Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?
తెలుగు దేశం, జనసేనకు తెలుగు చిత్రసీమ 'జై' కొడుతోందా? చాపకింద నీరులా వాళ్లకు ప్రచారం చేయడం మొదలు పెట్టిందా? ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మద్దతు లభించడం మొదలైందా?
ఎన్నికలు సమీపించిన తరుణంలో చిత్రసీమ ప్రముఖులు కొందరు ఏదో ఒక పార్టీకి మద్దతు పలకడం సహజంగా జరుగుతుంది. మూకుమ్మడిగా చిత్ర పరిశ్రమ అంతా కలిసి ఒక్క పార్టీకి మద్దతు పలకడం ఎప్పుడూ జరగలేదు. అలా జరగదు కూడా! అయితే... మెజారిటీ లెక్కలు చూసుకుంటే? రాబోయే ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి (Telugu Desam Party), జనసేన పార్టీకి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎక్కువ మద్దతు లభించేలా కనపడుతోంది. అది సినిమాల్లో కావచ్చు... నేరుగా కావచ్చు!
టీడీపీ, జనసేన పొత్తు...
పరిశ్రమ నుంచి ముందడుగు!
నారా చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలుగు చిత్రసీమలో పరిణామాలు కూడా వేగంగా మారాయని చెప్పాలి. జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలుకు వెళ్లడం, అక్కడ రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తారని అనౌన్స్ చేయడం తెలిసిన విషయాలే.
టీడీపీ, జనసేన పొత్తు ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మెగా హీరోల మద్దతు ఈ కూటమికి లభించినట్లు అయ్యింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన బాబాయ్ కొండా విశ్వేశర్ రెడ్డి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నారు. అయితే... వాళ్లిద్దరూ ఉన్నది తెలంగాణాలో! వాళ్ల పార్టీలు కూడా వేర్వేరు... తెలుగు దేశం, జనసేన కాదు! ఒకవేళ ఆయా పార్టీల తరఫున అత్తారింట్లో సభ్యుల కోసం వారిద్దరూ ప్రచారం చేయాల్సి వస్తే... తెలంగాణలో చేస్తారు తప్ప ఏపీలో వేరొక పార్టీకి చేయరు.
జనసేనకు తమ మద్దతు ఉంటుందని మెగా ఫ్యామిలీ కథానాయకులు సమయం, సందర్భం వచ్చినప్పుడు చెబుతున్నారు. అల్లు ఫ్యామిలీ నుంచి సైతం మద్దతు లభిస్తోంది. ఇటీవల 'కోట బొమ్మాళి' సినిమా ప్రచార కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారు కోరితే జనసేన తరఫున పని చేయడానికి సిద్ధమని 'బన్నీ' వాస్ స్పష్టం చేశారు. దీన్నిబట్టి... జనసేన, తెలుగుదేశం పార్టీ వైపు సుమారు పది పదిహేను మంది హీరోలు ఉన్నారని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ వివాహాలపై వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. రేణూ దేశాయ్ విషయంలో ఆయన మోసం చేశారని ఆరోపణలు చేశారు. ఏపీ మంత్రి అంబటి రాంబాబు అయితే సినిమా చేస్తానని ప్రకటించారు. అందుకు బదులుగా వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెడితే... రాజకీయ నాయకుడిగా తన మద్దతు పవన్ కళ్యాణ్ కి అని రేణూ దేశాయ్ వెల్లడించిన విషయం ప్రజలకు గుర్తుండే ఉంటుంది.
స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఆయన తనయుడు బాలకృష్ణ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో ఉన్నప్పటికీ... మిగతా కుటుంబ సభ్యులు టీడీపీ వెంట ఉన్నారు. మద్దతు పలుకుతున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువు అయినప్పటికీ... నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన సతీమణి అలేఖ్యా రెడ్డి కూడా టీడీపీ వెంట నిలబడ్డారు. చంద్రబాబు అరెస్ట్ మీద కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే... కె. రాఘవేంద్ర రావు, మురళీ మోహన్, అశ్వినీదత్ మొదలగు ప్రముఖులు ముందు నుంచి టీడీపీ మద్దతుదారులుగా ఉన్నారు. ఇప్పుడూ మద్దతు ఇస్తున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్ మీద రవిబాబు స్పందించారు. ఇంకొంత మంది ప్రముఖులు స్పందించే అవకాశం ఉందని సమాచారం.
తెలుగు దేశం, జనసేనలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న, ఆ పార్టీలకు మద్దతుగా ఉన్న ప్రముఖులను పక్కన పెడితే... సినిమాల ద్వారా పరోక్షంగా లబ్ధి చేకూర్చే కార్యక్రమం మొదలైందా? అని తాజా పరిణామాలు చూస్తే అనిపిస్తోంది.
