Jr NTR - TD Janardhan : శత జయంతి ఒక్కసారే వస్తుందని, పుట్టిన రోజులు మళ్ళీ వస్తాయని రిక్వెస్ట్ చేసినా రాలేదు - టీడీ జనార్థన్
NTR Centenary Celebrations : ఎన్టీ రామారావు శత జయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ రాలేదు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఆహ్వానించడానికి వెళ్లిన టీడీ జనార్థన్ ఏం జరిగిందో వివరించారు.
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) శత జయంతి వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. తెలుగు చిత్రసీమలో ప్రముఖులు చాలా మంది హాజరు అయ్యారు. వెంకటేష్, రామ్ చరణ్, సుమంత్, అక్కినేని నాగ చైతన్య తదితరులు ఎన్టీఆర్ గొప్పతనాన్ని కొనియాడారు. అయితే, ఆ వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) లేకపోవడం (రాకపోవడం) మీద చర్చ జరిగింది. దీనిపై తెలుగుదేశం పార్టీ నేత, యంగ్ టైగర్ ఇంటికి వెళ్లి ఆహ్వానించిన వ్యక్తుల్లో ఒకరైన టీడీ జనార్థన్ స్పందించారు.
వారం రోజులకు టైమ్ ఇచ్చిన జూనియర్!
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడం మీద చర్చ జరుగుతోందని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టీడీ జనార్థన్ (TD Janardhan)ను అడగ్గా... ''చర్చ ఏం లేదు! మేం పిలిచాం. మేం ఆహ్వానించడానికి ప్రయత్నిస్తే వారం రోజుల తర్వాత టైమ్ ఇచ్చారు. సరే అని వెళ్ళాం. అప్పుడు విషయం చెప్పాం. అయ్యో.... ఆల్రెడీ నేను ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నానని చెప్పారు'' అని సమాధానం ఇచ్చారు.
పుట్టినరోజులు మళ్ళీ వస్తాయి...
శత జయంతి ఒక్కసారే వస్తుందని!
హైదరాబాద్ లో శక పురుషుడు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించిన రోజునే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. జన్మదినం సందర్భంగా ఆయన ముందుగా ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. శత జయంతి వేడుకలకు ఆహ్వానించడానికి వచ్చిన వ్యక్తులకు ఆ విషయం ఆయన చెప్పారు.
''బాబూ! బర్త్ డేలు చాలా వస్తాయి. అన్నగారి సెంటినరీ (శత జయంతి) ఒక్కసారే వస్తుందని చెప్పాం. ఆ రోజు ఉదయం అభిమానులకు కలవడానికి ఉంటున్నానని చెప్పారు. ఒకవేళ ఉంటే రాత్రి వరకు ఉండి... తెల్లవారు జామున బర్త్ డే చేసుకోమని రిక్వెస్ట్ చేశాం. అయితే, ఆయనకు షెడ్యూల్ కుదరలేదేమో!? 22 మంది కుటుంబాలతో వెళుతున్నాం. ముందే అనుకున్నాను అని చెప్పారు. ఆయన నిర్ణయం ఆయన తీసుకున్నారు'' అని టీడీ జనార్థన్ వివరించారు.
కళ్యాణ్ రామ్ ను కూడా పిలిచాం!
హరికృష్ణ రెండో కుమారుడు నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram)ను కూడా తాము ఆహ్వానించామని, అయితే ఆయనకు టూర్ కు వెళ్ళారని టీడీ జనార్థన్ తెలిపారు. అదీ సంగతి! మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ గైర్హాజరు నేపథ్యంలో నందమూరి అభిమానులు కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు బాలకృష్ణకు మద్దతుగా ఎన్టీఆర్ మీద విమర్శలు చేస్తుంటే... మరికొందరు వాటికి బదులు ఇస్తూ, ఎన్టీఆర్ కు మద్దతుగా ట్వీట్స్ చేస్తున్నారు.
Also Read : ఎన్టీఆర్‌తో ఎక్కువ సినిమాలు చేసిన దర్శకుడు ఎవరో తెలుసా?
ఫ్యామిలీతో కలిసి ముందుగా కొన్ని ప్లాన్స్ చేసుకోవడం వల్ల శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ గారు హాజరు కావడం లేదని ఆయన టీమ్ మీడియాకు తెలియజేసింది. ఉత్సవ నిర్వాహకులు ఆహ్వానం ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళకు ఆ విషయం చెప్పారని వివరించారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణ, ఆ తర్వాత ప్రచారం నేపథ్యంలో ఎన్టీఆర్ బిజీ బిజీగా గడిపారు. ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి పుట్టినరోజు సందర్భంగా వెకేషన్ కు వెళ్లారు.
Also Read : ఎన్టీఆర్ గాంధీగా మారిన వేళ - నెహ్రూ ఆశ్చర్యపోయిన సభ, స్వర్ణ పతకంతో సత్కారం!