Allu Arjun News: నటుడు అల్లు అర్జున్‌కి హైకోర్టులో ఊరట, అప్పటివరకూ చర్యలు తీసుకోవద్దన్న ధర్మాసనం
Andhra Pradesh News | జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌పై తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో ఆయనకు తాత్కాలికంగా ఊరట లభించింది.
Allu Arjun News | అమరావతి: ఏపీ ఎన్నికలకు సంబంధించిన కేసులో జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఏడాది నవంబర్ 6వ తేదీ వరకు అల్లు అర్జున్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 6న ఈ కేసులో తీర్పు వెలువరించనున్నట్లు కోర్టు వెల్లడించింది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన సమయంలో నంద్యాల వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి కోసం నటుడు అల్లు అర్జున్ వెళ్లారు. వైసీపీ నేత ఇంటికి అల్లు అర్జున్ వెళ్లిన సమయంలో నంద్యాల శివారు నుంచే వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీగా ఆయనను తీసుకువచ్చాయి. అల్లు అర్జున పర్యటనకు ఎలాంటి అనుమతులూ లేకపోయినా నంద్యాల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు సైతం చేశారు. ఇదే విషయాన్ని కొందరు ఎన్నికల కమిషన్ (Election Commission) దృష్టికి తీసుకెళ్లడంతో అల్లు అర్జున్ తో పాటు వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డిలపై గతంలోనే నంద్యాల టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారని తెలిసిందే. తనపై నమోదైన కేసు కొట్టివేయాలని అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించగా.. అల్లు అర్జున్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. నవంబర్ 6న అల్లు అర్జున్ పిటిషన్ పై తీర్పు రానుంది.