Tollywood Vs Kollywood: తమిళ హీరోలకు మనం హిట్స్ ఇస్తే... మనకు ఏమో తమిళ దర్శకుల నుంచి డిజాస్టర్లు!
'కుబేర' విడుదల తర్వాత తమిళ హీరోలతో తెలుగు దర్శకులు సినిమాలు తీస్తే హిట్టే అనే సెంటిమెంట్ బలపడింది. సేమ్ టైం, తెలుగు హీరోలకు తమిళ దర్శకులు ఇచ్చిన డిజాస్టర్ల ప్రస్తావన వస్తోంది.

Telugu Directors VS Tamil Directors: కథానాయకుడిగా ధనుష్ ప్రయాణంలో 51వ సినిమా 'కుబేర' (Kuberaa). తెలుగు దర్శకుడితో ఆయన రెండో చిత్రమిది. అమెరికాలో ప్రీమియర్స్ నుంచి ఇండియాలో షోస్ వరకు... విమర్శకుల నుంచి ప్రేక్షకుల వరకు... 'కుబేర'కు సూపర్ డూపర్ హిట్ టాక్ లభించింది. ఈ విజయం తర్వాత తమిళ / మలయాళ కథానాయకులతో తెలుగు దర్శకులు సినిమాలు తీస్తే బ్లాక్ బస్టర్ అనే సెంటిమెంట్ మొదలు అయింది. ఆ మాట నిజమే... పరభాష హీరోలతో తెలుగు దర్శకులు తీసిన సినిమాల సక్సెస్ రేట్ 100%.
విజయ్ 'వారసుడు'తో మొదలు...
తమిళ్ హీరోతో తెలుగు దర్శకుడు!
తమిళ కథానాయకులతో తెలుగు దర్శకులు సినిమాలు తీయడం ఇటీవల మొదలైన ట్రెండ్ ఏమీ కాదు. కమల్ హాసన్, కళా తపస్వి కే విశ్వనాథ్ కలయికలో వచ్చిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? అవన్నీ క్లాసికల్ హిట్స్! 'స్వాతి ముత్యం', 'సాగర సంగమం' వంటి సినిమాలు ఈ తరం ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. అయితే ఆ సినిమాలను ఇప్పుడు చూసినా కట్టిపడేస్తాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తెలుగు - తమిళ ద్విభాషా చిత్రాలు చేశారు. అయితే ఇటీవల వారసుడితో మళ్ళీ తెలుగు దర్శకులతో తమిళ హీరోలు సినిమా ట్రెండ్ మొదలు అయింది.
దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన 'వారసుడు' సినిమాకు దర్శకుడు వంశీ పైడిపల్లి. నిర్మాత 'దిల్' రాజు. సంక్రాంతి 2023కి విడుదలైన ఆ సినిమా కమర్షియల్ హిట్. ఆ ఏడాది ఫిబ్రవరిలో ధనుష్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన 'సార్' విడుదల అయింది. వంద కోట్ల క్లబ్బులో ఆ సినిమా చేరింది. 'సరిపోదా శనివారం' సినిమాలో ఎస్.జె. సూర్య హీరో కాదు, విలన్. కానీ, హీరో నాని కంటే ఆయన పెర్ఫార్మన్స్ ఎక్కువ హైలైట్ అయ్యింది. ఆయనకు ఎక్కువ పేరు వచ్చింది.
దుల్కర్ సల్మాన్ తమిళ కథానాయకుడు కాదు... ఆయన మలయాళీ. 'వారసుడు', 'సార్' కంటే ముందు తెలుగు దర్శకుడు నాగ్ అశ్విన్ తీసిన 'మహానటి'లో నటించారు. ఆ తర్వాత హను రాఘవపూడి తీసిన 'సీతారామం', వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన 'లక్కీ భాస్కర్' సినిమాలు చేశారు. ఆ రెండూ హిట్టే. పరభాష హీరోలతో తెలుగు దర్శకులు ఇటీవల తీసిన సినిమాలు అన్నీ విజయాలు సాధించాయి. తమిళ మలయాళ హీరోలకు మన దర్శకులు విజయాలు ఇస్తుంటే... తెలుగు హీరోలతో తమిళ దర్శకులు తీసిన సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి.
