Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం - యూకే లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రకటన
UK Lifetime Achievement Award: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. సినీ పరిశ్రమలో ఆయన చేస్తోన్న సేవలకు గానూ యూకే ప్రభుత్వం ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందించనుంది.

UK Government Announces Lifetime Achievement Award To Megastar Chiranjeevi: ప్రముఖ నటుడు చిరంజీవికి (Chiranjeevi) మరో గౌరవం దక్కింది. యూకే ప్రభుత్వం ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రకటించింది. సినీ రంగంలో 4 దశాబ్దాలుగా ఆయన అందిస్తోన్న విశేష సేవలను యూకే పార్లమెంట్ గుర్తించింది. ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించాలని నిర్ణయించింది. ఆ దేశ పార్లమెంట్‌లో ఈ నెల 19న చిరంజీవికి అవార్డు అందజేయనుంది. ఈ క్రమంలో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
40 ఏళ్ల ప్రస్థానం.. విశేష పురస్కారాలు
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు వింటనే ప్రతీ తెలుగు సినీ అభిమాని గుండె పులకరిస్తుంది. 40 ఏళ్లుగా సినీ కళామతల్లి సేవలో నిమగ్నమవుతూ.. అటు ఇండస్ట్రీలోనూ ఇటు సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర వేసి అరుదైన పురస్కారాలు, మరెన్నో సత్కారాలతో తనకంటూ సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. యువ నటులకు ఆయన ఓ రోల్ మోడల్. అభిమానులకు చిరంజీవి ఓ గాడ్. ఆరు పదుల వయసులోనూ తనదైన డ్యాన్స్, నటనతో ఇప్పటి యంగ్ హీరోలకు ధీటుగా పోటీ ఇస్తున్నారు.
1979లో విడుదలైన 'పునాదిరాళ్లు' సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ప్రారంభంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. అన్నింటినీ తట్టుకుని నిలబడి వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. తన డ్యాన్స్, నటనతో యూత్‌ను ఆకట్టుకున్నారు. ఎన్నో గుర్తుండిపోయే చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేశారు.
మెగాస్టార్ కెరీర్‌లో ఎన్నో అవార్డులు
సినీ రంగంలో చేసిన విశేష సేవలకు మెగాస్టార్ చిరంజీవి ఎన్నో విశేషమైన, ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. 9 ఫిలింఫేర్, 3 నంది అవార్డులు వరించాయి. వీటితో పాటే కేంద్ర ప్రభుత్వం 2006లో పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ అవార్డులను అందించి గౌరవించింది. ఇటీవలే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ ఆయనకు చోటు దక్కింది. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఈ రికార్డు దక్కింది.
ఇటు నటుడిగానే కాకుండా అటు సేవా కార్యక్రమాల్లోనూ చిరంజీవి తనదైన ముద్ర వేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ నిర్వహించడం సహా ఎన్నో సామాజిక కార్యక్రమాలతో రియల్ హీరోగా మారారు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ వారికి సాయం చేస్తుంటారు. ఆయన చేసిన సాయాన్ని చెప్పుకోకపోయినా ఆయన నుంచి సాయం పొందిన వారు ఈ విషయాలను పలు ఇంటర్వ్యూల్లో షేర్ చేసుకంటూ మెగాస్టార్‌ను దేవుడితో పోలుస్తుంటారు. అభిమానులకు సైతం చిరంజీవి అండగా నిలుస్తుంటారు. ఆయన తరఫున ఫ్యాన్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు. ఆపదలో ఉన్న వారికి సాయం అందిస్తూ ఆయనపై తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు.
మెగాస్టార్ లేటెస్ట్ ప్రాజెక్ట్స్ ఇవే..
ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ ప్రస్తుతం వశిష్ట మల్లిడి డైరెక్షన్‌లో 'విశ్వంభర'లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన సరసన త్రిష, ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ మూవీ నిర్మిస్తుండగా.. వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే, దసరా ఫేం 'శ్రీకాంత్ ఓదెల' డైరెక్షన్‌లో ఓ కొత్త ప్రాజెక్టుకు ఓకే చెప్పారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