వైసీపీని ఎండగడుతూ...
టీడీపీకి మద్దతు పలుకుతూ!
ఎన్నికల తరుణంలో తటస్థ ఓటర్లపై సినిమాలు ప్రభావం చూపిస్తాయని గతంలో కొన్ని సందర్భాలు నిరూపించాయి. దానిని కొట్టి పారేయలేం. ఎన్నికల వేళ వైసీపీ సినిమాలను ఉపయోగించుకుంది. 'యాత్ర' ద్వారా రాజశేఖర్ రెడ్డి చేసిన మంచిని గుర్తు చేస్తూ... వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లాభం చేకూర్చింది. అదే సమయంలో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా రామ్ గోపాల్ వర్మ సినిమాలు రూపొందించారు. ఆయన వెనుక వైసీపీ ఉందని ఏపీలో వినబడుతోంది. టీడీపీ, జనసేనకు వ్యతిరేకంగా ఆయన ట్వీట్లు చూసినా వైసీపీ మద్ధతుగా ఉన్నారని అర్థం అవుతోంది.
ఏపీలో రాబోయే ఎన్నికల కోసం ఆల్రెడీ వైసీపీకి అనుకూలంగా రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'యాత్ర 2'ను మహి వి రాఘవ్ సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. మరి, తెలుగు దేశం పార్టీకి మద్దతుగా సినిమాలు ఏమీ రావడం లేదా? అంటే వస్తున్నాయ్! చంద్రబాబు నాయుడి సోదరుడి కుమారుడు నారా రోహిత్ హీరోగా జర్నలిస్ట్ మూర్తి 'ప్రతినిథి 2' తెరకెక్కిస్తున్నారు. కొన్ని జనసేనకు మద్దతుగా రెండు మూడు సినిమాలు తెరకెక్కుతున్నట్లు తెలిసింది. తాజాగా విడుదలైన ఓ సినిమాలో వైసీపీ ప్రభుత్వం మీద సెటైర్లు పడ్డాయి. మరో సినిమాలో టీడీపీ ఇమేజ్ పెంచే ప్రయత్నం జరిగింది.
Also Read : ఏవయ్యా అట్లీ - నీకు హీరోయిన్లను చంపే శాడిజం ఏంటయ్యా?
బోయపాటి శ్రీను తీసిన 'స్కంద'లో వైసీపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన 'భూమ్ భూమ్' బీరు మీద పడిన సెటైర్ గట్టిగా పేలింది. 'ఫారిన్ సరుకు ఎక్కడం లేదు. మన లోకల్ సరుకు కొడితే భూమి అంతా భూమ్ భూమ్ అంటూ గిర్రున తిరుగుతుంది' అనే డైలాగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ సలహాదారుగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ శైలి మీద కూడా బోయపాటి శ్రీను గట్టిగా సెటైర్ వేశారు. మంచినీళ్ల చెరువు లాంటి రాష్ట్రాన్ని బురద చేశారని, కులాల కుంపట్లు రగిల్చి చెడ్డవాడిని అందలం ఎక్కించినట్లు ఆ మాటలను బట్టి అర్థం అవుతోంది.
Also Read : బాలకృష్ణ, రవితేజకు గట్టి పోటీ, దసరా బరిలో సిక్సర్ - 'జైలర్', 'జవాన్' సక్సెస్ రిపీట్ చేసేదెవరు?
'పెదకాపు 1' పతాక సన్నివేశాల్లో జనాలకు అండగా పోరాటం చేసే సామాన్యులకు తెలుగు దేశం పార్టీ స్థాపించిన సమయంలో టిక్కెట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వర్మ తరహాలో వెకిలిగా సినిమాలు తీయకుండా... ఒక పద్ధతి ప్రకారం సినిమాల్లో టీడీపీ ఇమేజ్ పెంచుతూ, వైసీపీపై విమర్శలు మొదలయ్యాయని విశ్లేషకులు అంచనా. మరిన్ని సినిమాల్లో వైసీపీపై విమర్శలు ఉండొచ్చట! తెలుగు సినిమా ఇండస్ట్రీలో టీడీపీ, జనసేనకు సైలెంట్ సపోర్ట్ మొదలైందని చాలా మంది అంతర్గత సంభాషణల్లో వినిపిస్తున్న మాట. వైసీపీలో రోజా, ఆలీ, పోసాని వంటి సినిమా జనాలు ఉన్నప్పటికీ... టీడీపీ, జనసేన వైపు ఉన్నంత మంది స్టార్లు లేరని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial