనంద్ మాత్రం చదువు మానేసి ఆటో డ్రైవర్ గా మారతాడు. కాలేజీలో విరాజ్ (విరాజ్ అశ్విన్) తో ప్రేమాయణం నడుపుతుంది వైష్ణవి. అటు ఆనంద్, ఇటు విరాజ్ దగ్గర ఒకరి గురించి ఒకరికి చెప్పదు. దాని వల్ల వైష్ణవి పడ్డ ఇబ్బందులు, చివరికి వైష్ణవి ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అనేదే 'బేబీ' స్టోరీ.
అప్పటి వరకు షార్ట్ ఫిలిమ్స్ లో చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య.. ఈ సినిమాతోనే టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె క్యారెక్టర్ కి మంచి ప్రశంసలు వచ్చాయి. వైష్ణవి నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఈ సినిమాతోనే ఆనంద్ దేవరకొండ కెరీర్‌లో ఫస్ట్ కమర్షియల్ హిట్ నమోదైంది. ఇందులో విరాజ్ అశ్విన్ మరో హీరోగా నటించాడు. ఆయనకు కూడా మంచి పేరు వచ్చింది. సాయి రాజేశ్ డైరెక్షన్ చేసిన ఈ సినిమాని SKN నిర్మించారు.
భారీ కలెక్షన్లు..
యువత మనోభావాలను అద్ధం పడుతూ న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా.. అప్పట్లో భారీ కలెక్షన్లను సాధించింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా దాదాపు రూ.80 కోట్లు కలెక్ట్ చేసింది. నిర్మాతకు దగ్గర దగ్గర రూ.37 కోట్లు లాభం తెచ్చిపెట్టింది. గత ఏడాది టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన టాప్ టెన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది 'బేబి'.
వివాదంలో 'బేబి'..
ఈ సినిమా ఇటీవలే వివాదంలో చిక్కకుంది. 'బేబి' సినిమా కథ తనదంటూ షార్ట్ ఫిలిమ్స్ డైరెక్టర్ శిరిన్ శ్రీరామ్ కేసు నమోదు చేశారు. ఈ మేరకు రాయదుర్గం పోలీసులు దర్శక, నిర్మాతలపై కేసు పెట్టారు. 2013లో 'బేబి' సినిమా డైరెక్టర్ రాజేశ్ ని కలిసి కథ చెప్పానని ఆరోపిస్తున్నాడు. తన కథనే 'బేబి' సినిమాగా తీశాడని, కాపిరైట్స్ చట్టాన్ని ఉల్లంఘించాడని కేసు పెట్టాడు శిరిన్. 2013లో తన సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పని చేయమని రాజేశ్ తనని కోరాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. 2015లో తాను ‘కన్నా ప్లీజ్’ పేరుతో కథ రాసుకుని, ‘ప్రేమించొద్దు అనే టైటిల్ పెట్టుకున్నానని, దాన్ని రాజేశ్ కాపీ కొట్టి సినిమా తీశాడని శిరిన్ ఆరోపించాడు.
Also Read: ఢీ' షోలో ఏడ్చేసిన నందు - చేయని తప్పుకు బలిచేశారని ఎమోషనల్