'స్పైడర్' నుంచి 'గేమ్ చేంజర్' వరకు...
ఒక్కటంటే ఒక్క హిట్టు లేదంటే నమ్మండి!
తమిళ దర్శకులు ఏఆర్ మురుగదాస్, శంకర్, లింగు సామి, విక్రమ్ ప్రభులకు తెలుగు ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉంది. డబ్బింగ్ సినిమా 'గజినీ'తో మురుగదాస్ తెలుగులో విజయం అందుకున్నాను. చిరంజీవి 'ఠాగూర్' ఆయన తీసిన తమిళ రమణకు రీమేక్. విజయ్ 'తుపాకీ' సైతం తెలుగులో మంచి విజయం సాధించింది. లింగు సామి 'ఆవారా', 'పందెం కోడి', వెంకట్ ప్రభు 'సరోజ', 'గ్యాంబ్లర్', 'మానాడు' సినిమాలకు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. శంకర్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? ఆయన తీసిన కొన్ని సినిమాలు అయితే తమిళం కంటే తెలుగులో ఎక్కువ వసూళ్లు సాధించాయి. అందుకని, ఆ దర్శకులు వచ్చినప్పుడు తెలుగు హీరోలు 'ఎస్' చెప్పారు. 'ఎస్' అనే సినిమాలో అయితే చేశారు గానీ సక్సెస్‌లు మాత్రం రాలేదు.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వం వహించిన 'స్పైడర్' డిజాస్టర్ అయ్యింది. అంతకు ముందు చిరంజీవితో 'స్టాలిన్' తీశారు. ప్రేక్షకులు అందరినీ ఆ సినిమా మెప్పించలేదు. కానీ మోస్తరుగా ఆడింది. అయితే 'స్పైడర్' అందరి అంచనాలను తలకిందులు చేస్తే షాక్ ఇచ్చింది. తెలుగు హీరోలతో తమిళ దర్శకులు తీసిన సినిమాలు ఫ్లాప్ కావడానికి కారణాలు ఏమిటో కింద లింక్‌లో చూడండి.
Also Read: తెలుగు హీరోను డమ్మీ చేస్తే ఎలా? తమిళ క్యారెక్టర్ ఆర్టిస్టులే ఎక్కువా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన 'గేమ్ చేంజర్' సైతం అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈ రెండు సినిమాలకు మధ్యలో రామ్ పోతినేని హీరోగా లింగు సామి 'ది వారియర్', అక్కినేని నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు 'కస్టడీ' సినిమాలు తీశారు. ఆ రెండు కూడా ఫ్లాపులే. పవన్ కళ్యాణ్ హీరోగా 'ఖుషి' వంటి హిట్ సినిమా తీసిన ఆ తర్వాత 'కొమరం పులి' తీశారు. పవన్ కళ్యాణ్ 'పంజా' దర్శకుడు విష్ణువర్ధన్, 'బ్రో' దర్శకుడు సముద్రఖని సైతం తమిళులే. ఆ రెండు ఆశించిన విజయాలు సాధించలేదు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పొలిటికల్ డ్రామా 'నోటా' దర్శకుడు ఆనంద్ శంకర్‌ది కూడా చెన్నై. ఆయన కూడా ఫ్లాప్ తీశారు.
అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్ ఏం చేస్తారో?
పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న తెలుగు హీరోలతో తమిళ దర్శకులు సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సెట్స్ మీదకు వెళ్లిన సినిమాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న సినిమా గురించి. ఆ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ ఓ సినిమా చేయనున్నారు. 'పుష్ప' విజయం తర్వాత అల్లు అర్జున్, 'దేవర' విజయం తర్వాత ఎన్టీఆర్ ఓకే చేసిన సినిమాలు ఇవి. ఆ ఇద్దరు దర్శకులు ఏం చేస్తారో చూడాలి.
Also Read: బ్లాక్ బస్టర్ 'కుబేర': రష్మిక అకౌంట్‌లో మరో హిట్, కానీ అభిమానులకు నిరాశ... కారణం ఏంటంటే?





















