(Source: ECI/ABP News/ABP Majha)
రజినీకాంత్ వల్లే సిల్క్ స్మిత చనిపోయిందంటూ ప్రచారం - ఘాటుగా స్పందించిన ఆమె సోదరుడు
రజినీకాంత్ తో సిల్క్ స్మితకు ఎఫైర్ ఉందని, ఆయన కారణంగానే ఆమె సూసైడ్ చేసిందని సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై స్మిత తమ్ముడు స్పందించారు. బుద్ధి జ్ఞానం లేనివారే ఇలాంటి దుష్ప్రచారం చేస్తారన్నారు.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అనుకోని విధంగా అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇటీవల విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు రజినీ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో దివంగత నందమూరి తారకరామారావుతో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్న రజినీ.. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మీద ప్రశంశల వర్షం కురిపించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు రాజకీయ రంగు పులుముకున్నాయి. అధికారిక వైసీపీ నుంచి రజినీ ఓ రేంజ్ లో ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కొందరు వైసీపీ సపోర్టర్స్ సోషల్ మీడియాలో ఆయనపై వ్యక్తిగత దూషణలకు దిగారు. ఈ క్రమంలో అలనాటి నటి సిల్క్ స్మితను రజినీ వ్యవహారంలోకి తీసుకొచ్చారు.
సినీ ప్రేక్షకులను నటి సిల్క్ స్మిత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆకట్టుకునే అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని వెండితెరపై ఓ వెలుగు వెలిగిన అందాల తార ఆమె. తెలుగమ్మాయిలు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటారనుకునే రోజుల్లోనే, బోల్డ్ రోల్స్ చేసిన డేరింగ్ గర్ల్ స్మిత. కొన్నేళ్లపాటు ఇండస్ట్రీలో రాణించిన నటి.. 35 ఏళ్లకే సూసైడ్ చేసుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు రజినీకాంత్ పై విమర్శలు చేస్తున్న నెటిజన్లు.. సిల్క్ స్మిత మరణానికి రజినీ కూడా ఒక కారణమంటూ ఆరోపిస్తున్నారు. రజినీకాంత్ కి సిల్క్ స్మితతో సన్నిహితంగా ఉండేవారని, అందుకే అప్పట్లో ఆమెతో కలిసి ఎక్కువ సినిమాల్లో నటించారని ఆరోపించారు. ఆమెను మోసం చేసింది రజినీకాంత్ అని, ఆయన వల్లే మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని నెట్టింట ప్రచారం చేస్తున్నారు. దీనిపై స్మిత సోదరుడు వర ప్రసాద్ తాజాగా స్పందించారు. తన సోదరిని అనవసరంగా ఈ వివాదంలోకి లాగుతున్నారని, ఎవరో గిట్టని వాళ్ళు కావాలని ఇలా చేస్తున్నారని ఆరోపించారు.
ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ.. ‘‘స్మిత చనిపోయి దగ్గర దగ్గరా 30 ఏళ్ళు అవుతోంది. ఇప్పటికే 'డర్టీ పిక్చర్' అని సినిమా తీసి ఆమెను అవమాన పరిచారు. దాని మీద కూడా మేం ఫైట్ చేసాం. ఇప్పుడు అంతా మర్చిపోయాం. మళ్ళీ ఇప్పుడు రజినీకాంత్ తో సంబంధం అంటగడుతూ ఆమెను అవమాన పరుస్తున్నారని వరప్రసాద్ అన్నారు. రజినీ కాంత్ ని అవమాన పరచడం, చనిపోయిన వ్యక్తి గురించి అలా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. బుద్ధి జ్ఞానం ఉన్నవారు ఎవరూ కూడా ముప్పై ఏళ్ళ క్రితం చనిపోయిన వ్యక్తిని ఈరోజు వీధుల్లోకి లాగాలని చూడరు అని స్మిత సోదరుడు అన్నాడు. ఒకవేళ నిజంగానే వారి మధ్య అలాంటిది ఏమైనా ఉంటే, ఆమె చనిపోయినప్పుడే చెప్పాల్సిందన్నాడు.
