Titanic: ఇదేం పిచ్చిరా బాబు! రోజ్‌ను సేవ్ చేసిన ఆ ‘టైటానిక్’ డోర్ వేలం, ఎంతకు అమ్ముడైందో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Titanic: 1997లో విడుదలయిన ‘టైటానిక్’ సినిమా వల్లే అసలు టైటానిక్ షిప్ వెనుక జరిగిన ట్రాజిడీ గురించి ప్రేక్షకులకు తెలిసింది. తాజాగా ఈ షిప్‌కు ఇంకా ఎంత క్రేజ్ ఉందో ఒక వేలంపాట నిరూపించింది.
Titanic Door Auction: ‘టైటానిక్’ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అసలు ఎప్పుడూ ఇంగ్లీష్ సినిమాలు చూడనివారిలో చాలామంది ‘టైటానిక్’ చూసుంటారు. అయితే ఈ సినిమా నిజంగానే సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ కథ ఆధారంగా తెరకెక్కించారు జేమ్స్ కెమెరాన్. ఇప్పటికీ టైటానిక్ షిప్ గురించి హాలీవుడ్ ప్రేక్షకులు చర్చించుకుంటారు. తాజాగా అక్కడ మరోసారి ‘టైటానిక్’ గురించి హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే తాజాగా ఒక వేలంపాటలో టైటానిక్ మూవీలో ఉపయోగించిన డోర్‌ను వేలం వేశారు. ఆ డోర్‌ను కోట్లు పెట్టి కొనడానికి చాలామంది ముందుకొచ్చారు.
7 లక్షల డాలర్లు..
టైటానిక్ షిప్‌కు సంబంధించిన డోర్‌లాంటి ఒక చెక్క ముక్కను వేలం వేయగా.. అది 7,00,000 డాలర్లు అంటే దాదాపు రూ. 5.8 కోట్లకు అమ్ముడుపోయింది. ఇది విని ప్రేక్షకులంతా షాక్ అవుతున్నారు. అయితే ఇప్పటికే ఈ డోర్ చుట్టూ అనేక కాంట్రవర్సీలు తిరిగాయి. ‘టైటానిక్’ క్లైమాక్స్‌లో హీరోయిన్ రోజ్ ఒక్కదాన్ని ఈ డోర్‌పై ఉంచి తన ప్రాణాలు కాపాడతాడు హీరో జాక్. ఇది చూసిన ప్రేక్షకులు.. జాక్ కూడా దానిపై ఎక్కి తన ప్రాణాలు కాపాడుకోవచ్చు కదా అని విమర్శించడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఈ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హెరిటేజ్ ఆక్షన్స్ వాళ్లు ఈ డోర్‌ను వేలం వేయగా.. అసలు ఇది డోరే కాదనే విషయాన్ని బయటపెట్టారు.
ఇది డోర్ కాదు..
‘‘దీనిని అందరూ డోర్ అని తప్పుగా అనుకుంటారు. ఇది ఫస్ట్ క్లాజ్ లాంజ్‌కు సంబంధించిన డోర్ ఫ్రేమ్‌లోని భాగం. ఇప్పటివరకు టైటానిక్ నుండి మిగిలిపోయిన ఈ డోర్ ఫ్రేమ్ భాగం మాత్రమే కాదు.. మరెన్నో శిథిలాలు కూడా దీనిని నిర్మించిన హార్లాండ్, వోల్ఫ్ గొప్పదనాన్ని చాటిచెప్తాయి’’ అని హెరీటేజ్ ఆక్షన్స్ వివరించింది. అయితే ఈ వేలంపై, దాని చుట్టూ జరుగుతున్న కాంట్రవర్సీలపై జేమ్స్ కెమెరాన్ కూడా స్పందించారు. ‘‘ఈ చిన్న చెక్క ముక్క ఫ్యాన్స్‌లో ఎన్నో చర్చలకు దారితీసింది. చాలామంది ఇది జాక్, రోజ్ ఇద్దరి ప్రాణాలను కాపాడి ఉండవచ్చు అన్నారు. రోజ్ కోసం ఆ నీటిలో మునిగిపోయి, చనిపోవాలని అనుకున్న జాక్ ప్రాణ త్యాగాన్ని వారు గుర్తించలేదు’’ అని కెమెరాన్ అన్నట్టు వేలం వేసిన సంస్థ బయటపెట్టింది.
ట్రాజిడీలో ప్రేమకథ..
ఇక టైటానిక్ విషయానికొస్తే.. 1912లో నిజంగానే నీటిలో మునిగిపోయిన అతిపెద్ద ఆర్ఎమ్సీ టైటానిక్ షిప్ ఆధారంగా 1997లో ‘టైటానిక్’ సినిమాను తెరకెక్కించారు జేమ్స్ కెమెరాన్. అప్పట్లో ఈ సినిమా హాలీవుడ్ అంటే ఏంటో ప్రపంచానికి పరిచయం చేసింది. ఇంగ్లీష్ సినిమాలు చూడనివారికి కూడా జేమ్స్ కెమెరాన్ అంటే ఎవరో తెలిసేలా చేసింది. టైటానిక్ షిప్ ట్రాజిడీని ఒక అందమైన ప్రేమకథతో జోడించి ప్రేక్షకులకు నచ్చేలా చెప్పారు కెమెరాన్. అప్పట్లో చాలామంది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించినా.. తర్వాత కొన్నాళ్లకు దీనిని ఓవర్ రేటెడ్ అని విమర్శిస్తూ.. ఇందులో చిన్న చిన్న లోపాలను వెతకడం మొదలుపెట్టారు. అయినా కూడా టైటానిక్ క్రేజ్ ఇంకా తగ్గలేదని రూ.5.8 కోట్ల వేలంలో అమ్ముడుపోయిన డోర్ నిరూపించింది.
Also Read: ఫోన్ ట్యాపింగ్ దుమారం - దగ్గుబాటి ఫ్యామిలీపై నంద కుమార్ సంచలన వ్యాఖ్యలు