Tollywood: పెద్ద, చిన్న నిర్మాతల్లో విబేధాలు... రెండు వర్గాలుగా చీలిన టాలీవుడ్... సమ్మెలో కొత్త మలుపు
Tollywood Strike: తెలుగు చిత్రసీమలో కార్మికులు చేస్తున్న కొత్త మలుపు తీసుకుంది. నిర్మాతల్లో పెద్ద, చిన్న అంటూ రెండు వర్గాలుగా చీలాయి. ఏపీకి ఒక బృందం వెళితే తెలంగాణలో మరో బృందం ప్రెస్ మీట్ పెట్టింది.

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నిర్మాతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. టాలీవుడ్ సినీ కార్మికులు మొదలు పెట్టిన సమ్మె కొత్త మలుపు తీసుకుంది. వేతనాలు 30 శాతం పెంచే విషయంలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అగ్ర నిర్మాతలు ఏపీకి వెళితే, యువ నిర్మాతలు తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టారు.
ఏపీకి వెళ్లిన అగ్ర నిర్మాతలు...
సినిమాటోగ్రఫీ మంత్రితో భేటీ!
ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) దగ్గరకు టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ భరత్ భూషణ్ సహా చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలతో సినిమాలు నిర్మిస్తున్న బడా బడా నిర్మాతలు వెళ్లారు. ప్రస్తుతం చిత్రసీమలో జరుగుతున్న పరిణామాలు తమకు తెలిపేందుకు నిర్మాతలు వచ్చారని, కార్మికులు వస్తే వాళ్ళ వెర్షన్ వింటామని కందుల దుర్గేష్ తెలిపారు. ప్రభుత్వ జోక్యం అవసరం అయితే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు.
ఏపీ మంత్రిని కలిసిన నిర్మాతల్లో బీవీఎస్ఎన్ ప్రసాద్, 'మైత్రీ' రవిశంకర్, 'యూవీ' వంశీ, SSMB29 నిర్మాత కేఎల్ నారాయణ, 'బన్నీ' వాసు, 'సితార' నాగవంశీ, డీవీవీ దానయ్య, 'షైన్ స్క్రీన్స్' సాహు గారపాటి, 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' టీజీ విశ్వప్రసాద్ తదితరులు ఉన్నారు.
తెలంగాణలో చిన్న నిర్మాతలు...
థియేట్రికల్ బిజినెస్ బాధ్యత ఎవరిది?
ఫిల్మ్ ఫెడరేషన్ రూల్స్ కారణంగా చిన్న చిన్న సన్నివేశాలు తీయడానికి తాము కోట్ల రూపాయలలో నష్టపోతున్నామని 'మధుర' శ్రీధర్ తెలిపారు. గత రెండేళ్లలో పది కోట్ల రూపాయలు లాభం చూసిన నిర్మాత ఎవరూ లేరని 'హనుమాన్' వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఫిల్మ్ తీసిన శ్రీమతి చైతన్య రెడ్డి తెలిపారు.
Also Read: మాటలు రాని వీరాభిమానికి ఎన్టీఆర్ సర్‌ప్రైజ్... 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ సీన్
కార్మికుల సమ్మె విషయంలో దర్శకుల సంఘం, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎటువైపు ఉన్నాయని 'బేబీ' వంటి హిట్ ఫిల్మ్ తీసిన ఎస్.కె.ఎన్ సూటిగా ప్రశ్నించారు. కార్మికుల వేతనాల్లో 30 శాతం కాదని, 50 శాతం పెంచడానికి తాము సిద్ధమని, అయితే తమ థియేట్రికల్ బిజినెస్ విషయంలో బాధ్యత ఎవరు తీసుకుంటారని ఆయన అడిగారు. ఆ బాధ్యత తీసుకునే వాళ్ళు మాత్రమే హక్కుల గురించి మాట్లాడమని ఆయన ఘాటుగా స్పందించారు. లేదంటే తాము బతకాలని గనుక వేరే రాష్టాల నుంచి కార్మికులను తీసుకొచ్చి పని చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. హీరోలు కోట్ల రూపాయలలో పారితోషికం తీసుకుంటున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని... నిర్మాత బావుంటే తర్వాత చూద్దామని అగ్ర హీరోలు అంటున్నారని, కిరణ్ అబ్బవరం లాంటి యువ హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన వివరించారు. ఈ రోజు (ఆగస్టు 11వ తేదీ) నుంచి షూటింగ్స్ కంప్లీట్ బంద్ చేశారు.
Also Read: ప్రభాస్ సినిమాకు సహాయ దర్శకుడిగా త్రివిక్రమ్ కుమారుడు... వైరల్ న్యూస్ తెల్సా?





