రజినీకాంత్ లాంటి ఓ స్థాయిలో ఉన్న వ్యక్తి మీటింగ్ కు వచ్చి మాట్లాడితే, చనిపోయిన ఆవిడతో లింక్ పెట్టి ఇద్దరికీ ఎఫైర్ ఉందని.. ఆయన వల్లే చనిపోయిందని ఇష్టానుసారంగా మాట్లాడటం కరెక్ట్ కాదని, అది చాలా తప్పని స్మిత తమ్ముడు అన్నారు. ఇలా మాట్లాడేవాళ్ళు ఆయన పక్కన నిల్చోడానికి కూడా అర్హత లేనివారు. రజినీకాంత్ శాసిస్తే ఏమైనా జరుగుతుంది.. వీళ్ళు అసలు ఏమి చేయగలరు? అసలు ఏ ఉద్దేశ్యంతో ఏమి ఆశించి ఇలా ప్రవర్తిస్తున్నారనేది అర్థం కావడంలేదు. వాళ్లకు కుటుంబ సభ్యులు లేరా? ఇలా చేయడం తప్పని తెలియదా? అని వరప్రసాద్ ప్రశ్నించారు. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా తేల్చుకోవాలే కానీ.. ఇలా లేనివి ఉన్నట్లుగా, ఉన్నవి లేనట్లుగా సృష్టించి దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నాడు. స్మిత ఎన్నో భాషల్లో ఎందరో స్టార్స్ తో నటించింది. కానీ ఎవరూ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయలేదు. ఇప్పటి వరకూ ఆమె గురించి చెడుగా ఎవరూ చెప్పలేదు. దయచేసి సోషల్ మీడియాలో ఈ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలి. ఒకవేళ ఇదే కొనసాగిస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సిల్క్ స్మిత తమ్ముడు హెచ్చరించాడు.
ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు ప్రాంతానికి చెందిన సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. తెలుగమ్మాయి అయినప్పటికీ, మొదట్లో తమిళ మలయాళ సినిమాల్లో నటించింది. అన్ని భాషల్లో కలిపి 200 పైగా చిత్రాల్లో నటించి, మెప్పించింది. ఓవైపు ప్రధాన పాత్రలు పోషిస్తూనే, మరోవైపు ఐటమ్ సాంగ్స్ తోనూ అదరగొట్టింది. టాప్ హీరోలతో జతకట్టింది.. బికినీలు, స్విమ్ సూట్‌లు ధరించి వెండితెరను ఓ ఊపు ఊపేసింది. కేవలం సిల్క్ స్మిత కోసమే థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు ఉన్నారంటే, అప్పట్లో ఆమె క్రేజ్ ఎలా ఉండేదే అర్థం చేసుకోవచ్చు. సిల్క్ బార్ అంటూ ఇప్పటి సినిమాల్లో ఆమెను ప్రస్తావించడాన్ని మనం చూస్తున్నాం.
అయితే గ్లామర్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న సిల్క్ స్మిత.. రియల్ లైఫ్ లో ఎన్నో కష్టాలు పడింది. చివరకు మానసికంగా ఎంతో వేదన అనుభవించి 1996 సెప్టెంబర్ 23న తన ఇంట్లో సూసైడ్ చేసుకుని తనువు చాలించింది. సినిమా నిర్మాణంలో పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి నష్టపోవడంతో ఆత్మహత్య చేసుకుందని కొంతమంది భావిస్తుంటారు. మరికొందరు మాత్రం ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతోనే బలవన్మరణానికి పాల్పడిందని అంటుంటారు. ఏదేమైనా తెరపై కనిపించేదంతా అబద్ధమని, చావు మాత్రమే నిజమనే సంకేతాన్నిచ్చి సిల్క్ స్మిత తన జీవితాన్ని విషాదాంతం చేసుకుంది. ఆమె అంత్యక్రియలు కూడా దారుణంగా జరిగాయి. బంధువులు, సినీ ప్రముఖులు ఎవరూ పక్కన లేకుండా ఒక అనాధ శవంలా సాగనంపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిగాక, ఆమె సిబ్బందే అంత్యక్రియలు పూర్తి చేశారు. స్మితతో నటించిన హీరోలెవరూ ఆమెను చూడటానికి రాలేదు. అయితే హీరో అర్జున్ మాత్రం ఆ రోజు సిల్క్ స్మిత భౌతికకాయాన్ని చూసేందుకు వెళ్ళారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
Read Also: అసత్య వార్తలపై శరత్ బాబు కుటుంబ సభ్యుల ఆగ్రహం, కేసు పెడతామని హెచ్చరిక