Chiru Jagan Meet : చిరంజీవి, నాగార్జున కాక ఇంకెవరు ? జగన్‌తో భేటీకి వెళ్లే ప్రముఖులు ఎవరు?
పదో తేదీన సీఎం జగన్‌తో టాలీవుడ్ ప్రముఖులు భేటీ కానున్నారు. చిరంజీవి, నాగార్జున ఖాయంగా వెళ్తారు. మిగతా వారెవరన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించే దిశగా అడుగులు పడుతున్నాయి. టిక్కెట్ ధరలపై హైకోర్టు సూచనలతో ఏర్పాటైన కమిటీ ప్రాధమిక నివేదిక ఇచ్చింది. మరో వైపు పదో తేదీన టాలీవుడ్ బృందంతో సీఎం జగన్ సమావేశం కాబోతున్నారు. గతంలో చిరంజీవి ఒక్కరే సమావేశం అయ్యారు. దాంతో అది వ్యక్తిగత సమావేశంగా జరిగింది. టాలీవుడ్ అంటే ఏ ఒక్కరో కాదన్న అభిప్రాయాలు వినిపించాయి. దీంతో ఈ సారి చిరంజీవి నేతృత్వంలో బృందం రావాలని ఏపీ సీఎంవో నుంచి సమాచారం అందింది. దీంతో ఇప్పుడు చిరంజీవితో పాటు ఎవరెవరు వెళ్తారన్న చర్చ జరుగుతోంది.
ఏపీ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆహ్వానం అందిన తర్వాత చిరంజీవి సినీ వ్యాపారాలకు సంబంధించిన ప్రముఖులందరితో సమావేశం నిర్వహించి సీఎం దృష్టికి తీసుకెళ్లాల్సిన ఎజెండాను ఖరారు చేయాలనుకున్నారు. పిల్మ్ చాంబర్ ఆధ్వర్యంలో చిరంజీవి అధ్యక్షతన సమావేశం కావాలని గత కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. సోమవారం ప్రముఖులందరూ సమావేశమవ్వాలనుకున్నారు. కానీ మంగళవారం నాటికి వాయిదా పడింది. అయితే మంగళవారమూ మీటింగ్ కి కచ్చితంగా రావాల్సిన సభ్యులు కొందరు అందుబాటులో లేమని చెప్పడంతో వాయిదా పడింది.
సీఎం జగన్‌తో భేటీకి ఎవరెవరు వెళ్తారన్నది కూడా ఈ కారణంగానే ఖరారు కాలేదు. చిరంజీవితో పాటు నాగార్జున వెళ్లడం ఖాయమే. ఎందుకంటే సీఎం జగన్‌తో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ నిర్మాతలకు టిక్కెట్ రేట్ల పెంపు అత్యావశ్యకం. వారు కూడా వెళ్లడం ఖాయమే. అలాగే చిరంజీవితో ఆచార్య సినిమా తీసిన నిర్మాత సీఎం జగన్‌కు లాయర్‌గా సేవలు అందిస్తారు. దీంతో ఆయన కూడా టీమ్‌లో ఉండే అవకాశం ఉంది. ఇంకెవరు వెళ్తారన్నది క్లారిటీ లేదు. సీఎం జగన్‌తో సమావేశానికి చాలా మంది వెనుకడుగు వేస్తున్నారని అందుకే చిరంజీవితో భేటీకి రావడం లేదన్న ప్రచారం టాలీవుడ్‌లో అంతర్గతంగా జరుగుతోంది.
సినిమావాళ్లందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి, ప్రభుత్వానికీ, సినిమా పరిశ్రమకు ఉన్న గ్యాప్ ని తగ్గించాలని భావిస్తున్నారు. అందుకే ప్రముఖులకు ఫోన్లు చేసి సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. బాలకృష్ణకు కూడా చిరంజీవి ఫోన్ చేసిటన్లుగా టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఇక "మా" అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి ఇండస్ట్రీ తరపున కాస్త పెద్దరికం ఉన్న మోహన్ బాబు ఈ విషయంలో జోక్యం చేసుకుంటారా.. ఇండస్ట్రీ తరపున జగన్‌తో భేటీకి వెళ్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. టాలీవుడ్ తరపున జగన్‌తో భేటీకి ఎవరెవవరు వెళ్తారన్నది బుధవారం సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.