Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!
స్పైడర్ మ్యాన్ నటుడు టామ్ హాలండ్ ‘ఆర్ఆర్ఆర్‘ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల చూసిని సినిమాల్లో ‘ఆర్ఆర్ఆర్‘ తనకు చాలా బాగా నచ్చిందని చెప్పారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్‘. ఈ చిత్రం భారత్ తో పాటు ఇతర దేశాల్లోనూ సంచలన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుతో పాటు ఎన్నో అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ లిస్టులో ‘స్పైడర్ మ్యాన్’ నటుడు టామ్ హాలండ్ కూడా చేరారు. ఈ సినిమా తనకు ఎంతో బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు.
‘ఆర్ఆర్ఆర్‘ సినిమా ఎంతో నచ్చింది!
గత కొద్ది రోజుల క్రితం ముంబైలో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభం అయ్యింది. ఈ వేడుకలో ‘స్పైడర్ మ్యాన్’ నటులు టామ్ హాలండ్, జెండయా పాల్గొన్నారు. మూడు రోజుల పాటు ముంబైలోనే ఉన్నారు. ఈ జంటను ముఖేష్ అంబానీ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. తాజాగా తన భారత పర్యటన గురించి టామ్ ప్రస్తావించారు. "నా ఇండియా పర్యటన అద్భుతంగా సాగింది. ఇది నా జీవిత కాలం మర్చిపోలేని పర్యటన. అద్భుమైన భారతదేశానికి మళ్లీ మళ్లీ రావాలని భావిస్తున్నాను. నా మూడు రోజుల పర్యటనను ఎంతో సంతోషంగా గడిపాను. ఎంతో మంది అద్భుతమైన వ్యక్తులను కలిశాను. ఎంతో రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించాను. అద్భుతమైన అంబానీ కల్చరల్ సెంటర్‌ను చూడగలిగాము. మొత్తంగా భారత్ లో చాలా అద్భుతంగా పర్యటన కొనసాగించాం” అని చెప్పుకొచ్చారు. ఇటీవల ఏదైనా సినిమాను చూశారా? అనే ప్రశ్నకు టామ్ చూశానని చెప్పారు. “ఈ మధ్య కాలంలో ‘ఆర్ఆర్ఆర్‘ సినిమా చూశాను. ఈ సినిమా నాకు ఎంతో బాగా నచ్చింది” అని వెల్లడించారు.
ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ‘స్పైడర్ మ్యాన్’ తదుపరి భాగం
వాస్తవానికి టామ్, జెండయా భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ తో పాటు పలువురు ఇండియన్ స్టార్స్ తో కలిసి వారు ఫోటోలు తీసుకున్నారు. కొద్ది రోజుల పాటు ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇక ఈ ఇద్దరు నటీనటులు ‘స్పైడర్ మ్యాన్’ సినిమాలో కనిపించి మెప్పించారు. ‘హోమ్‌కమింగ్’(2017), ‘ఫార్ ఫ్రమ్ హోమ్’(2019), ‘నో వే హోమ్’ (2021) అనే సినిమాల్లోనూ సందడి చేశారు. హాలండ్ Apple TV+ ఆంథాలజీ సిరీస్ ‘ది క్రౌడెడ్ రూమ్’లో కనిపించనున్నారు. అటు జెండయా ‘డూన్: పార్ట్ టూ’, లూకా గ్వాడాగ్నినో ‘ఛాలెంజర్స్’ లో నటిస్తున్నారు. ‘స్పైడర్‌మ్యాన్’ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న టామ్, తదుపరి భాగం ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉందని తెలిపారు. అయితే, రైటర్ సమ్మె కారణంగా ప్రస్తుతం ఆ సినిమా పని నిలిచిపోయినట్లు వెల్లడించారు.
Also Read : కష్టం కలిగినా అబ్బాయికి విడాకుల గురించి చెప్పక తప్పలేదు- ఆశిష్ విద్యార్థి
అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ లాంటి ఇద్దరు విప్లవ వీరుల స్పూర్తితో అల్లుకున్న కల్పిత కథతో RRR చిత్రాన్ని తెరకెక్కించారు రాజమౌళి. భీమ్ గా తారక్, రామరాజుగా చరణ్ నటించారు. అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరీస్, శ్రియా సరన్, సముద్రఖని తదితరులు ఇతర పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మాత దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఈ సినిమాలో చంద్రబోస్ రాసిన 'నాటు నాటు' పాట ఆస్కార్ అవార్డు దక్కించుకుంది.
Also Read : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్