Tanikella Bharani: రజినీకాంత్ పెద్ద అందగాడు కాదు, ఆర్జీవీ గొప్పతనం అదే - తనికెళ్ల భరణి
Tanikella Bharani: టాలీవుడ్ సీనియర్ రైటర్, నటుడు అయిన తనికెళ్ల భరణి తాజాగా రజినీకాంత్, రామ్ గోపాల్ వర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రైటింగ్ కెరీర్‌ను గుర్తుచేసుకున్నారు.
Tanikella Bharani: టాలీవుడ్‌లో ముందుగా రైటర్‌గా పరిచయమయ్యి.. ఆ తర్వాత యాక్టర్‌గా, డైరెక్టర్‌గా మారారు తనికెళ్ల భరణి. ఆయన తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో రైటర్‌గా ఆయన ప్రయాణాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు. ముందుగా వంశీ లాంటి సీనియర్ డైరెక్టర్ వల్ల తనకు రైటర్‌గా సినిమాల్లో ఎలా బ్రేక్ వచ్చిందో చెప్పుకొచ్చారు. చిన్నప్పటి నుండి తమ కుటుంబంలో ప్రతీ ఒక్కరు పుస్తకాలు ఎక్కువగా చదివేవారని, అదే తనకు కూడా అలవాటు అయ్యిందని బయటపెట్టారు. ఇక సీనియర్ దర్శకులతో రైటర్‌గా పనిచేసిన తనికెళ్ల భరణి.. రామ్ గోపాల్ వర్మ కోసం తన రైటింగ్ స్టైల్‌ను మార్చారు. అలా తనతో ఉన్న ‘శివ’ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
‘లేడీస్ టైలర్’తో బ్రేక్..
ముందుగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లేడీస్ టైలర్’ చిత్రం ద్వారా పూర్తిస్థాయి రచయితగా మంచి కామెడీని రాసే అవకాశం దొరికిందని తనికెళ్ల భరణి తెలిపారు. అప్పట్లో ఈ సినిమా సాధించిన సక్సెస్‌ను గుర్తుచేసుకున్నారు. థియేటర్లలో ప్రేక్షకులంతా నవ్వుకుంటూ డైలాగులు మిస్ అయ్యారని, అందుకే మళ్లీ మళ్లీ సినిమాను చూడడానికి థియేటర్లకు వెళ్లారని చెప్పారు. ఆయన రాసిన దానికి నటీనటులు న్యాయం చేశారని, రాజేంద్ర ప్రసాద్ నటనను ప్రశంసించారు. థియేటర్లు దద్దరిల్లిపోయి ‘లేడీస్ టైలర్’ 100 రోజులు ఆడేసిందని తనికెళ్ల భరణి గుర్తుచేసుకున్నారు. తనకు అన్నింటికంటే తెలంగాణ యాసపైనే చాలా పట్టుందని బయటపెట్టారు.
అలాగే కనెక్ట్ అవుతాం..
తెలుగులో సాహిత్యం పరంగా ముళ్లపూడి వెంకటరమణ అంటే ఆయనకు చాలా ఇష్టమని తెలిపారు. ‘‘ఆయన కూడా మధ్య తరగతి వాడు కాబట్టి కనెక్షన్ ఉంటుంది. అరే.. మనలాగే ఉన్నాడే అనిపించినప్పుడే ఎక్కువ కనెక్ట్ అవుతాం. రజినీకాంత్ తమిళనాడులో ఎందుకు ఫేమస్? పెద్ద అందగాడు కాదు, నల్లగా ఉంటాడు, మనలాగే ఉంటాడు. మనలాగే ఉంటాడని ప్రేక్షకుడు అనుకుంటే ఇంక వాళ్లు సూపర్ స్టారే. దానికి ముందు అందంగా ఉండాలి, ఆరడుగులు ఉండాలి.. తెల్లగా ఉండాలి, కండలతో ఉండాలి అని ఆరాధన భావంతో చూసేవాళ్లు. ఆకాశంలో ఉండేవాళ్లు. కానీ రజినీకాంత్ ప్రేక్షకుడి కళ్ల ముందుకు వచ్చాడు, వచ్చి పక్కన నిలబడ్డాడు’’ అంటూ రజినీకాంత్ ఫ్యాన్ బేస్ గురించి మాట్లాడారు తనికెళ్ల భరణి.
వర్మ విజనరీ అలాంటిది..
అప్పటి దర్శకులతో పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకున్న తనికెళ్ల భరణి.. మౌళితో, వంశీతో సినిమాలు ఎక్కువగా చేశానని తెలిపారు. రాఘవేంద్ర రావుతో సహా అప్పటి దర్శకులు అందరితో సినిమాలు చేశానని అన్నారు. రామ్ గోపాల్ వర్మతో పనిచేసిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ ‘‘ఎవరికి ఏది కావాలి అనేది కదా ప్రధానం. ట్రెండ్‌ను బట్టి రచయిత రాస్తాడు. అలాగే వర్మ గొప్పదనం ఏంటంటే పేపర్ మీద నేను పెట్టిన కథంతా అతని దగ్గర నుండి వచ్చిందే. అతని మనసులో సినిమా తీసి నాకు చూపించాడు. సినిమాను తెరకెక్కించడం కంటే ముందే చూడగలిగేవాడు దర్శకుడు. నేను కూడా విజనరీగా అంతే. ‘శివ’ అంటే పూర్తిగా తన మెదడు నుండి పుట్టిందే’’ అంటూ రామ్ గోపాల్ వర్మ గురించి గొప్పగా మాట్లాడారు తనికెళ్ల భరణి.
Also Read: నువ్వేమైనా నాకు పెగ్ కలిపావా? అన్నింటికీ తెగించే ఇక్కడ నిలబడ్డాం - హరీష్ శంకర్ ఫైర్