Jagan Tollywood Meet : టాలీవుడ్ సమస్యలకు శుభం కార్డు - జగన్‌కు ధ్యాంక్స్ చెప్పిన స్టార్స్ !
సీఎం జగన్‌తో జరిగిన సమావేశంలో టాలీవుడ్ సమస్యలకు శుభం కార్డు పడిందని సినీ తారలు ప్రకటించారు. అందరూ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
టాలీవుడ్ ప్రముఖులు ఏపీ సీఎం జగన్‌తో సమావేశం అయ్యారు. దాదాపుగా గంట నుంచి రెండు గంటల పాటు జరిగిన చర్చల్లో టిక్కెట్ రేట్ల దగ్గర్నుంచి సినిమా రంగసమస్యలన్నింటిపై చర్చించినట్లుగా తెలుస్తోంది. సమస్యలన్నింటిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన వారందరూ సమస్య పరిష్కారం అయిందని.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
సమస్యలకు శుభం కార్డు పడింది : చిరంజీవి
టాలీవుడ్ సమస్యలకు శుభం కార్డు పడిందని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో జరిగిన చర్చలు సానుకూలంగా జరిగాయని చిరంజీవి ప్రకటించారు. చిన్న సినిమాలను దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ చర్చలు జరిపారని.. చిన్న సినిమాలకు ఐదో షోకు అంగీకారం తెలిపారని చిరంజీవి తెలిపారు. జగన్‌తో చర్చలు సంతృప్తికరంగా సాగాయన్నారు. చిన్న సినిమాలకు లబ్ది చేకూరేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. ఇండస్ట్రీ సమస్యలపై కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నరని అండగా ఉంటామని హమీ ఇచ్చారు. సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలుపతున్నామన్నారు. టిక్కెట్ ధరలపై కొన్ని నెలలుగా ఉన్న అనిశ్చితికి తెరపడినట్లేనన్నారు. తెలంగాణలోలా ఏపీలోనూ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలనేది సీఎం ఆకాంక్ష అన్నారు. పాన్ ఇండియా సినిమాల విడుదల సమయంలో ఏం చేయాలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారని చిరంజీవి తెలిపారు. మూడో వారంలో జీవో వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.
హామీలు నెరవేరుస్తామన్నారు.. ధ్యాంక్స్ : మహేష్
సినిమా ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరిస్తామని సీఎం జగన్ అన్నారని ... ప్రభుత్వ స్పందనకు మహేష్ బాబు ధ్యాంక్స్ చెప్పారు. పది రోజుల్లోనే శుభవార్త వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఆరు నెలల నుంచి ఇండస్ట్రీ గందరగోళంలో ఉందని.. ఇవాళ చాలా రిలీఫ్ .. వెరీ హ్యాపీ.. చర్చలు బాగా జరిగాి.. ధ్యాంక్స్ అన్నారు. మా అందరి తరపున చిరంజీవికి కూడా ధ్యాంక్స్ అని మహేష్ చెప్పారు.
సమస్య పరిష్కరించినందుకు జగన్‌కు ధ్యాంక్స్ : ప్రభాస్
సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించినందుకు హీరో ప్రభాస్ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి చిరంజీవి చేసిన ప్రయత్నాలకూ కృతజ్ఞతలు తెలిపారు.
జగన్‌కు అన్నింటిపై అవగాహన ఉంది : రాజమౌళి
తెలుగు సినీ పరిశ్రమ సమస్యల విషయంలో సీఎం జగన్‌కు స్పష్టమైన అవగాహన ఉందని దర్శకుడు రాజమౌళి అన్నారు. మా విజ్ఞప్తులను సీఎం జగన్ విన్నారన్నారు. ఏ విధంగా ముందుకు వెళ్లాలో దిశానిర్దేశం చేసిన జగన్‌కు రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఇచ్చిన క్లారిటీతో సంతృప్తి చెందామన్నారు.
చిన్న సినిమాలను బతికిస్తామన్నారు : నారాయణ మూర్తి
సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారంపై క్లారిటీ వచ్చినందున ఇవాళ చాలా హ్యాపీగా ఉందని నారాయణ మూర్తి అన్నారు. సమస్యల పరిష్కారం కోసం చిరంజీవి కృషి చేశారన్నారు. అటు ఇండస్ట్రీకి.. ఇటు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయంతీసుకున్నందుకు సంతృప్తిగా ఉందని నారాయణ మూర్తి తెలిపారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చిన్న సినిమాలు బతికేలా చేస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు.
నెలాఖరులోగా సమస్యలకు పరిష్కారం : పేర్ని నాని
సినీ పరిశ్రమ ప్రముఖులు వచ్చి చర్చలు జరపడంతో సమస్యలు పరిష్కారం అవడానికి మార్గం సుగమం అయిందని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌తో సమావేశంలో నారాయణమూర్తి చిన్న సినిమాలపైతన ఆవేదన వ్యక్తం చేశారన్నారు. హాజరైన వారందరూ టాలీవుడ్ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారన్నారు. సమస్యల పరిష్కారనికి కృషి చేసిన చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. ఎవరు పడితే వారు.. ఏది పడితే అది మాట్లాడినా చిరంజీవి పెద్ద మనసు చేసుకున్నారన్నారు. ఏపీలో షూటింగ్‌లు.. ఇతర ప్రభుత్వ పరమైన సహాయసహకారాల కోసం ప్రభుత్వం రెడీగా ఉందన్నారు.