చాలా గర్వంగా ఉంది - RRR టీమ్‌ను ఆకాశానికి ఎత్తేసిన హీరో సూర్య
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ సాధించిన RRR బృందానికి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు. ఈ గుర్తింపుకి ఇంతటి సంతోషానికి మీరు అర్హులని కొనియాడారు.
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన సినిమా 'ఆర్.ఆర్.ఆర్' (రౌద్రం రణం రుధిరం). వెండి తెర మీద విజువల్స్ వండర్స్ క్రియేట్ చేసే దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ మూవీ ఇది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల కలయికలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత గ్లోబల్ ఆడియన్స్ ప్రశంసలు అందుకుంది. అంతేకాదు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది.
RRR చిత్రం ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ కు అడుగు దూరంలో ఉన్న సంగతి తెలిసిందే. సినిమాలోని 'నాటు నాటు' పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అకాడెమీ అవార్డ్ కు నామినేటై భారతదేశానికే గర్వకారణంగా నిలిచింది. ఇప్పటికే పలు ఇతర అవార్డులతో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డును ట్రిపుల్ ఆర్ మూవీ దక్కించుకుంది. లేటెస్టుగా హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA ) అవార్డ్స్ - 2023లో మొత్తం ఐదు అవార్డులతో సత్తా చాటింది. ఈ నేపథ్యంలో అందరూ 'ఆర్.ఆర్.ఆర్ సినిమాని, జక్కన్న అండ్ టీమ్ ని కొనియాడుతున్నారు.
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ లో మెరిసిన RRR బృందానికి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మీరు ఈ ప్రతిష్టాత్మక అవార్డ్స్ గెలుపొందినందుకు ఎంతో సంతోషంగా ఉందని.. ఈ గుర్తింపుకి ఇంత సంతోషానికి మీరు అర్హులు అని పేర్కొన్నారు. “హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ గెలిచినందుకు #RRR టీంకి నా అభినందనలు. రాజమౌళి సార్, ఎంఎం కీరవాణి సర్, ఎన్టీఆర్.. మీరు పడిన కష్టానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించినందుకు మా అందరి ప్రేమాభిమానాలకు అర్హులు. డియర్ రామ్ చరణ్ మీరు మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది” అని సూర్య ట్వీట్ చేశారు.
Congratulations Team #RRR on winning Big @HCAcritics
— Suriya Sivakumar (@Suriya_offl) February 25, 2023
You all deserve the love & happiness from the worldwide recognition for the hardwork you have put in @ssrajamouli sir @mmkeervaani sir @tarak9999 Super proud to see you represent our country Dear @AlwaysRamCharan https://t.co/lJqYGEJ9dk
హెచ్‌సీఏలో ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం’, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ (నాటు నాటు), ‘బెస్ట్ స్టంట్స్’, ‘బెస్ట్ యాక్షన్ మూవీ’, ‘ HCA స్పాట్ లైట్’ వంటి ఐదు అవార్డులు 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం గెలుచుకుంది.. ‘బ్లాక్ పాంథర్’, ‘ది బ్యాట్ మెన్’ లాంటి హాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టి మరీ ఈ ఘనత సాధించడం విశేషం. కాగా, 1920స్ బ్యాక్ డ్రాప్ లో అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ వంటి ఇద్దరు విప్లవీరుల పాత్రల స్ఫూర్తితో RRR చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో పాటుగా, అలియా భట్ - అజయ్ దేవగన్, శ్రీయా శరన్, ఒలీవియా మోరిస్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దీనికి కథ అందించగా, కీరవాణి సంగీతం సమకూర్చారు. కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ విభాగాలు నిర్వహించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు.
Also Read: రామ్ చరణ్ పక్కన నిలబడటమే అవార్డ్ - వైరల్ అవుతున్న హాలీవుడ్ నటి వీడియో