Ganesh Puja Releases: ఈసారి వినాయకుడి పండక్కి డబ్బింగ్ సినిమాలే దిక్కు!
టాలీవుడ్ లో ఈసారి వినాయక చవితికి తెలుగు సినిమాల సందడి లేకుండా పోతోంది. మన సినిమాలన్నీ 'సలార్' డేట్ కు వెళ్లిపోవడంతో, ఫెస్టివల్ లాంగ్ వీకెండ్ లో రెండు డబ్బింగ్ చిత్రాలే తెలుగు ప్రేక్షకులకు దిక్కయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా ఫెస్టివల్ వస్తుందంటే చాలు టాలీవుడ్ లో సినిమాల పండుగ మొదలవుతుంది. పెద్ద సినిమాలు, క్రేజీ చిత్రాలన్నీ అదే సీజన్ లో థియేటర్లలో సందడి చేస్తుంటాయి. రాబోయే దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు ఇప్పటి నుంచే తీవ్ర పోటీ నెలకొంది. అయితే అంతకంటే ముందు వచ్చే వినాయక చవితి సీజన్ ని మాత్రం మన ఫిలిం మేకర్స్ విస్మరించారు. ఈసారి గణేశుడి పండక్కి ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా రిలీజ్ అవ్వడం లేదు. అదే సమయంలో రెండు డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతున్నాయి.
ఉస్తాద్ రామ్ పోతినేని, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'స్కంద' చిత్రాన్ని ముందుగా సెప్టెంబర్ 15న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. దీంతో పాటుగా రాఘవ లారెన్స్ నటించిన 'చంద్రముఖి 2'.. విశాల్ హీరోగా రూపొందిన 'మార్క్ ఆంటోనీ' వంటి తమిళ్ డబ్బింగ్ సినిమాలు అదే రోజున విడుదల ప్లాన్ చేసుకున్నాయి. కొన్ని చిన్న మీడియం రేంజ్ సినిమాలు కూడా డేట్ దొరికితే వినాయక చతుర్థికి రావాలని భావించాయి. అయితే 'సలార్' పార్ట్-1 సినిమా వాయిదా పడటంతో అంతా తారుమారు అయ్యింది.
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న 'సలార్' చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేయాలని ఏడాదిన్నర క్రితమే డేట్స్ బ్లాక్ చేసారు. దీంతో అందరూ పోటీ లేకుండా మిగతా తేదీలలో రిలీజులు ప్లాన్ చేసుకున్నారు. అయితే వివిధ కారణాలతో ఇప్పుడు సలార్ సినిమా అనుకున్న సమయానికి రావడం లేదు. ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుందని క్లారిటీ రావడంతో సీన్ మారిపోయింది. 5 రోజుల లాంగ్ వీకెండ్ ని వదులుకోవడం ఎందుకని ప్రతీ ఒక్కరూ ప్రభాస్ మీదనే కన్నేశారు.
'సలార్' వాయిదా పడుతుందని క్లారిటీ వచ్చిన వెంటనే, ఇన్నాళ్లూ స్లాట్ కోసం వెయిట్ చేస్తున్న మేకర్స్ అంతా డేట్స్ అనౌన్స్ చేసారు. కిరణ్ అబ్బవరం నటించిన 'రూల్స్ రంజన్'.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న 'మ్యాడ్' సినిమాలను సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న 'పెద కాపు-1' మూవీని ఒక రోజు తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సెప్టెంబర్ 15వ తేదీన రావాల్సిన 'స్కంద' సినిమాని కూడా ఈ నెల 28వ తేదీకి షిఫ్ట్ చేసారు. ఇలా సినిమాలన్నీ సెప్టెంబర్ చివరి వారంలో రావాలని ఫిక్స్ అవ్వడంతో, వినాయక చవితి వీకెండ్ లో తెలుగు ప్రేక్షకులకు 'చంద్రముఖి 2' & 'మార్క్ ఆంథోనీ' వంటి రెండు డబ్బింగ్ చిత్రాలే మిగిలాయి.
నిజానికి గణేష్ చతుర్థికి కూడా లాంగ్ వీకెండ్ ఉంది. ఎలాగూ సెప్టెంబర్ 19న పండగను సెలబ్రేట్ చేసుకోమని చెప్తున్నారు కాబట్టి.. శుక్రవారం నుంచి మంగళవారం వరకూ 5 రోజులు కలెక్షన్స్ రాబట్టడానికి ఛాన్స్ ఉంది. టాక్ బాగుంటే భారీ ఓపెనింగ్స్ గ్యారంటీ. అలాంటి మంచి వీకెండ్ ను డబ్బింగ్ సినిమాకు వదిలేసి, అన్నీ సెప్టెంబర్ 28 మీద పడ్డాయి. అదే రోజున 4 తెలుగు సినిమాలతో పాటుగా 'ది వ్యాక్సిన్ వార్' వంటి డబ్బింగ్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. సో బాక్సాఫీస్ వద్ద పోటీ ఎక్కువ ఉంటుంది. మరి ఫైనల్ గా ఎవరు విన్నర్ గా నిలుస్తారో చూడాలి.
Also Read: తెలంగాణ గవర్నర్‌గా రజనీకాంత్? - సూపర్ స్టార్ సోదరుడి కీలక వ్యాఖ్యలు!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial